శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము
సత్యనారాయణ సద్వ్రతక్రియను
నాల్గు వర్ణంబుల నరులు యెల్లరును
వఱలిన భక్తితో వనితలుగూడ
చేయంగవచ్చును స్థిరచిత్తమునను
పౌరాణ వైదిక ప్రక్రియందునను
యరయ బ్రాహ్మణులంత యర్చించవలయు
బ్రాహ్మణేతరులంత పౌరాణికముగ
సత్యదేవునివ్రతము సల్పంగవలయు
ఏ దినమున నైన యీ సత్యవ్రతము
సాయంత్రవేళలో సల్పుటుత్తమము
సత్యనారాయణ సద్వ్రతమునకు
బ్రాహ్మణవర్యులన్ బంధుమిత్రులను
ప్రీతిపాత్రంబుగా పిలుచుకోవలయు
కదళీఫలంబులు ఖండచెక్కరయు
గోక్షీర గోఘృత గోధుమనూక
బియ్యపునూకైన బెల్లంబుతోడ
కలిపి ప్రసాదంబు గావించవలయు
అత్యంత భక్తితో యా ప్రసాదమును
నైవేద్యమొనరించి నారాయణునకు
యంత తాంబూలంబు నర్పించవలయు
ఆ సత్యవ్రతపు యధ్యాత్మకథను
నాలకించవలయు నతిభక్తితోడ
సద్భక్తితోడను తదుపరందఱును
తీర్థ ప్రసాదముల్ తీసుకోవలయు
తదుప రాహూతులౌ సద్బ్రాహ్మణులకు
విరివిగా దక్షిణ లీయంగవలయు
పిదప బ్రాహ్మణులతొ ప్రియబాంధవులతొ
భోజనంబును ప్రీతి భుజియించవలయు
భోజనకార్యంబు పూర్తైన పిదప
సత్యదేవునిహృది సంప్రీతికొఱకు
యధ్యాత్మికానంద మనుభవించుటకు
సంగీత నృత్యాది సత్కార్యములను
సద్భక్తితోడను జరిపించవలయు
భక్తితో భజనలో పాల్గొనవలయు
సత్యనారాయణ సద్వ్రతమిట్లు
యానందడెందాన నాచరించినచొ
సకలవాంఛాసిద్ధి సమకూరు నిలలొ
ఇహపర సౌఖ్యముల్ యిచ్చునీ వ్రతము
కడువెతలుండెడి కలియుగమందు
యిహమందు రక్షణ యిచ్చి కాచుటకు
పరమందు మోక్షంబు బడయజేయుటకు
సత్యనారాయణ సద్వ్రతమెపుడు
మానవులొనరించి మనుచుంద్రుగాక ! " 19
తే. నరుల బాధలు బాపగ నారదుండు
వేడుకొనగను కరుణించి విష్ణుమూర్తి
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
స్వయముగారీతి బోధించె సర్వులకును 20
క. మునిసూతుం డావిధముగ
శౌనక ఋషిపుంగవులకు సత్యవ్రతమున్
వినయంబున బోధించగ
వినిరందఱు సంతసమున వీనులుపొంగన్ 21
మొదటి అధ్యాయము సమాప్తము
సశేషము …..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి