17, జులై 2020, శుక్రవారం

రెండు కట్టెలు ఒక వివరణ

ఇదం కాష్టం ఇదం కాష్టం 
నధ్యం వహతి సంగతః| 
సంయోగాశ్చ వియోగాశ్చ 
కా తత్ర పరివేదన|| 

ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగ దుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరము లేదు. 

ఈ శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.

ఇందులో  వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే! 

మరి పరివేదన పనికి రాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం.  దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు. 

 ఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.

మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా. 

ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే! 

ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం

కామెంట్‌లు లేవు: