*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా*
*న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।*
*వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే*
*క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥*
భావార్థం:
వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.
భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.
వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి