19, నవంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 85*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 85*   

                                   *****

      *శ్లో:- దర్శనే  స్పర్శనే  వా౽పి౹*

            *భాషణే  భావనే  తథా ౹*

            *యత్ర  ద్రవ త్యంతరంగం ౹*

            *స  స్స్నేహ:  ఇతి కధ్యతే ౹౹* 


                                   *****

*భా:- భగవంతుడు సృష్టిలో మనకు ప్రసాదించిన అమూల్య రత్నం మిత్రుడు. తల్లీ, తండ్రీ తరువాత మన హితోభిలాషి చెలికాడే. అతని స్నేహ మాధురీమహిమ నాలుగు విధాలు.  1. "దర్శనం":- బాల్య స్నేహితుడైన  కృష్ణుణ్ణి చూడగానే కుచేలుని ఉల్లం పల్లవించింది. హృదయం పరవశించింది. ఆపదలో ఆదుకోమని అడగడం కూడా మరిచిపోయేలా చేసింది. అదీ స్నేహమంటే. 2. "స్పర్శనం" :- ఆర్ఘ్యపాద్యాల సమర్పణలో మిత్ర కరస్పర్శనం వల్ల  కలిగిన   అనిర్వచనీయమైన ఆనందం వల్ల అంతరంగం ద్రవీభూతమైంది. జన్మ తరించిందనుకొన్నాడు కుచేలుడు. అదీ స్నేహం అంటే. 3. "భాషణం" :- పోరులో నీరుకారిపోతున్న సఖుడైన పార్థునికి  శ్రీకృష్ణుని గీతాభాషణం పునరుత్తేజితుణ్ణి చేసింది. భీరువుని వీరునిగా మార్చి, అమేయబలంతో వీరోచితంగా పోరాడేలాచేసి, ధన్యుణ్ణి చేసింది. అదీ స్నేహమంటే. 4. "భావన":- విపత్తులు, ఆపదలలో ఉన్నా సత్య ధర్మనిరతులై,  సత్కార్యాలు నిర్వహిస్తున్న పాండవులకు బంధువుగా కాక "మిత్రుడు" గానే అనుక్షణం కొండంత అండగా ఉండి, ఆదుకోవాలనే పవిత్ర భావన కలిగియుండడమే శ్రీకృష్ణుని ఉదాత్తత. అదీ స్నేహమంటే. ఈ విధంగా దర్శన, స్పర్శన, భాషణ, భావనల వల్ల హితుని మదిని, హృదిని ఆర్ద్రతతో ద్రవింపజేయగలగడమే  స్నేహ మనే పదానికి నిజమైన అర్థము,పరమార్థమని సారాంశము*.

                                *****

                 *సమర్పణ  :   పీసపాటి*    

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: