17, జులై 2020, శుక్రవారం

*కాలసూక్తమ్*

"ఏదో సామాన్యమైన, ఎలాంటి శక్తీలేనిదిగా కాలం తనను వ్యక్తం చేసుకొంటున్నది. కాని నిజానికి కాలమే కత్తిలా మానవ జీవితాన్ని క్షణం కూడ నిలకడలేక కత్తిరిస్తూ ఉన్నది" అంటూ విస్తుపోతున్నాడు మహా పండితుడు తిరువళ్ళువర్. కాలం అనే శక్తివంతమైన పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే, తక్కినవన్నీ పరిసరాలుగానీ, కూడు, గుడ్డ, నీడ మొదలైనవన్నీ మనిషికీ మనిషికీ భిన్నంగా ఉంటాయి. కాలం మాత్రం అందరికీ ఒక్కటే.

గీతలో కూడ "నేను కాలంగా ఉంటున్నాను" అంటున్నాడు భగవంతుడు. కాలం అనే దాని వినాశం చేసే అంశాన్ని గీతలో చూస్తాము. ఇక్కడ కాలం యొక్క ప్రగతి చేసే అంశాన్ని చూడగలం. అథర్వణ వేదంలో పొందుపరచబడి ఉన్న ఈ అద్భుతమైన కాల సూక్తంలో కొంత భాగం ఇక్కడ పొందుపరిచాము.

*(01) కాలో అశ్వో వహతి సప్తరశ్మిః సహస్రాక్షో అజరో భూరిరేతాః*
*తమా రోహంతి కవయో విపశ్చితస్తస్య చక్రా భువనాని విశ్వా*

ఏడు పగ్గాలూ, వేయి కళ్ళూ గలదీ, వృద్ధాప్యం లేనిదీ వీర్యంతో పరిపూర్ణమైనదీ అయిన అశ్వం రథాన్ని నడిపేటట్లు కాలం ప్రపంచాన్ని నడిపిస్తూన్నది. సకల భువనాలూ, జీవరాసులూ ఆ కాలం యొక్క చక్రాలు. మేధావులైన ఋషులు దానిని అధిరోహించి వెళుతున్నారు.

కాల ప్రభావం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని సూచించడానికే "వేయి కళ్ళూ" కలదిగా కాలం పేర్కొనబడింది. ఇంద్రధనస్సు యొక్క ఏడు రంగులు ఏడు పగ్గాలుగా తెలుపబడ్డాయి. "వీర్యంలో సంపూర్ణం" అనే మాట సమస్తాన్ని సృజింపజేసే శక్తి గలది కాలం అని సూచిస్తుంది.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: