19, నవంబర్ 2020, గురువారం

మహాభారతము '81 ..

'మహాభారతము '81 ..


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


తన శరీరమునుండి యెంత మాంసము కోసి త్రాసులో వేస్తున్నా, బుల్లి పావురము బరువుకంటే తక్కువగా త్రాసు చూపిస్తుంటే,  ఆశ్చర్యంతో పాటు, కొంత అనుమానం వచ్చింది,శిబిచక్రవర్తికి.  


తనను పరీక్షించాలని దేవతలు సృష్టించిన మాయ అన్నా అయివుండాలి, లేదా తనను పరాభవించాలని రాక్షసులు పన్నిన పన్నాగమైనా అయివుండాలని,  భగవన్నామ స్మరణ చేస్తూ, తనకు తానే అర్పించుకునే వుద్దేశ్యంతో, శిబిచక్రవర్తి,  తన శరీరమంతా తీసుకొమ్మని, డేగతో చెప్పి, ఆ త్రాసులో కూర్చున్నాడు.  తనను తాను అర్పించు కుంటున్న ఆ దృశ్యం చూసి సభికులు హాహాకారాలు చేశారు.  దేవతలు పైనుండి పుష్పవృష్టి కురిపించారు.  


అంతలో, 'ఉశీవరమహారాజా !  నీ ధర్మరక్షణా ప్రవ్రుత్తి అమోఘం.  నేను డేగరూపం లోవచ్చిన ఇంద్రుడను.  ఈ కపోతం  అగ్నిభట్టారకుడు.  ఒక చిన్నిపావురం కోసం నీవు పడిన ఆరాటం, నీ దేహత్యాగానికే సిద్ధపడిన మనోధైర్యం బహుధా ప్రశంశనీయం.  ఇట్టి త్యాగబుద్ధిగలవారు త్రిభువనాలలో యెవరూ లేరు.  నీ కీర్తి ఆచంద్రతారార్కం నిలిచిపోతుంది.  ఇదే మా ఆశీర్వాదం. ' అని ఇంద్ర అగ్నిదేవులు తమ నిజరూపాలతో ప్రసన్నులై,  ఆశీర్వదించి, అంతర్ధానమయ్యారు.  శిబిచక్రవర్తి, తన శరీరంలో మాంస విచ్చేదనకు చేసుకున్న గాయాలను కూడా పోగొట్టుకుని, తన అసలుదేహాన్ని పొందాడు.

 ' ధర్మజా !  ఈ శిబిచక్రవర్తి నివసించిన స్థలంలో కొద్దీ సేపు తిరిగి, దేవతల అనుగ్రహానికి మీరంతా పాత్రులు కండి. ' అని లోమశమహర్షి చెప్పాడు.


ఆ తరువాత,  వారంతా, శ్వేతకేతువు ఆశ్రమాన్ని దర్శించారు. ' ఉద్దాలకమహర్షి కుమారుడు శ్వేతకేతువు.  శ్వేతకేతువుకి, సరస్వతీ మాత, పిలిస్తే పలుకుతుందని, దర్శనమిస్తుందనీ అక్కడివారంతా అనుకుంటారు. శ్వేతకేతువుకీ, అష్టావక్రమహర్షికి, మేనమామా  మేనల్లుళ్ళ సంబంధం వున్నది. ' అని లోమశుడు చెప్పగానే, ఆయన చరిత్ర వినాలని వున్నదనీ, ఆ మహానుభావుడు అష్ట విధములైన వక్రములతో జన్మించిన కారణమేమిటనీ కుతూహలంగా ధర్మరాజు లోమశుని అడిగాడు.

అష్టావక్ర చరిత్ర లోమశమహర్షి చెప్పసాగాడు :  


ఉద్దాలకమహర్షి వద్ద కహోధుడు  అనే శిష్యుడు వుండేవాడు.  ఆతడు ఏకసంథాగ్రాహి.  .  అతని గురుభక్తికి, విద్య పట్లవున్న శ్రద్ధకు, మెచ్చి   ఉద్దాలకుడు  సర్వ  విద్యలు  కహోధునికి నేర్పి, తనకుమార్తె అయిన సుజాతను కూడా యిచ్చి వివాహం జరిపించాడు.


సుజాతకు కొంతకాలానికి గర్భం ధరించి,  గొప్ప తేజస్సుతో వున్న పిండాన్ని, గర్భంలో మోస్తూ వున్నది.   ఒకనాడు, సుజాత, కహోధుని  ప్రక్కనే వుండగా, కహోధుడు  శిష్యుల చేత వేదాలు వల్లెవేయిస్తున్నాడు.  ఆ సమయంలో కహోధునికి  వినబడేటట్లు, గర్భస్థశిశువు, ' తండ్రీ !  మీరెంతో శ్రమకోర్చి రేయింబవళ్లు, శిష్యులచేత శాస్త్రాలు వల్లె వేయిస్తున్నారు, కానీ, శిష్యులలో ఉచ్చారణ సరిగాలేదు. ఎక్కడో లోపం వున్నది. సరిదిద్దండి. '  అన్న పులుకులు సుజాత గర్భంలో నుండి కహోధునికి  వినిపించాయి.  తనకు పుట్టబోయే పిల్లవాడే యీవిధంగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని, కహోధుడు  మొదటి క్షణంలో శిశువు పరిజ్ఞానానికి సంతోషించినా, శిష్యులు యీ విషయం విని వుంటారని,  తనను చులకన చేసినట్లుగా భావించి, ' బాలకా ! గర్భంలో వున్నప్పుడే యీ విధంగా పెద్దలతో వక్రభాష్యం చేస్తున్నావు.  నీకు సుందరమైన శరీరం కూడా వుంటే, నీ అహంకారం మరీ యెక్కువవుతుంది.  కాబట్టి అష్టావక్రునిగా జన్మింతువు గాక ! ' అని పుట్టబోయే కుమారుని శపించాడు, కహోధుడు.


సుజాతకు నెలలు నిండుతుండగా, పురిటిఖర్చులకై, ధనార్జన కోసం కహోధుడు, జనకమహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు.  అక్కడ వంది అనే పండితుని జయించి ధనం సంపాదించవలెనని, అతనితో పండితచర్చ జరిపి, ఓడిపోయి, అక్కడి నిబంధనల ప్రకారం, జలప్రవేశం చేసి వుండిపోయాడు.  తనను విడిపించే పండితుడు వచ్చేవరకు, కహోధుడు జలంలో వుండిపోవలసిందే ! .  ఈ విషయం ఉద్దాలకునికి తెలిసి, సుజాతకు చెప్పాడు.  ఆమెకు  పుట్టబోయే బిడ్డకు యీ విషయం తెలియకుండా రహశ్యంగా వుంచమని చెప్పాడు.


కాలం యెవరికోసం ఆగదుకదా !  సుజాత మగబిడ్డను ప్రసవించింది.  తండ్రి శాపం కారణంగా ఎనిమిది విధాలైన వంకరాలతో బిడ్డ శరీరం తిరిగిపోయి వున్నది.  అతనికి అష్టావక్రుడు అని నామకరణం చేశారు.  తండ్రి సుఖం తెలియని అష్టావక్రుడు, తాతగారైన ఉద్దాలకునే తండ్రిగా , శ్వేతకేతువుని సోదరునిగా భావిస్తూ బాల్యం గడిపేశాడు.  ఆ విధంగా 12  సంవత్సరాలు గడిచాయి.  అష్టావక్రుడు అన్నిరకాలైన శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు. ఉపనిషత్తులను అవపోశనపట్టాడు.  తర్క మీమాంసలలో తిరుగులేని పాండిత్యం సంపాదించాడు.  ఎంతటి విద్వంసుడినైనా ఢీ కొట్టగల సామర్ధ్యం తెచ్చుకున్నాడు.  


ఒకనాడు, అకస్మాత్తుగా, ఉద్దాలకుడు తన తండ్రికాదనీ, తన తండ్రి యెక్కడో ఉన్నాడనీ చూచాయగా తెలుసుకున్నాడు, అష్టావక్రుడు.  తల్లిని చెప్పమని బలవంత పెట్టాడు.  ఆమె విధిలేక జరిగినదంతా చెప్పింది అష్టావక్రునికి.  అష్టావక్రునికి ఆనాటినుండీ కంటిమీద కునుకు కరువయ్యింది.  నోటికి తిండి సహించడంలేదు.  మనసు పితృ రుణం తీర్చుకొమ్మనీ, తండ్రిని విడిపించుకుని తీసుకురమ్మని తొందర పెడుతున్నది. ఇక  ఆగలేక, శ్వేతకేతువుతో  ' జనకమహారాజు మిథిలానగరంలో అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాడట. అనేకమంది అందులో పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది.  మనమూ అక్కడకు వెళదాము.  పెద్దలద్వారా అనేక మంచివిషయాలు తెలుసుకుందాము. '  అని తొందరపెట్టి, శ్వేతకేతుతో కలిసి మిథిలానగరానికి బయలుదేరాడు అష్టావక్రుడు.


మిథిలానగరిలో అడుగుపెడుతున్న వారికి, ఎదురుగా వస్తున్న రాజుగారి ఊరేగింపు దర్శనమయ్యింది.  రాజదర్శనం అవుతున్నదని సంతోషంతో వారు ముందుకు వస్తున్నారు.  అంతలో... 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: