19, నవంబర్ 2020, గురువారం

బ్రాహ్మణ ధర్మం

 బ్రాహ్మణ ధర్మం

             

ఒకరు మనల్ని గౌరవిస్తున్నారన్నా నమస్కరిస్తున్నారన్నా ఆ ఘనత మనది కాదు.

ఆ గొప్పతనం మనం పాటిస్తున్న వైదిక సాప్రదాయంది,మనం నేర్చుకున్న వేదానిదీ.


ఎంత కాలం మనం ఆ వైదిక ధర్మానికి కట్టుబడి ఉంటామో,నియమ నిబంధనలతో,

మడి ఆచారాలతో, విప్ర ధర్మాలతో సంస్కార వంతమైన జీవనం గడుపుతామో,

అంతకాలంవరకే ఈ గౌరవ మర్యాదలు మనం పొందగలుగుతున్నాము.


ఏ వర్ణస్తులైనా వారి ధర్మాలని వారు వదిలేసినా వారు సంఘంలో గౌరవింపబడుదురేమో కాని,

బ్రాహ్మణుడు మాత్రం(అందునా వైదిక వృత్తిలో ఉన్నవారు మాత్రం) 

వాని ధర్మాలను వదిలిన మరుక్షణమే అతను భ్రష్టుడుగా పరిగణించ బడతాడు.

అందుచేతనే ఏ పురాణ కధలలోనైనా పాపకర్మలతో పతనమైన వారి గురించి చెప్పే సందర్భములో,

ఆ పాత్రను బ్రాహ్మణుడి గానే చూపించారు.


అందువల్ల ఈ గౌరవ పురస్కార సత్కారములు మనకే అనుకుని మురిసి పోయి గర్వించకుండా,

లోకమంతా గౌరవించుచున్నది మన శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సాంప్రదాయాన్ని మాత్రమే,

అను విషయం గుర్తించి,ఆ బాధ్యతను మనం సక్రమంగా శిరోధార్యంగా మోస్తున్నంత కాలమే,

ఈ ప్రపంచం లో మన మనుగడ,మన ఉనికి.

అలా కాక వాటిని విస్మరించిన నాడు వదిలేసిన నాడు లోకంలో మనంత హీనంగా చూడబడే వాడు ఇంకొకడు ఉండడు.


అందరూ అనుకుంటున్నట్లు బ్రాహ్మణీకం అనేది ఓ ఘనత ఏమాత్రం కాదు.

ఇది ఒక పులి మీద స్వారి వంటిది,జాగ్రత్తగా దాని మీద స్వారి చేసినంత వరకే (నియమంగా ఉన్నంత వరకే) నీ గౌరవం,

ఒక్క సారి దాని మీదనించి దిగావా (పతనమయ్యావా) అదే నీ అంతానికి కారణ మవుతుంది.


ఇది ఎవరికో నేను ఉపదేశిస్తున్నది కాదు, నాకు నేనే అంతర్ముఖుడనై చెప్పుకుంటున్న ఉపదేశం.


ఈ క్రింది కథ సారాంశం చూస్తే ఎందుకో ఇది మన గురించే చెప్పిన కధలా అనిపించింది.

ఈ కలియుగంలో ఈ నాస్తిక సమాజంలో, వైదిక ఆచార వ్యవహార ధర్మాలను పాటించటం నిజంగా అతి భారమే,

అందుకే ఆ బరువులు మోసే గాడిద పాత్రతో పోల్చుకోవటానికి మనమేమి బిడియపడక్కర్లేదు.

అది మోసిన దేవతా విగ్రహమే మన పవిత్రమైన వైదిక ధర్మం.అది మోసినంత కాలమే మనకి గౌరవం.

ఆ ధర్మాన్ని వదిలేస్తే మనకీ దానిలా ఈ సంఘంలో ఛీత్కార అవమానాలే.


*🌷ఓ సారి ఈ కధ మీరూ చదవండి🌷*


         *🌀జ్ఞానోదయం🌀*


ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు.

అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. 

అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.

ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు.

బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. 

ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు.


 దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి,

 నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు. 

అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది.

 అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది. 

అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది.


'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! 

అని ఆశ్చర్యపోయింది.


 'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'

 అనుకుంది.

 కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి.

 అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది.

 గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. 

గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు. 


'ఊరి వాళ్ళంతా నాకు

 గౌరవమిస్తుంటే నేను గొప్పదాన్నే కదా! 

మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి, '

అనుకుని అక్కడి నుండి కదలలేదు.


శిల్పికి విసుగు వచ్చి, దేవతా విగ్రహాన్ని గాడిదపై నుండి తీసి తన తలపైనే పెట్టుకుని ముందుకు సాగాడు.

" ఆ! పోతే పోయాడు" 

అనుకుని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద.

 కొద్ది సేపటి తర్వాత కళ్ళు తెరచి చూస్తే, ఒక్కరు కూడా తన దగ్గర లేరు.

 అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు.

 ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒకతను, గాడిద వీపుపై కర్రతో కొట్టాడు.

 దానితో గాడిదకి జ్ఞానోదయం అయింది.


 "అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను.

ఇంకాసేపు ఇక్కడే ఉంటే, నా వీపు పగిలిపోయేలా ఉంది, 

అనుకుని యజమాని దగ్గరకు పరుగెత్తింది.


🐿నీతి :


మనకు దక్కే మర్యాదలు మనం పాటిస్తున్న ధర్మానికే కాని మనకు కాదు.

అవి వ్యక్తిగతంగా మనకే అనుకుని  గర్వపడి విర్రవీగడం అవివేకం.

కామెంట్‌లు లేవు: