14, డిసెంబర్ 2020, సోమవారం

మనిషి విలువ


  *..మనిషి విలువ తెలుసుకో..(కథ)*


👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️


స్కూటర్ బయటికి తీసి చాలా రోజులయ్యింది అనుకుని,  పొద్దున్నే వాకింగ్ వెళ్లేప్పుడు స్కూటర్ మీద వెళ్లారు పార్క్ కి ..శంకర నారాయణ గారు...


వారంలో ఒకసారైనా నడపకపోతే బండి మొండిదయ్యి మొరాయిస్తుందని...


వెళ్తుంటే దారిలో ఒకాయన అదే పార్కు కి వస్తారు రోజూ..రోడ్ మీద కనిపిస్తే,  స్కూటర్ ఆపి ఎక్కండి సర్, నేనూ అదే పార్క్ కి వెళ్తున్నా..అన్నారు...


ఆయన పర్లేదండీ మీరు వెళ్ళండి అన్నారు...

పర్లేదు రండి ఈ ఒక్కరోజూ...

ఇక్కడ నడిచేదేదో పార్క్ లో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి...

ఎక్కి కూర్చున్నారు...


దిగగానే...థాంక్స్ అండీ అన్నారు...దానికి శంకరం గారు...భలేవారే..

నేనూ రోజూ స్కూటర్ మీద రాను...అప్పుడప్పుడు వస్తాను అన్నారు నవ్వుతూ...

మీ పేరు అని అడిగారు శంకర నారాయణ గారు...

ఆయన 'అనంత మూర్తి' అని చెప్పి షేక్ హాండ్ ఇచ్చారు...ఈయన కూడా తన పేరు చెప్పారు...

ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్లిపోయారు...

శంకరం గారు ఎదురైన వాళ్లందరికీ విష్ చేస్తూ నడుస్తున్నారు...

ఆయన దిన చర్యే అంత...ఇంటికి

వెళ్తూ కూరగాయలు,  ఆకుకూరలు,  ఫ్రెష్ గా ఉంటే కొనుక్కుని వెళ్తారు...

రిటైర్ అయినప్పటి నుండీ ఇదే దినచర్య...


కెయస్వీ కృష్ణారెడ్డి


ఒక రోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించారు  అనంతమూర్తి గారు...

ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేట...

రండి రండి అని,  బలవంతంగా తీసికెళ్లారు...

శంకరం గారు కూడా.. సరే అని వెళ్లారు...


1st ఫ్లోర్ లో మొదటి అంతస్తులో ఉంటున్నారాయన...

రెండు బెడ్ రూముల అపార్ట్మెంట్ కాంపాక్ట్ 

గా ఉంది...

కుర్చీలో కూర్చున్నాకా,  మంచినీళ్లు తాగుతూ ఇంటిని పరిశీలించారు శంకరం గారు...

ఎదురుగా ఒక స్త్రీ మూర్తి  ఫోటో కి దండ వేసి, బొట్టు పెట్టి ఉంది..

చూడగానే తెలిసిపోతోంది ఈ లోకంలో లేనట్టు...


ఎవరెవరు ఉంటారింట్లో అని అడిగారు శంకరం గారు...

నేనొక్కడినే...పిల్లలు యూ ఎస్ లో ఉంటారు...

ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి...

"తను లేదు"  అని ఫోటో చూస్తూ చెప్పారు...


ఓ సారీ...అని...

వంట మీరేనా అని అడిగారు...శంకరం గారు...

లేదండీ కుక్ ఉంది...నాకు వంట రాదు...రెండుపూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పారు...

కాఫీ గానీ,  టీ గానీ అని ...అడుగుతుండగానే..

"అబ్బే వద్దండీ భోజనం చెయ్యాలి కదా...

ఇంకోసారి వస్తాను తప్పక...

వెళ్ళొస్తాను " అంటూ లేచి...


అవునూ రేపు మీరు మా ఇంటికి లంచ్ కి ఎందుకు రాకూడదూ...?

రేపు ఆదివారం కూడా...

ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నారాయన నవ్వుతూ...


రేపు పన్నెండు గంటలకల్లా వచ్చేయండి...

నాకూ మీకూ కూడా మార్పు ఉంటుంది...అనేశారు శంకరం గారు..

అబ్బెబ్బే వద్దులెండి అని మొహమాట పడుతున్నారు...

దానికి శంకరం గారు అన్నారు...రోజూ వంటావిడ వంటే కదా ..రేపు మా ఇంటి భోజనం చేయండి సర్...మీకోసమేమీ కష్టపడి చాలా ఏమీ చేసేయరు లెండి...

రేపు ఫోన్ చేసి బయలుదేరండి...నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా...

మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్లిపోయారాయన....


మరుసటిరోజు పన్నెండుగంటలకల్లా...శంకరం గారు ఫోన్ చేశారు "బయలుదేరారా అని"...

అనంతమూర్తి బయలుదేరాననగానే,  స్కూటర్ వేసుకుని ఆయనఇంటివైపుకి వెళ్లి ఆయన్ని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చారు...

ఇండిపెండెంట్ ఇల్లు...

చక్కగా మొక్కా మొలకతో పచ్చగా ఉంది ఆవరణ...ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట...


మొదట్లో అసలు ఇక్కడ ఇళ్ళు లేవని, అడవిలా ఉండేదని కాలక్రమేణా  డెవలెప్ అయ్యి ఇప్పుడు ఇలా అయిపోయిందని చూపించారు గర్వంగా...

ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచి నీళ్ళు తెచ్చిచ్చారు...


ఇల్లంతా చక్కగా నీట్ గా సర్ది పొందికగా ఉంది...

ఎంతైనా ఆడవాళ్లు ఉండే ఇల్లే వేరు అనుకున్నారు అనంతం గారు...


ఇద్దరూ వాళ్ళు పనిచేసిన ఆఫీస్ వివరాలు, పెన్షన్, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు...

మాటల్లో శంకరం గారు కూడా చెప్పారు...తన పిల్లల సంగతి...

కూతురు అమెరికా లో ఉంటుందని...

కొడుకు చండీఘర్ లో ఉంటాడని...ఆయన

ఇద్దరి దగ్గరకూ వెళ్లి వస్తూ ఉంటారని...

కొడుకు వచ్చేయమంటాడని... కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే వస్తానని చెప్పారట...

ఇల్లంతా చూపించారు...

భార్య నవ్వుతున్న ఫోటో...పిల్లలతో, మనవలతో ఫోటోలు ఉన్నాయి..

పెరట్లో చెట్లుతో  భలే ముచ్చటగా ఉంది...ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ కోటి పైనే ఉంటుందని అంచనా వేశారు అనంతమూర్తి గారు... 


కూర్చోండి భోజనం చేసేద్దాం...ఇప్పుడు కాఫీ ఎందుకని అడగలేదు అని కూడా అన్నారు...


ఈ లోపు డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చి పెట్టారు...

ఆనంతమూర్తి గారు అనుకున్నారు ...శంకరం గారి

భార్య ఊరు వెళ్లి ఉంటుందేమో అని...ఇంట్లొ

ఎక్కడా కనపడక పోతే,  ఈయనే అన్నీ సర్దుతుంటే...


రండి..అని శంకరం గారు అనగానే...

అడిగారు ఆనంతమూర్తి గారు తన సందేహాన్ని...


వెంటనే శంకరం గారు చాలా నార్మల్ గా

అన్నారు..

అవును మీకు నేను చెప్పలేదు కదా...తినేసి మాట్లాడుకుందాం రండి అన్నారు...

దొండకాయ వేపుడు, సాంబారు, టమాటో పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడి వడియాలు...

ఒక ప్లేట్లో నెయ్యి, నూనె,  గిన్నెలు

చాలా చేశారే అన్నారు అనంతం గారు...

చేసినవి మూడే నండీ...మిగిలినవి చేసినవి కాదు కదా...

ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నారు...


అన్నీ చక్కగా రుచిగా పద్ధతి గా  ఉన్నాయి...

లాస్ట్ లో గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు...

అన్నీ చక చకా సర్దేసి, టేబుల్ తుడిచేసి 

వక్కపొడి భరిణతో వచ్చారు శంకరం గారు...

అలవాటుందా అంటూ....


'తల ఊపి తీసుకున్నారు'  అనంతం గారు...


'నాకు అలవాటు లేదు...కానీ ఎవరైనా భోజనానికి వస్తే ఇవ్వాలికదా.. అని కొనిపెడతాను'  అన్నారు శంకరం గారు మూత పెడుతూ.. 


సోఫా లో కూర్చుంటుంటే అన్నారు అనంతం గారు...చాలా బాగా చేసారండీ వంట...

బాగానే నేర్చుకున్నారు అని..


అప్పుడన్నారు శంకర నారాయణ గారు, "నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండీ వంట...టైం ఉండేది కాదు...కూరలు సెలవుల్లో కట్ చేసి ఇచ్చేవాడిని అంతే...

రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను...

మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాణ్ణి...

తరువాత తను వేపుళ్ళు, సాంబారు..పప్పు చేయడం నేర్పించింది"...


అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను...

నా భార్య అపర్ణ లేదు...రెండేళ్లు అవుతోంది పోయి...

నాకు ఆమాట చెప్పడం ఇష్టం ఉండదు అస్సలు...

తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది...

చాలావరకూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను....

ఎందుకో ఆ మాట అనడం కూడా నా కిష్టముండదు...

అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి...

కృత్రిమంగా ఫోటోకోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి, దానికి ఒక పెద్ద దండేసి...

మొహాన పెద్ద కుంకుమబొట్టు పెట్టి...ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు...


నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చేయను...పిచ్చి అనుకోండి...ఛాదస్తం అనుకోండి...

నాది భ్రమ అని తెలుసు...కానీ ఆ భ్రమ నాకు ఇష్టం...


తనే "మీకు కొన్ని వంటలన్నా రావాలి"  అని కసిరి కోప్పడీ

మరీ నేర్పింది...

చక్కటి కాఫీ, టీ పెట్టుకోవడం కూడా...


మరి తనకి నాకు ఆ అవసరం పడుతుందని తెలుసేమో అనిపిస్తుంది నాకు...


నేను ప్రతీ సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్ గా ఒక పది మంది పేద పిల్లలకి 

హోటల్ లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి...మంచి మల్టీప్లెక్స్ లో  సినిమాకి తీసుకెళ్లి...వాళ్ళ కి

ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను...


వాళ్లంతా మెకానిక్ షెడ్ లో పనిచేసేవాళ్ళు...ఆ పిల్లల స్నేహితులు అంతే....


మా పిల్లలు వంట మనిషిని పెట్టుకో నాన్నా అంటారు...

కానీ నేనే వద్దన్నాను...నాకూ టైం పాస్ అవుతుంది కదా...వాళ్ళు ఎప్పుడో వండింది మళ్లీ వేడి చేసుకుని తినడం అంతా ఎందుకని...


నేను పిల్లల దగ్గిరకి వెళ్లినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా...

మా కోడలు, అల్లుడి తో  సహా...అందరూ బావుంది బావుంది అని తింటారు పిచ్చి పిల్లలు...


ఈ ఊళ్ళో మా కోడలి తల్లి తండ్రులు ఉంటారు...

వాళ్ళు నన్ను వదలరు...

ఆవిడైతే ఆవకాయ, మాగాయలు నాకు పెట్టి పంపుతుంది...

ఫ్రెష్ గా గోంగూర పచ్చడి...మీరు తిన్న ఆ పొడులు

వడియాలు ఆవిడ పంపినవే...

అన్నయ్యగారూ అంటూ ఆప్యాయంగా ఉంటారు...


నా అదృష్టం నాకు అందరూ మంచివాళ్ళు స్నేహాపాత్రులు దొరుకుతారు...అందులో మీలాంటి వాళ్ళు ఒకరు.. అన్నారు నవ్వుతూ...

లోకల్ గా ఆఫీస్  ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు...

అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం...

కొంత మందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను.  అది నా సరదా...

నా స్నేహితులు .. వాళ్ళు కూడా ఏవో ఐటమ్స్ చేసి తీసికుని వస్తారు...అందరం కలిసి తింటాం...

పుస్తకాలు, సోషల్ మీడియా కాలక్షేపం...


పిల్లలదగ్గరికి వెళ్లి వస్తూ ఉంటాను...సంవత్సరంలో ఒక ఎనిమిది నెలలు పిల్లల దగ్గరే ఉంటాను...

ఒక నాలుగు నెలలు ఇక్కడ ఉంటాను...

అదీ నా జీవితం...అన్నారు నవ్వుతూ...


చాలా సంతోషమండీ...మిమల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నారు అనంత మూర్తి గారు మనస్ఫూర్తిగా...

నేనింక బయలుదేరతానూ అని లేచారు..

ఉండండి నేను డ్రాప్ చేస్తాను అని, 

వద్దన్నా ఆయన ఇంటివరకూ డ్రాప్ చేశారు శంకరం గారు...


అనంత మూర్తి గారు తాళం తీసుకుని,  లోపలికి వెళ్ళి, చెప్పులు వదిలి... సోఫాలో నిస్త్రాణంగా కూర్చున్నారు...

ఆయనికి చాలా గిల్టీ గా ఉంది...


ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తొచ్చింది...

ఉన్నంతకాలం,  తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది...

ఆఫీస్ కి వెళ్లి రావడమే ఘనకార్యం గా అనుకునేవాడు...

ఇంటికి వస్తే కింగ్ తను...

అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య...

కాఫీ తాగి గ్లాసు కింద పెట్టేసేవాడు...

మంచినీళ్లు తాగి కింద పెట్టేసేవాడు...


మొత్తం ఇల్లు తనే చూసుకునేది...

ఏనాడూ భార్యకి సహాయం చేయలేదు సరికదా...వంకలు పెట్టేవాడు...


స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి...

ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది..తన విలువ...

భార్య పోతూ కూడా,  తను లేకపోతే  'ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది'...

పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి,  మాట తీసుకుంది...


టీ పెట్టుకోవడం ఒక్కటీ నేర్చుకున్నాడు ఎలాగో...

కానీ భార్య చేతి రుచి రాలేదు...


వంటమనిషి.. ఒక్కడికీ పొద్దున్నే వండి పడేసి పోతుంది...


వంటలో ఓనమాలు తెలియవు...

సోషల్ మీడియా తెలీదు...పిల్లలు వాట్సాప్ ఒక్కటి ఫోన్ లో పెట్టి నేర్పించారు అక్కడికి వెళ్ళినప్పుడు...

వాళ్ళ మెసేజ్ లు, ఫోటోలు చూడటం వచ్చింది...


పిల్లల దగ్గిరికి వెళ్లినా అలా పైపైన గడిపేసి వస్తాడు...

వాళ్ళల్లో మనసావాచా హాయిగా కలిసిపోడు...

జైల్లో ఉన్నట్టు గడుపుతాడు..


 కోడళ్ల తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళు ఆడపిల్లల తల్లితండ్రులని,  వాళ్లతో కలిసి పోకూడదని...తన ఐడెంటిటీ వేరే అని ఆహంభావం తనకి..ఏనాడూ వాళ్లకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు...

వాళ్ళు చేసినా ముభావంగా మాట్లాడితే....

వాళ్లు కూడా తన గంభీరతకి జంకుతారు...


బయటికి వెళ్తే వెళ్లి వచ్చేయడమే...తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి..అని గమనించడు...

మనుషుల్లో కలిసిపోవడం తెలీదు...స్నేహితులు లేరు...


ప్రతీ ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు,  కొడుకుని పిలిచి తద్దినం పెట్టించేవాడు...

కొడుక్కి ఎప్పుడూ  వీలు కాకపోవడంతో... ఒక చోట డబ్బులు కట్టి వాళ్ళ చే ఈ శ్రాద్ధ కర్మలు చేయిస్తున్నాడు...

ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను...

శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి...


బ్రతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి గానీ...చనిపోయాకా ఎన్ని చేసి ఏమి లాభం...?

వాటి ప్రభావం ఏంటి..వాటి ఉపయోగం ఉందా...

ఏదో తరతరాలుగా వస్తున్న పద్ధతిని ఫాలో అవడమే...

ఇంత చిన్న విషయం తనకి తెలీదు ఇంతకాలం..


తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈ రోజు...

తను తన పరిధిలో ఇంకా బాగా జీవించొచ్చు...

ఇద్దరి పరిస్థితులు ఒకటే...బాధ ఒకటే...

www.bestsocialteacher.com 

కానీ ఒకళ్ళ జీవితంలో జీవం తొణికిస లాడుతోంది...

ఒకళ్ళ జీవితం స్తబ్దుగా ఉంది...

కారణం.. ఆలోచనలు...

ఇల్లు ఇరుకుగా ఉన్నా, ఆలోచనలు విశాలంగా ఉండాలి...

జీవితం ప్రవాహం...ఎలాంటి ఒడిదుడుకులు, అడ్డంకులు ఉన్నా సాగిపోతుంది...దానికి ఢోకా లేదు... 

కొన్ని బాధలు తీరేవి కావు...

కనీసం కొందరి బాధల నైనా తీర్చి ఆనందం పొందొచ్చు...

ఆనందం పంచొచ్చు...


వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీసాడు...

అన్నీ చూసాడు...

 భార్య పిల్లలతో వాళ్ళ చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి..

తనతో నవ్వుతూ.... తన  భుజంమీద చెయ్యి వేసిన   ఒక్క ఫోటో లేదు...

ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకెళ్తేకదా అనుకున్నాడు...

ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదం గా ఉన్నాడా...?


పిల్లల చిన్నప్పుడు,  వాళ్లతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు...

భార్య తన  తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు..

తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు ఉన్నాయి...

కొన్ని బయటికి తీసాడు...


గోడమీదున్న ఫోటో తీసేసి లోపల పెట్టేసాడు...


నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా  ఫ్రేమ్ కట్టించి పెడతాను...

నేనూ ఇప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను...

జీవించడానికి, బ్రతకడానికి తేడా తెలిసింది...


శంకర నారాయణ నన్ను ముందే కలిసుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు..

ఒక మనిషి ఎలా ఉండాలో, ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు ఆయన...


*'గాయత్రీ నన్ను క్షమించు అనుకుంటే'.. మనస్సు నిజాయితీగా కదిలి,  కళ్ళు చెమర్చాయి అనంత మూర్తికి...*


*రచయితకు నమస్సుమాంజలి*


*సేకరణ: కెయస్వీ‌కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, గంటి, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి. 9492146689*

👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️👱‍♀️


                          ******

కామెంట్‌లు లేవు: