13, జులై 2020, సోమవారం

నిర్గుణోపాసన

పరమాచార్య స్వామివారు అప్పుడప్పుడు ఒక విలక్షణమైన పూజ నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా మహాప్రదోష సమయంలో. త్రయోదశి ఘటియలు సాయంత్రం వ్యాపించి ఉంటే ఆ సమయం మహాప్రదోషమని పిలవబడుతుంది. 

శ్రీవారు తమ ఎదురుగా ఆవుపేడతో అలికి ముగ్గు వేయబడి ఉన్న ప్రదేశంలో ఒక ఆకు పరచి దానిపై దేవతావాహన చేసేవారు. విగ్రహాలు ఏవీ ఉండేవికావు. కానీ మానసికంగా జరుగుతున్న ఆ పూజలో శ్రీవారి ముద్రలు హావభావాలు అక్కడ త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు విరాజమానులయి ఉన్నారన్న విషయం చూసేవారికి అవగతమయ్యేది. 

అభిషేకం చూసిన జ్ఞాపకం లేదుకాని ఉపచారములన్నీ వివిధ ముద్రలలో వారికి మాత్రమే కనిపించే జగత్పితరులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించడం నేను అనేక పర్యాయములు చూసిన అదృష్టాన్ని నోచుకున్నాను. భక్తులలో పండితులు రుద్రత్రిశతి చెబుతుంటే స్వామివారు అతిలాఘవంగా లేత బిల్వదళాలతో అర్చన చేసేవారు. దోసెళ్ళతో తుమ్మెపూలు సమర్పించేవారు. అనేక ఫలజాతులతో నైవేద్యం జరిగేది. ఈ పూజకు తుమ్మిపూలు, బిల్వదళాలవంటి సంభారాలు సమయ మెరిగి తీసుకొనివచ్చే మాతృమూర్తులు, శిష్యులు ఉండేవారు. 

పూజ ముగించి ప్రదక్షిణ చేసి మహాస్వామివారు నమస్కారం చేసేటప్పటి వారి ముఖంలో ఆర్ద్రతతో కూడిన భక్తిభావం ఈ రోజుకూ నాకనులకు కట్టినట్లు కనిపిస్తోంది. అంతటి స్వామికి ఎంతటి వినయం? ఎంతటి భక్తి? మా కనులకు దురదృష్టమావహించి స్వామి ఎదుటనున్న త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు మాకు కనిపించలేదు. కానీ ఆ సమయంలో పరివార దేవతలందరితో కూడిన చంద్రమౌళీశ్వరుడిక్కడ విరాజమానుడయి ఉన్నాడని నా ప్రగాఢ విశ్వాసం. 

స్వామివారి కృపాదృష్టి మాపై సోకిఉంటే పౌర్ణమినాటి రాత్రి మాంగాడు కామాక్షీ దర్శనాన్ని తమ పారిషదులకు అనుగ్రహించినట్లు మాకనుగ్రహించకపోదురా!

అది మాంగాడు కామాక్షీదేవి కుంభాభిషేకం సమాయం - స్వామివారు కుంభాభిషేకం చేయడానికి అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక ఝాముకాలం చంద్రుని చూస్తూ లలితాసహస్రనామం పారాయణం చేయడం స్వామివారి అలవాటు. ఆరోజుకూడా అలానే పారాయణం జరుగుతోంది. ప్రక్కన పన్నెండుగంటలకు గాలిగోపురం నెత్తిమీదకు చంద్రుడు వచ్చాడు. పారాయణం చేస్తున్న స్వామి ఆనంద సంభ్రమాలతో నిలుచుని చేతులు జోడించి పారిషదులతో ‘చూడరా అమ్మ’ అన్నారట. వారికి అర్థమయింది. స్వామికి అమ్మ కామాక్షి సగుణరూపంలో దర్శనం ఇస్తోంది. చేతులు జోడించి “ఎక్కడ” అన్నారు. అదిగో అన్నారు స్వామి. అంతే! ఆ పారిషదునికి గోపురమంతా అమ్మగా దర్శనమిచ్చింది. అప్పటి ఆ పారిషదుని హృదయస్థితి ఎలా ఉండి ఉంటుంది? 

అయ్యయ్యో! మహాపెన్నిధిని అతి దగ్గరగా పెట్టుకొని వారిని ఉపయోగించుకొని అమ్మను చూడలేకపోయానే అని దుఃఖం కమ్ముకొని వస్తుంది నాకు. అంతలో ఆ అమ్మ ఈ స్వామికదా! ఇప్పటికీ నాలో లేదా అనిపిస్తుంది. చదువరులలో ఉన్న మహాతపస్సంపన్నులారా నా స్వామిని నాలో నిరంతరం నిరంతరాయంగా దర్శించుకొనే అనుగ్రహం చేయరూ? 

కొంతమంది అనుకుంటారు. భక్తి అనేది ద్వైతభావంలోనిది. జ్ఞానికి కర్మ, భక్తి, పూజ అనేవి లేవని ఉద్ఘాటిస్తూ ఉంటారు. స్వామివారు జ్ఞాని కూడా భక్తిభావంలో లీనమయి ఉంటారని నిరూపించారు. వీరికి ముందే శుకాచార్యులు వారు, సదాశివబ్రహ్మేంద్రులు, మధుసూదనానంద సరస్వతి స్వామివంటి వారు కూడా ఈ విషయాన్ని తాము భక్తిభావంలో లీనమయి రూఢిపరచారు. 

శుకాచార్యులవారు జ్ఞాని కాని భక్తుడు పరమేశ్వరుణ్ణి ముక్తికోసం ఆరాధిస్తుంటే ముక్తుడైన జ్ఞాని భక్తిని భక్తికోసమే పెంపొందించుకుంటాడంటారు. జ్ఞానికి ఇటువంటి విశిష్టమైన భక్తి ప్రసాదించడం అంబికలీల అంటారు మహాస్వామివారు. నిజానికి జ్ఞానికి ఇటువంటి భక్తిని నెరపడం వలన ప్రయోజనముండకపోవచ్చు. ఆచార్య పదంలో ఉన్న స్వామివారివంటి జ్ఞానులు ఇటువంటి భక్తి కలిగిఉండటం మన మార్గదర్శకత్వానికే కావచ్చు. 

మహాస్వామివారు తుదినాళ్ళలో కేవల సమాధ్యవస్థలో ఉంటూ కూడా బాహ్యస్మృతిలోనికి వచ్చినప్పుడు సంధ్యావందనాద్యనుష్టానములు గతి తప్పక నిర్వహిస్తూ ఉండేవారు.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: