. ప్రసాద్ భరద్వాజ
అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.
ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.
రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.
కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యం, హస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.
కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది.
నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్, చెప్పినా, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలలో స్పష్టత ఉండదు. అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించి, వారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి.
సశేషం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి