*రామకోటి సుబ్బమ్మ గారు..*
మొగలిచెర్ల సమీపాన ఫకీరు మాన్యం లో గల ఆశ్రమం లో శ్రీ స్వామివారు 1976 మే 6వతేదీ నాడు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన రెండు మూడు సంవత్సరాల తరువాత..కందుకూరు ప్రక్కనే ఉన్న పల్లెటూరు నుంచి ఒక మధ్యవయస్కురాలైన యువతి..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు వచ్చింది..తనను చూసేవాళ్ళెవ్వరూ లేరనీ..శ్రీ స్వామివారి మందిరం వద్దే ఉండిపోవాలని వచ్చాననీ.. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతానని చెప్పింది..కానీ ఆమెతో చెప్పి చేయించుకునే పనులేమున్నాయి?..చూడటానికి బాగా బ్రతికిన మనిషి లాగా ఉంది..శ్రీ స్వామివారి మందిరం వద్ద పనులు చేయడానికి సిబ్బంది వున్నారు..ఒక వ్యవస్థ ఏర్పడిపోయి ఉన్నది..ఒకరోజు గడచిన తరువాత..మా తల్లిదండ్రులైన శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లకు ఈ విషయం తెలిసింది..ఆమెను మా ఇంటికి పిలిపించుకున్నారు..
ఆరోజు ఆమెకు వసతి చూపించి..భోజనం పెట్టి..మెల్లిగా వివరాలు అడిగారు..ఆమె పేరు సుబ్బమ్మ గారు..వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చింది..ఉన్నంతలో ఒకరికి పెట్టగలిగిన స్థాయి లో ఉన్న సంసారం..భర్త కూ తనకూ మధ్య వచ్చిన పొరపొచ్చాలతో మనస్తాపం చెందింది..ఆ సమయం లో ఆమెను ఓదార్చే వారెవరూ లేక, ఇక తనకు ఎవ్వరూ లేరని భావించి..తనను కాపాడేవాడు మొగలిచెర్ల లోని అవధూత శ్రీ దత్తాత్రేయుడే అని నమ్మి..నేరుగా బస్సు ఎక్కి వచ్చేసింది.. ఎన్నో విధాల ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు మా అమ్మా నాన్న గార్లు..ఆవిడ మాత్రం ఇక తాను వెనక్కి తిరిగివెళ్లను అని ఖచ్చితంగా చెప్పేసింది..ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న మా అమ్మగారు..ఆమెను మా ఇంట్లోనే వుండమని చెప్పారు..
ఒక వారం గడిచిపోయింది..సుబ్బమ్మగారు వీలున్నప్పుడల్లా..శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చి ప్రార్ధన చేసుకొని వెళుతున్నది..మా ఇంటివద్ద అమ్మతో పాటు పనుల్లో చేదోడు వాదోడు గా వుండసాగింది..సుబ్బమ్మ జీవితం ఇలా వెళ్లిపోవాల్సిందేనా?..ఆమెకు ఒక దారి చూపించాలి కదా? అని మా తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచించసాగారు..ఆమెకు ధ్యానం ఎలా చేయాలో దగ్గరుండి మా అమ్మగారు నేర్పించారు..ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఒక గంట సేపు ధ్యానం చేసుకోవడం సుబ్బమ్మకు త్వరలోనే అలవాటు అయింది..మిగిలిన సమయం లో కూడా దైవాన్ని స్మరించే అలవాటు చేయాలని అనుకున్నారు కానీ మా అమ్మా నాన్న గార్లకు ఒక స్పష్టత మాత్రం రాలేదు..లోలోపల ఆలోచించసాగారు..
మరో రెండురోజుల తరువాత..అమ్మా నాన్న గార్లు..శ్రీ స్వామివారి మందిరానికి రావడం జరిగింది..అప్పటికి మా అమ్మగారు వ్రాస్తున్న రామకోటి డెబ్భై లక్షలు పూర్తి అయింది..ఒక లక్ష రామనామం వ్రాయడం పూర్తి కాగానే..శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చి..శ్రీ స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లడం మా అమ్మగారికి అలవాటు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నిలబడి వున్నప్పుడు..మా అమ్మగారి మదిలో.."సుబ్బమ్మ చేత రామనామం వ్రాయించమని" ఒక సూచన వినిపించింది..చప్పున కళ్ళు తెరచి చూసారు..శ్రీ స్వామివారి ఆదేశం లాగా అనిపించింది..వెంటనే నాన్నగారితో చెప్పేసారు.."మంచి ఆలోచన ప్రభావతీ..ఆవిడ ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది..పైగా తన మనసులో ఉన్న వేదన దూరం కావడానికి ఈ రామనామం ఉపయోగపడుతుంది..శ్రీ స్వామివారి ఆదేశం గా మనం భావిద్దాము.." అన్నారు..
ఇంటికి రాగానే సుబ్బమ్మ గారిని పిలచి..రెండు మూడు రోజుల్లో ఒక మంచిరోజు చూసి రామకోటి వ్రాయడం మొదలుపెట్టమని మా అమ్మగారు చెప్పారు..సుబ్బమ్మ గారు ఎటువంటి సంకోచమూ లేకుండా సరే అనేశారు..ఆ ప్రక్కరోజే మా నాన్నగారు కందుకూరు నుండి రామకోటి వ్రాసే పుస్తకాలను తెప్పించారు..మొదటి పుస్తకాన్ని చేతబట్టుకుని..సుబ్బమ్మ గారిని వెంటబెట్టుకొని..మా తల్లిదండ్రులిద్దరూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..అక్కడే సుబ్బమ్మ గారిచేత "శ్రీరామ" అని నామాన్ని పుస్తకంలో వ్రాయించారు..ఏ నిమిషం లో సుబ్బమ్మ గారు రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టారో గానీ..ఆవిడకు అదే ధ్యాసగా మారిపోయింది..ఏకధాటిగా గంటల కొద్దీ కూర్చుని వ్రాయడం అలవాటుగా మార్చుకున్నారు..చివరకు సుబ్బమ్మ గారిని మాఇంట్లో "రామకోటి సుబ్బమ్మ గారు " అని పిలవడం అలవాటుగా మారిపోయింది..కేవలం కొద్దినెలల లోపే ఆవిడ కోటి సార్లు రామనామాన్ని అక్షరబద్ధం చేసారు..ఒక కోటి తర్వాత మరో కోటి సార్లు..మరో కోటి సార్లు..ఇలా మూడు కోట్ల రామనామాన్ని వ్రాసారు..క్రమంగా సుబ్బమ్మ గారు మా ఇంటి మనిషిగా ఉండిపోయారు..దాదాపు ఐదు సంవత్సరాలపాటు ఆవిడ మా వద్దనే వుండి.. శ్రీ స్వామివారి మీద అనన్య భక్తి తో మెలిగారు..ఆవిడ జీవితాన్ని రామకోటి ఒక మలుపు త్రిప్పింది..సంసార బంధాలనూ దూరం చేసి, పూర్తి ఆధ్యాత్మికత కు దగ్గర చేసింది..
రామకోటి వ్రాయడం పూర్తయిన కొన్నాళ్ళకు..సుబ్బమ్మ గారి అన్నదమ్ములు వచ్చి ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు..అక్కడికి వెళ్లినా ఆవిడ శ్రీ స్వామివారి మందిరానికి తరచూ వచ్చి వెళ్ళేది..మా తల్లిదండ్రులు మరణించిన తరువాత కూడా సుబ్బమ్మ గారు అప్పుడప్పుడూ మొగలిచెర్ల రావడం, శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించుకోవడం చేస్తూ వున్నారు..
ఇప్పుడు సుబ్బమ్మ గారు సుమారు డెబ్భై ఐదేళ్ల పై బడిన వయసులో వున్నారు.. మందిరానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించుకొని వెళుతూ వుంటారు..
"రామకోటి స్థూపాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద నిర్మించాలని కోరిక మిగిలిపోయింది ప్రసాదూ..నువ్వే పూనుకొని ఆ పని చేసిపెట్టు..ఆ స్థూపం కోసం నేను దాచుకున్న కొద్దిపాటి డబ్బును నీకిస్తాను..ఆ ఒక్కపని చేసిపెట్టు.." అని ఈమధ్య నాతో చెప్పారు..సరేనమ్మా అన్నాను..రామకోటి సుబ్బమ్మ గారికోసమైనా రామకోటి స్థూపాన్ని నిర్మించాలి..మరి ఆ దత్తుడు ఎప్పుడు అనుమతి ఇస్తాడో...!!
రామకోటి సుబ్బమ్మ గారు ధన్యజీవి..
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి