13, జులై 2020, సోమవారం

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*

*శ్లోకం:*
*అల్పతోయశ్చలత్కుమ్భో హ్యల్పదుగ్ధాశ్చ ధేనవః ।*
*అల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితః ॥*
        సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా

*ప్రతిపదార్థం:*
అల్పతోయః = తక్కువ నీరు కల, కుమ్భః = కుండ, చలత్ = చలిస్తుంది, చ = మరియు, ధేనవః = ఆవులు, అల్పదుగ్ధాః = తక్కువ పాలు కల విగా ఉంటాయి,  
అల్పవిద్యః = తక్కువ విద్య కలవాడు , మహాగర్వీ = గర్వం కలవాడుగా ఉంటాడు, కురూపీ = అంద విహీనుడు, బహుచేష్టితః = ఎక్కువ చేష్టలు చేస్తూ ఉంటాడు,

*Meaning:*
The less water in the pot makes it to shake. The cows that are active will give less milk. The person with less education has more egoistical. The person who is ugly does more advances. 

*తాత్పర్యం:*
నీరు తక్కువగా ఉన్నచో ఆ నీరు కుండని కుదిపేస్తుంది. నీళ్ళు తక్కువ ఉన్న కుండ తొణుకు తుంది.  చాలా హుషారుగా ఉండే ఆవులు పాలు తక్కువ ఇస్తాయి. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలు ఇస్తుంది. అలాగే చదువు తక్కువైన కొలది గర్వం ఎక్కువ. ఎక్కువ చదువుకోని వాడు ఎంతో గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. అంద విహీనుడు ఎక్కువ (శృంగార) చేష్టలు చేస్తూ ఉంటాడు. అనాకారికి వికార చేష్టలు ఎక్కువ. 

బాగా చదువుకున్న వాడూ, అన్నీ తెలిసిన వాడు మిడిసిపాటు పడకుండా ఉండడము అణకువగానూ మంచి నడవడితో ఉండడమూ  లోకంలో చూస్తూ ఉంటాం. అలాగే విద్యాశూన్యుడు అతిగా మిడిసిపడుతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాము. అటువంటి వారిని ఉద్దేశించే జనబాహుళ్యంలో ప్రచారంలో *అల్పుడెపుడు పల్కునాడంబరము గాను* మరియు *నిండుకుండ తొణకదు* అనే నానుడులు వెలసాయి.  

చదువు గలిగి నమ్రతతోనూ వినయవిధేయులుగా ఉండడానికీ   పిల్లలకి తగురీతిలో శిక్షణ ఈయవలసిన బాధ్యత తల్లిదండ్రులది. *విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం* అని మన పెద్దలు ఎలాగూ చెప్పనేచెప్పారు

కామెంట్‌లు లేవు: