మధ్యతరగతి ఆర్భాటాలు కి భేషిజాలకి మచ్చుతునక ఈ కధ...
సండే స్పెషల్
కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద -” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా చాలా వ్రాసి ఉండడం చూస్తూంటాం.
కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన/అర్ధం/భావం.
మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర - “పక్కింటోళ్ళ చలవ” అనే Sticker కనపడిందో కారుమీద.
దానర్ధం బోధ పడ్లేదు - ఎందుకంటే ప్రక్కింటోడు కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో.
దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత కలిగి పెరిగి పోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను.
ఒక అరగంట తర్వాత ఆయన వచ్చి తలుపు తీయబోతుంటే “excuse me Sir “ అంటూ ఆయన్ని పలకరించాను.
“ఏం కావాలి” ఏదో అర్ధించి వచ్చేవాడిని చూసినట్లు చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.
“ఏం లేద్సార్ … చిన్న సందేహం. మీకు అభ్యంతరం లేకపోతే….” అని కొంచెం low voice లో అన్నాను.
నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని -” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.
“ఏం లేద్సార్ , మీ కారు వెనక - పక్కింటోళ్ళ చలవ - అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.
“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, నాకు చాలా చాలా సుఖాలు కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అప్పు చేసి మరీ కొన్న కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” ఓపిగ్గా చెప్పాడు కారు యజమాని.
చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి