19, నవంబర్ 2020, గురువారం

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 19  / Sri Devi Mahatyam - Durga Saptasati - 19 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 4 🌻*


83-84. ఋషి పలికెను : 

రాజా! దేవతలు ఇలా స్తోత్రాదు లొనర్చుచుండగా, పార్వతీదేవి గంగాజలాలలో స్నానార్థం అచటికి వచ్చింది.


85. అందమైన కనుబొమలతో ఆమె “మీరు ఇప్పుడు స్తుతించింది ఎవరిని?” అని అడిగింది. ఆమె శరీర కోశం నుండి శుభమూర్తియైన ఒక దేవత ఉద్భవించి ఆ ప్రశ్నకు ఇలా బదులు చెప్పింది.


86. శుంభాసురునిచే తిరస్కరించబడి, నిశుంభునిచే యుద్ధంలో ఓడించబడిన దేవతాగణం ఈ స్తోత్రాన్ని నన్ను గూర్చి చేసారు”.


87. ఆ అంబిక పార్వతీశరీర కోశం నుండి వెలువడింది కనుక ఆమెను "కౌశికి” అనే పేరుతో లోకాలన్ని కీర్తించాయి.


88. ఆమె వెడలివచ్చిన పిమ్మట పార్వతి నల్లనై కాళికా నామంతో పేర్కొనబడుతూ, హిమాచలంపై నివాసం ఏర్పరచుకుంది.


89. అంతట అత్యంత మనోహర రూపాన్ని ధరించి ఉన్న అంబికను (కౌశికిని) శుంభనిశుంభ భృత్యులైన చండముండులు చూసారు.


90. వారు ఇరువురూ శుంభునితో “మహారాజా! అత్యంత మనోహరరూప అయిన ఒకానొక స్త్రీ హిమాలయ పర్వతాన్ని ప్రకాశింప జేస్తూ అచట ఉంది.


91. అట్టి అత్యుత్తమ సౌందర్యాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఎరుగరు. అసురేశ్వరా! ఆ దేవి ఎవ్వరో కనుగొని ఆమెను తెచ్చుకో!


92. అత్యంత మనోహరాంగాలు గల ఆ స్త్రీరత్నం తన తేజస్సుతో దిశలను ప్రకాశవంతాలు చేస్తూ అచట ఉంది. దైత్యేశ్వరా! నీవు ఆమెను చూసితీరాలి.


93. ప్రభూ! ముల్లోకాలలో గల రత్నాలను, మణులును, గజాశ్వాదులును అన్ని ఇప్పుడు నీ ఇంట ఉన్నాయి. 


94. గజరత్నమైన ఐరావతం ఇంద్రుని నుండి తేబడింది. అట్లే ఈ పారిజాత వృక్షం, ఉచ్చైశ్రవమనే గుఱ్ఱం కూడా (తేబడ్డాయి).


95. పూర్వం బ్రహ్మదిగా ఉన్న హంసలతో ప్రకాశించే ఈ అద్భుత విమానం, రత్నసమానమైనది, నీ ముంగిటిలో ఉంది.


సశేషం....

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: