ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!
ఈ తొమ్మిది రూపములు యేమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో "నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా!"
ఇక్కడ విశేషం యేమిటంటే నవావతార స్మరణ యెల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దానిని అవతారం అంటారు. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్రూపము అని చెప్తున్నారు.
**********
ఎంతటి ఉగ్రతేజమో... అంత మృదుమధురం
ఎంత దేహదారుఢ్యమో... అంత సమున్నత బుద్ధి బలం
ఎంత ప్రతాప రౌద్రమో... అంత తీక్షణమైన బ్రహ్మచర్యం
ఇది హనుమ స్వరూపం...
వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక అద్భుత లక్షణాల మేలుకలయిక ఆంజనేయుడు...
అందుకే ఆయన నిత్యస్మరణీయుడు.
మనుస్మృతిలో మంచి దూతకు ఉండాల్సిన లక్షణాల గురించిన వివరణ ఉంటుంది.
ప్రభువుపై అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం, దేశకాలతత్త్వం తెలిసి ఉండడం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం ఆ ఎనిమిది లక్షణాలు.
ఇవన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు ఆయన పాత్రుడయ్యాడు.
దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాం రామకార్యార్థ సిద్ధ్యర్థం జాత శ్రీహనుమాన్ శివ:
రామకార్యాన్ని సిద్ధింపజేసి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది.
శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించినట్లు చెబుతారు.
ఆయన ప్రజ్ఞాపాటవాలను రామాయణంలోని కిష్కింధకాండ అద్భుతంగా వర్ణిస్తుంది.
ఎన్నో సుగుణాలతో హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై భాసించాడు.
జై హనుమాన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి