_*శ్రీ శివ మహాపురాణం - 30 వ అధ్యాయం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*నారదుడు తండ్రిని ప్రశ్నించుట*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*సూతుడిట్లు పలికెను -*
ఓ విప్రులారా ! విష్ణువు అంతర్ధానము కాగానే , నారద మహర్షి భక్తితో శివలింగములను దర్శిస్తూ, భూలోకమునంతయూ పర్యటించెను. ఓ విప్రులారా ! ఆతడు భూలోకమును పర్యటించి , భుక్తిని ముక్తిని ఇచ్చే అనేక శివరూపములను ప్రీతితో దర్శించెను. దివ్యజ్ఞాని యగు నారదుడు ప్రసన్న మనస్కుడై భూలోకములో సంచరించుచున్నాడని తెలిసి , ఆశంభుభక్తులిద్దరు ఆతని వద్దకు వచ్చిరి. తమకీయబడిన శాపము నుండిఉద్దారమును గోరు వారై వారిరువురు వెంటనే అతనికి తలవంచి నమస్కరించి, పాదములను పట్టుకొని ఆదరముతో నిట్లనిరి.
*శివభక్తులిద్దరు ఇట్లు పలికిరి -*
బ్రహ్మపుత్రా ! దేవర్షీ ! నీవు ప్రసన్నుడవై మాఇద్దరి మాటను వినుము. విప్రులమగు మేము యథార్థముగా నీయందు అపరాధమును చేయలేదు . హే విప్రా ! మేమిద్దరము శివుని అనుచరులము. ఓమహర్షీ ! మేము నీయందు తప్పు చేసితిమి. స్వయం వరములో మాయా ప్రాభావముచే నీమనస్సు రాజపుత్రి యందలి మోహముతో నిండియుండెను . అట్టి నీవు మాకిద్దరికి శాపము నిచ్చితివి. పరమేశ్వరుని ప్రేరణ చేతనే అట్లు జరిగినది. అది మాటలాడుటకు సమయము కాదనియు, మౌనమే రక్షక మనియు తెలిసుకొంటిమి. జీవుడు తన కర్మల ఫలమును పొందును. ఇతరులను దూషింప బని లేదు. హే ప్రభో! నీవు మాయందు ప్రసన్నుడవై మమ్ములను గ్రహింపుము.
*సూతుడిట్లు పలికెను -*
శివుని అనుచరులిద్దరు భక్తితో చెప్పిన ఈ మాటను విని , నారదముని పశ్చాత్తాపమును పొందిన వాడై, ప్రీతితో ఆదరముతో నిట్లు బదులిడెను.
*నారదుడిట్లు పలికెను -*
మహాదేవాను చరులారా ! నా మాటను వినుడు. మీరు సత్పురుషులలో మిక్కిలి శ్రేష్ఠులు. మీరు సుఖమును కలిగించు, మోహములేని సత్యవచనమును పలికినారు. కొద్దికాలము క్రితము నాబుద్ధి భ్రష్టమైనది. శివుని ఇచ్ఛ వలననే అట్లు జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది , దుష్టబుద్ధి గలవాడై మిమ్ములనిద్దరినీ శపించితిని. నా శాపవచనములు సత్యములయి తీరును. అయిననూ, శివభక్తులారా ! నా యీ పాపమును క్షమించుడు. ముని శ్రేష్ఠుని బిడ్డలై పుట్టి, మీరు సంపత్తులు గల వారై బలము, ప్రతాపము గల రాక్షస ప్రభువులు అగుదురు.
మీరు ఇంద్రియజయము గల శివ భక్తులై శివుని రెండవ స్వరూపమగు విష్ణువు చేతిలో మృత్యువును పొంది, మీ స్వస్థానమును పొందెదరు.
మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని శివాను చరులిద్దరు సంతసించి, ఆనందముతో తమ స్థానమునకు వెళ్లిరి. నారదుడు కూడ మిక్కిలి సంతసించి, శివుని ఏకానుగ్రమగు బుద్ధితో ధ్యానిస్తూ, భూలోకములో శివతీర్థములనన్నింటినీ చూస్తూ సంచరించెను. తరువాత ఆ మహర్షి కాశీని చేరెను. కాశీ తీర్థములన్నింటిలో గొప్పది. శివునకు ప్రియమైనది. కాశీ శివుని స్వరూపము. అతడు కాశీని దర్శించి కృతార్థుడయ్యెను. కాశీనాథుని దర్శించి, పరమానంద భరితుడై పూజించెను.
ఆ మహర్షి ఆనందముతో ఆ కాశీనగరమును సేవించి , శివునికి నమస్కరించి , భక్తితో శివమహిమను వర్ణించి , ప్రేమవ్యాకులుడై శివుని స్మరించి కృతార్థుడాయెను . శివుని స్మరించుటచే పవిత్రమైన బుద్ధి గల ఆ నారదుడపుడు శివతత్త్వమును అధికముగా తెలియగోరి బ్రహ్మలోకమునకు వెళ్లెను. అచట బ్రహ్మకు భక్తితో నమస్కరించి, వివిధ స్తోత్రములతో స్తుతించి, శివుని యందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్త్వమును గూర్చి ప్రశ్నించెను.
*నారదుడిట్లు పలికెను -*
హే బ్రహ్మన్ ! నీవు పరబ్రహ్మ స్వరూపము నెరింగిన వాడవు. హే పితామహా! నీవు జగత్తునకు అధీశుడవు. నేను నీ అనుగ్రహముచే ఉత్తమమగు విష్ణు మహాత్మ్యమును పూర్తిగా వినియుంటిని. భక్తి మార్గమును, జ్ఞానమార్గమును, కఠినమగు తపో మార్గమును, దానమార్గమును, మరియు తీర్థమార్గమును నేను విని యుంటిని. కాని, నాకు శివతత్త్వము తెలియదు. కావున, హే ప్రభో! నాకు శివపూజా విధిని, శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము. తండ్రీ ! శివుడు నిర్గుణుడైననూ సగుణుడు ఎట్లు అయినాడు? నేను శివమాయచే మోహితుడనగుటచే, శివతత్త్వమును తెలియకున్నాను.
సృష్టికి పూర్వము శంభుడు తన రూపములో ఎట్లు ప్రతిష్ఠితుడై యుండెను ? ఆ ప్రభువు స్థితికాలములో క్రీడించు విధమెట్టిది ?. ఆ మహేశ్వరుడు ప్రలయ కాలములో నెట్లుండును ?లోకములకు శుభములనిచ్చు శంకరుడు ప్రసన్నమగు విధమెట్టిది ?. హే బ్రహ్మన్ ! మహేశ్వరుడు సంతుష్టుడై తన భక్తులకు, ఇతరులకు ఏమి ఫలమునిచ్చును ? ఈ సర్వమును నాకు చెప్పుము. భగవాన్ శంకరుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని వినియుంటిమి , ఆ మహాను భావుడు దయాళువు. భక్తుల శ్రమను చూడలేడు.
బ్రహ్మ విష్ణు మహేశులు ముగ్గురు దేవులు శివుని అంశనుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణ అంశముతో జన్మించెను. కాన, మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడే . శివుని ఆవిర్భావమును , విశేషించి లీలలను చెప్పుము. హే ప్రభో ! ఉమ యొక్క ఆవిర్భావమును, మరియు వివాహమును చెప్పుము . మరియు హే అనఘా ! శివుని గార్హస్థ్యమును, లీలలను, ఇంతియే గాక ఇతర గాథలనన్నింటినీ చెప్పుము . హే ప్రజాపతే ! ఉమ యొక్క ఆవిర్భావమును , వివాహమును మరియు గుహుని జన్మను నాకు చెప్పుము.
హే జగన్నాయకా ! నేను అనేకుల నుండి పూర్వము విని యుంటిని. అయిననూ , తృప్తి కలుగలేదు. కావుననే, నిన్ను శరణు వేడితిని. నాపై దయము చూపుము. కుమారుడగు నారదుని ఈ మాటను విని, లోకపితామహుడగు బ్రహ్మ అపుడు ఇట్లు పలికెను .
*శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహిత యందలి మొదటి ఖండము అగు సృష్ట్యు పాఖ్యానములో నారద ప్రశ్న వర్ణనమను ఐదవ అధ్యాయము ముగిసినది.*
_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_
9849100044
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి