17, జులై 2020, శుక్రవారం

*ఓ విజేత కథ*

  *జీవనం దీర్భరం అయిన సందర్భంలో వీధులలో బిచ్చ‌మెత్తుకుని జీవించాడు, బ్రతుకు తెరువు కోసం చిన్న నాటినుండే రకరకాల పనులు చేశాడు. విధిలేక ఓ ముసలి వ్యక్తికి కేర్ టేకర్ గా, సెక్యూరిటీ గార్డుగా, క్యాబ్ డ్రైవర్ గా రకరకాల పనులలో జీవితం ప్రారంభించి  ఇప్పుడు రూ.60 కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీకి య‌జ‌మాని, దాదాపు వేయి కార్లు, అనేక స్కూల్ బస్సులకు ఓనర్ ,23లక్షల ఖరీదయిన లగ్జరీ కారు... ఇది నిజమా???? ఎలా సాధ్యం???? అవును మీరు చదువు తున్నది నిజం..నిజం.సరే ఆయన ఎవరు?*

*మనిషికి ఒక ల‌క్ష్యం… దాన్ని సాధించేందుకు ఓ సంక‌ల్పం… అందుకు అనుగుణంగా ప‌ట్టుద‌ల‌, దీక్ష‌, అంకిత భావం, శ్ర‌మ‌… ఇవి ఉంటే చాలు ఏ వ్య‌క్తి అయినా, ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకుని అనుకున్న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌గ‌లుగుతాడు. ఆ కోవకు చెందిన వ్యక్తి నిజ జీవిత గాధే ఇది*

*అది బెంగుళూరుకు దగ్గరలో అనేకాల్ తాలూకాలో  గోపసంద్ర అనే గ్రామం. అక్కడ ఒక  చాలా నిరుపేద, తిన‌డానికి తిండి కూడా లేని అత్యంత క‌టిక పేద కుటుంబం. ఆయజమాని స్థానిక ఆల‌యంలో పూజారి. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు ఇచ్చే అంతంత మాత్రం తో కుటుంబం గడవక  ఊళ్లో యాచ‌న చేసి ఇంటికి ఇంత తిండి తెచ్చేవాడు.ఆయనకూడా ఆయన రెండవకుమారుడు కూడా యాచనచేసి వచ్చిన దాంతోనే  కుటుంబ స‌భ్యులు స‌రిపుచ్చుకునే వారు. ఆకుటుంబంలో  ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు.*  

*కుటుంబం గడవడం కోసం వారి రెండవకొడుకు  అక్క‌డా ఇక్క‌డా చిన్న చిన్న ప‌నులు చేస్తూ చ‌దువు కొన‌సాగించేవాడు.10వ త‌ర‌గ‌తి  వరకూ ఉపాధ్యాయులు సాయం చేసేవారు.ప్రతిగా ఆ అబ్బాయి వారి ఇల్లు ఊడ్చడం,బట్టలు ఉతకడం వంటి పనులు చేసేవాడు.  కానీ అప్ప‌టికి అత‌ని కుటుంబ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారి పోయింది. దీంతో  ఆ అబ్చాయి తండ్రి అతనిని ఓ ముసలి వ్యక్తి చర్మరోగివద్ద పనికి కుదిర్చారు. అక్కడ ఆయనకు ప్రతీ రోజు స్నానంచేయించడం ఆతని వంటి నిండా ఉన్న చర్మవ్యాధికి మందు పూయడం వంటి పనులు అతి కష్టంపై ఓ సంవత్సరం పాటు చేసినప్పటికి వారుఅత‌నికి సరైనా తిండి పెట్టేవారు కాదు*

*ఈ క్ర‌మంలో ఆ అబ్బాయిని తండ్రి ఆతనిని చెక్ పేటలో గల ఓ ఆశ్రంలో చేర్చాడు.అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే సంస్కృతం ,వేదాలు నేర్చుకున్నాడు.*

*విధి బలీయమైందికదా!!! అప్పటికే అతని అన్న పెళ్లి చేసుకొని కుటుంబాన్ని వదలి దూరంగా వెళ్ళి పోయాడు. సరిగా అప్పుడే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఆ బాలుని తండ్రి మరణించడంతో అతను మకాం ఇంటికి మారింది. తల్లి ,చెల్లి కుటుంబబారం అంతా ఆతని మీదే పడింది. వెంటనే అద్గుడి అనే ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్  కంపెనీలో చేరి ఓ సంవత్సరం పని చేసాడు. ఇక్కడే ఆతనికి జీవితంపై కసి, కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే ఆశయం బాగా బలపడసాగింది.*

*ఆతరువాత యాడ్ లాబ్ కంపెనీలో స్వీపర్ గా చేరాడు.కొంతకాలానికి శ్యాంసుందర్ ట్రేడింగ్ కంపెనీలో హెల్పర్ ఉద్యోగం సాధించాడు. ఆసమయంలోనే అప్పటివరకూ పొదుపు చేసినసోమ్ము కొంత , అప్పు చేసి కొంత డబ్బుతో తోపుడు బండిపై ప్లాస్టిక్ సామాన్లు అమ్మే మొబైల్ వ్యాపారం ప్రారంబించాడు. కానీ సరైన చదువు లేక ,సరైన గైడెన్సు ఇచ్చే మెంటార్లు లేనందున అనతికాలంలోనే 30వేల రూపాయల నష్టం  వచ్చి వ్యాపారం మూసేసాడు. కానీ ఎదో ఒకటి చేసి కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచాలనే కాంక్ష మరింత బలపడింది*.

*20సంవత్సరాల వయస్సులో ఇతనికి తల్లి ఒత్తిడి వల్ల వివాహంజరిగింది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగంచేసి ఆర్దికంగా కొంత అండను అందించసాగింది. ఇదేసమయంలో ఆ యువకుడు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం సంపాదించి, కాళీ సమయంలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు.కానీ డ్రైవింగ్ లైసెన్సుకు డబ్బులు లేక పెళ్ళి సమయంలో తనభార్య తెచ్చుకున్న ఉంగరం అమ్మి లైసెన్సు సంపాదించాడు.* 

   *చాలీ చాల‌ని జీతం వ‌స్తుండ‌డంతో డ్రైవ‌ర్‌గా జీవితాన్ని ప్రారంభిం చాడు.ఓ ప్రముఖ హాస్పటల్ లో అంబులెన్స్ నడిపి శవాలను సహితం ఒక్కడే ఉండి వారి వారి ఇండ్లకు చేర్చేవాడు. దాదాపు 300 శవాలను గమ్యం చేర్చాడు,*

  *మరోకంపెనీలో  డ్రైవ‌ర్‌గా యాత్రీకులకు ప్రదేశాలను చూపుతూ కష్టమర్స్ తో అణుకవుతో మెదలి వారి అభిమానం పొందేవాడు. అత‌ను కొన్నేళ్ల‌పాటు అనేక టాక్సీ కంపెనీల్లో పనిచేశాడు. ఓ సారి ఫ్రాన్స్  నుండి  విజిటర్స్  వస్తున్నారని ముందుగానే తెలుసుకొని వారితో నేరుగా మాట్లాడడానికి 2నెలల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు. వారి నుంచి మంచితనంతో బాటు ఆర్ధిక లాభం (టిప్సు) కూడా పొంది తానే స్వయంగా ఓ కారు కొనాలనే నిర్ణయించుకున్నాడు*.

   *తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా సంపాదించిన  డ‌బ్బుతోపాటు భార్య సంపాదించిన కొద్దిపాటి డ‌బ్బుతో  మరియు బ్యాంకు లోనుతో  2000 సంవత్సరంలో ఓ ఇండికా కారు కొని సిటీ సఫారీ అనే కంపెనీ రిజిష్టర్ చేసాడు.అనంతరం సంవత్సరంలోపే మరోకారు , ఆరునెలలో మరో కారు కొని 3కార్ల తో  తన వ్యాపారం బాగా పుంజుకున్నాడు*.

 *2006లో బెంగుళూరులో ప్రసిద్దిపోందిన ఇండియన్ సిటీ టేక్సి అనే సంస్ధ అప్పులలో కూరుకు పోయి 35 కార్లతో అమ్మకానికి  పెట్టింది. మిత్రులద్వారా ఈ విషయం తెలుకున్న అతను తన దగ్గర ఉన్న మూడు కార్లు అమ్మేసి కొంత బ్యాంకు లోను పెట్టి 6లక్షల 50 వేలకు ఆ సంస్ధను కొని దానిని ప్ర‌యివ‌సి క్యాబ్స్  పేరిట‌ సొంతంగా ట్రావెల్ కంపెనీనిగా ఏర్పాటు చేశాడు.  అక్కడనుండి ఓక్షణంకూడా వృదా చేయక తన కంపెనీ అభివృద్దికి అవిరామంగా కృచేస్తూ అనేక పెద్దపెద్ద కంపెనీలతో ట్రావెల్ ఒప్పందాలు  తన సంస్ధను లాభాలలో నడుపుతూ వృద్ధిలోకి తెచ్చాడు. జీవితంలో అన్ని కోణాలు జననం మరణం మధ్య జీవితం ను ఆయన చవి చూసాడు.*

 *మొద‌ట అత‌ని కంపెనీలో 3 కార్లు మాత్ర‌మే క్యాబ్‌లుగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు వేయికి  చేరుకుంది. అంతేకాదు, ప‌లు కార్పొరేట్ సంస్థ‌ల‌కు, స్కూళ్లు, కాలేజీల‌కు నెల‌వారీ అద్దె ప్రాతిప‌దిక‌న బ‌స్సుల‌ను న‌డ‌ప‌డం కూడా మొద‌లు పెట్టాడు. దీంతో అత‌ని ట‌ర్నోవ‌ర్ ఇప్పుడు సంవ‌త్స‌రానికి రూ.60 కోట్లుగా మారింది.  దాదాపు 1200మంది అతని ద్వారా ఉపాధి పొందుతున్నారు.*

*ఇంత సాధించినా ఆయన మాత్రం తాను ఒక‌ప్పుడు చేసిన డ్రైవ‌ర్ వృత్తిని మ‌రిచిపోలేదు. త‌న‌లా ఉద్యోగం చేసుకుని బత‌కాల‌ను కుంటున్న ఎంతో మంది నిరుద్యోగ యువ‌తీ, యువ‌కుల‌కు డ్రైవ‌ర్ క‌మ్ ఓన‌ర్ ప‌థ‌కం ద్వారా 3 ఏళ్ల‌లో క్యాబ్ సొంత‌మయ్యేలా రూ.50వేల డిపాజిట్‌తో కార్ల‌ను అందిస్తూ త‌నకు చేతనైనంత స‌హాయం చేస్తున్నాడు. వారి జీవితాల‌ను ఆర్థిక ప్ర‌గ‌తి దిశ‌గా తీర్చిదిద్దు తున్నాడు.*

*ఇప్పుడు ఆయనకు  53 ఏళ్లు. త‌న వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేస్తాన‌ని, రూ.100 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు తీసుకువ‌చ్చి, ఇంకా ఎంద‌రో నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు*. 

*ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదూ!!! ఆయన రేణుక ఆరాధ్య‌.* *MD, ప్రైవసీ క్యాబ్ కంపెనీ ,బెంగుళూర్ . ఈ వాస్తవకధ   అభిలాష, పట్టుదల ,కృషి  ఉంటే మనిషి ఎంతటి శిఖరాన్నయినా చేరుకోగలడు అనినిరూపించింది.*
*"రేణుక ఆరాధ్య‌" గురించి అనేక పత్రికలు సావనీర్స్ ప్రచురించాయి.*
*నేటి మనయువతరం ఈయనను  స్ఫూర్తి గా తీసుకొని అభివృద్ది పధంలో పయనిస్తారని ఆశిస్తూ.....*

  *హేట్సాప్ రేణుక ఆరాధ్య‌....,*

కామెంట్‌లు లేవు: