14, సెప్టెంబర్ 2020, సోమవారం

రామాయణమ్.61


.
 లక్ష్మణా ! నీవు సుయజ్ఞుల వారింటికి వెళ్ళి వారిని సగౌరవముగా ఇచ్చటికి తీసుకొనిరా!
.
వశిష్ఠుల వారింట్లో మామగారిచ్చిన రెండు దివ్యధనువులు,రెండుదివ్యఖడ్గములు,అక్షయతూణీరములున్నవి అవి తీసుకొనిరా! .
.
అన్న ఆజ్ఞను పాటించి అవి తీసుకొని వచ్చాడు లక్ష్మణుడు.
.
తమ్ముడూ నా సంపదలన్నీ బ్రాహ్మణులకు దానము చేయవలెనని నాకోరిక కావున వేగమే వారిని తీసుకొని రమ్ము అని పలికాడు ..
.
వశిష్ఠుల వారి పుత్రుడు సుయజ్ఞుడు రామమందిరానికి లక్ష్మణునునితో కలసి ఏతెంచాడు ,ఆయనకు రాముడు తనవద్ద ఉన్న విలువైన ఆభరణములు ,ఇతరసంపదలు,శత్రుంజయము అనే ఏనుగును ఇవ్వగా ,ఆయన భార్యకు సీతమ్మ తన హారమును,వడ్డాణమును బహూకరించింది! .
.
వచ్చిన బ్రాహ్మణులందరికీ ఘనంగా దానాలు చేశాడు రామచంద్రుడు!
.
చిత్రరధుడు అనే రధసారధికి అమూల్యమైన రత్నములు,చిన్నిపశువులు,వేయిగోవులు ఇచ్చాడు.
.
అలా తన వద్దనున్న అందరికీ ,అందరు పనివారికీ ఎల్లరూ సంతోషపడేటట్లుగా తన సమస్తసంపదలు దానం చేశాడు రాముడు.
.
ఇలాగ రాముడు తన సంపదలన్నీ దానం చేసిన తరువాత ఆయన మందిరంలోకి ఎముకలప్రోవులాగా బక్కపలుచగా ఉండి అపూర్వమైన తేజస్సుతో కనపడుతున్న ఒక ఆకారం నడుచుకుంటూ వచ్చింది .ఆచ్ఛాదనగా అంగవస్త్రం మాత్రమే ఉన్నది .
.
రాముడు దానాలిస్తున్నాడని తెలిసి అతని భార్యపంపగా ఆశతో వచ్చాడు .ఆయన ప్రస్తుతము గునపము ,తట్ట పట్టుకొని కందమూలఫలములు ఏరుకుంటూ జీవిస్తున్నాడు ! రాముడివద్దనుండి దానం పుచ్చుకుంటే దరిద్రం తీరుతుందనే గంపెడాశతో వచ్చాడు !
.
అతని పేరు త్రిజటుడు ! ఆయన రాముని వద్దకు వచ్చి రామచంద్రా పిల్లలుగలవాడను వారిపోషణ భారముగా నున్నది నీవిచ్చే దానము స్వీకరించాలనే పెనుకోరికతో వచ్చానయ్యా!
.
అతనిని చూడగనే రామునికెందుకో పరిహాసము జనించింది !
పరిహసిస్తూ నీ చేతిలోని దండము నీవెంతదూరము విసరెదవో అంత పొడవునా ఉండే సహస్రగోసముదాయములు నీకు ఇచ్చెదను అన్నాడు. ( స్వామికి కూడా పరిహాసము పుట్టించేటంత బలహీనంగా ఉన్నాడాయన).
.
ఆ త్రిజటుడు సంతోషించి చేతిలోని దండాన్ని బలంకొద్దీ విసిరాడు ఆ దండము సరయూ నదిని దాటి వేలకొలదీ ఆవులున్న మందలు ఆబోతుల మధ్యలో పడింది .
.
రాముడు వెంటనే ఆ వృద్ధబ్రాహ్మణునుని కౌగలించుకొని ఆయనకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గోవులనూ గోపాలకులతో సహా ఇచ్చివేసి ఆయనను బ్రతిమాలుకున్నాడు
.
 మహాత్మా నన్ను క్షమించవయ్యా నిన్ను పరిహసించాను ,నా మీద కోపించకయ్యా ! నీవు .
నీ తేజస్సు తెలుసుకోవలనే అలాగ చేశాను నీకు ఇంకా ఏ కోరిక ఉన్నా చెప్పు నేను తీరుస్తాను అని వినయంగా వేడుకున్నాడు.
.
రామా ! దయాసముద్రా! అమృతహృదయా! నాకింతకన్నా వేరే ఏమీ అవసరము లేదయ్యా! నీ యశస్సు దశదిశలు వ్యాపించుగాక,నీ బలము ,ఆనందము వృద్ధిపొందుగాక అని ఆశీర్వదించి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు..
.
.N.B.
.
ఎల్లవేళలా మనిషి ఒకే mood లో ఉండడు !
ఎన్నో భావాలు చుట్టుముడుతూ ఉంటాయి .అయితే ఆ భావాలను మనము గమనిస్తున్నామా ? లేదా? అనేదే ప్రశ్న! .
.
భావాలను సాధారణంగా మనము గమనించము .
మనలో చెలరేగే భావాలను ఒక సాక్షిగా మనము గమనించటం అలవాటు చేసుకోవాలి.
అది అలవాటయినప్పుడు ఒక వేళ పొరపాటు జరిగినా రాముడిలా సరిదిద్దుకోవచ్చు .
Continuous Self Introspection is needed.
అప్పుడే మనిషిగా మన ప్రయాణం మొదలయినట్లు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: