*****
*శ్లో:- బాల స్తావత్ క్రీడా సక్తః ౹*
*తరుణ స్తావత్ తరుణీ సక్తః ౹*
*వృద్ధ స్తావత్ చింతా సక్తః ౹*
*పరమే బ్రహ్మణి కో౽పి న సక్తః ౹౹*
*****
*భా:- బాలలు మనసారా,తృప్తిగా కడుపునిండా రుచికరమైన ఆహారము, రకరకాల తిను బండారాలు ఆరగిస్తూ, అంబరాన్నంటిన సంబరాలు, కేరింతలు, ఆట పాటలలో మునిగి తేలుతుంటారు. బాదరబందీ లేని జీవనశైలి వారిది. ఉరకలు వేసే వయసు, ఉద్వేగంతో ఊగి పోయే మనసుతో ఉరుకులు, పరుగులు తీసే యువకులు చదువు సంధ్యల పట్ల శ్రద్ధాసక్తులు చూపించక, నిరంతరం మన్మధ సామ్రాజ్యభావనాకాశతరంగాలలో, మధురోహలలో ఓలలాడుతూ యువతుల పట్ల ఆకర్షితులై తిరుగు తుంటారు.ఇల్లు-వాకిలి,బరువులు-బాధ్యత వారికేమీ పట్టవు. వయోవృద్ధులు పుత్రపౌత్రాదుల విద్యా, ఉపాధి, వివాహ, కుటుంబ సంక్షేమ రంగాలలో వెన్నాడుతున్న ఎడతెగని సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా దిగులు పడుతుంటారు. పోనీ పూనుకొని చేయగల జవసత్వాలు ఉన్నాయా! లేవు. అయినా అనవసరంగా తాపత్రయం పడుతుంటారు. ఇక సృష్టిస్థితిలయ కర్త, సర్వ శుభ మంగళ సంపత్ ప్రదాత, సర్వాంతర్యామి, మోక్షదాత అయిన భగవంతునిపై ఇసుమంత ఆసక్తి కనబరచే వారే లోకంలో కరువై పోయినారు గదా౹ బాల్య,కౌమార,యౌవన,వృద్ధాప్య దశలలో స్మరణకు రాని దేవుడు అవసానకాలంలో ఆకస్మికంగా ఎలా స్మరణకు రాగలడు? ఆది నుండి అలవడితేనే, అంత్య కాలాన అక్కరకు వస్తుందని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి