14, డిసెంబర్ 2020, సోమవారం

బౌద్ధావతారం

 ప్ర: దశావతారాలలో 'బౌద్ధావతారం' అంటే చరిత్రలోని గౌతమ బుద్ధుడేనా? "నమో బౌద్ధావతారాయ దైత్యస్త్రీ మానభంజినే, అచింత్యాశ్వత్థ రూపాయ రామాయాపన్నివారిణే" అని 'శ్రీమదాపన్నివారక రామస్తోత్రం"లో ఉంది. దీని గురించి తెలుప ప్రార్ధన.


జ: దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడనే చెప్పాలి. ప్రాచీన పురాణ వాజ్ఞ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. త్రిపురాసురుల భార్యలు మహా పతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురులను ఎవరూ జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి లోకరక్షణ, ధర్మరక్షణ కోసం విష్ణువు బుద్ధరూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో, ఒక అశ్వత్థవృక్ష మూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. వారు శివుని చేత హతులయ్యారు. ఇదే మీరు చెప్పిన 'ఆపన్నివారక స్తోత్రం'లో ఉంది. 'దైత్య స్త్రీ మానభంజినే' అంటే రాక్షస స్త్రీల పాతివృత్యాన్ని భంగం చేసినవాడు' అని అర్ధం. ఇది కాక - దివోదాసుడనే రాజును ఆ కాలానికి అవసరంగా రాజ్యచ్యుతి కల్పించవలసి వచ్చింది. అందుకు ధర్మ బలాన్ని తొలగించి రాజును తప్పించడానికి విష్ణువు బుద్ధావతారమెత్తాడు. ఆ సమయంలో అవైదిక, ఆధార్మిక బోధలతో ఆ రాజ్యానికి బలహీన పరిస్థితి చేకూర్చాడు.


 -ఇవే పురాణ బుద్ధుని అవతారాలు. పై మొదటి వృత్తాంతాన్నే అన్నమయ్య దశావతార వర్ణనలలో పేర్కొన్నాడు. *“పురసతుల మానములు పొల్లచేసినచేయి” “ఆకసాన బారే వూరి అతివలమానములుకాకుసేయువాడు"* 


ఆకసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించిన వాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది. ఆ బుద్ధునికీ ఈ గౌతమ బుద్ధునికీ సంబంధం లేదు.

కామెంట్‌లు లేవు: