14, డిసెంబర్ 2020, సోమవారం

ధార్మికగీత -109*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత -109*

                                    *****

         *శ్లో:- అద్భి ర్గాత్రాణి శుద్ధ్యంతి ౹*

                *మన స్సత్యేన శుద్ధ్యతి   ౹*

                *విద్యా తపోభ్యాం పూతాత్మా  ౹*

                 *బుద్ధి: జ్ఞానేన  శుద్ధ్యతి ౹౹*

                           *****


*భా:- మానవునికి ఆధ్యాత్మిక పథ గమనంలో  బాహ్య, అంతః కరణ శుచులు అత్యావశ్యకములు. భగవానుడు భావప్రియుడు. బాహ్యప్రియుడు కాడు. మనకు భగవత్ ప్రీతికి గాను విధిగా, శుద్ధిగా ఉండితీరవలసినవి.1."శరీరము":- బాహ్య సంచారము వలన పేరుకుపోయిన స్వేదమును, దేహమాలిన్యమును స్నానంలో జలధారలచేత సులువుగా పోగొట్టుకోవచ్చును. 2. "మనస్సు":-  త్రికరణాలలో మూలమైన మనస్సును గాడిలో పెట్టి, జప ధ్యానాలు,యజ్ఞ యాగాలు, పూజలు, వ్రతాలు చేయాలి. ఆ మనసు సత్యము చేత శుద్ధమౌతుంది. మానసిక శుద్ధికి సత్యనిష్ఠ తప్పనిసరి. 3."ఆత్మ":-  మానసిక,వాచిక, కాయిక తపస్సులచేతను, జ్ఞానసముపార్జనకు,వికాసానికి మూలాధారమైన విద్య చేతను ఆత్మ పవిత్రీభూతమై "పూతాత్మ" గా భాసిస్తుంది. 4."బుద్ధి":-  సంకల్ప  వికల్పాలకు నిలయమై, క్షణికము, చంచలమైన మనస్సును వివేక విచక్షణలతో నియంత్రించేది బుద్ధి. ఆ బుద్ధికి అంతటి  శక్తి సామార్ధ్యాలను ప్రసాదించి, శుద్ధి చేయగలిగింది జ్ఞానము మాత్రమే. ఈ విధంగా దైవతత్వము, రూప గుణ నామాల గరిమ, మహిమల జిజ్ఞాసతో ప్రయత్నశీలియైన మానవుని కాయము జలము చేత ;  మనస్సు సత్యముచేత ;  ఆత్మ విద్యా తపస్సులచేత ;  బుద్ధి జ్ఞానసంపదచేత  పూతము, పవిత్రము, పరిశుద్ధము  కాగలవని సారాంశము*.

                                 *****

                  *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: