14, డిసెంబర్ 2020, సోమవారం

ఆకాశంలో అందమైన భవనం!*

 *✍🏼 నేటి కథ ✍🏼*



*ఆకాశంలో అందమైన భవనం!*



పూర్వం ఓ రాజ్యం ఉండేది. రాజు మంచివాడే కానీ.. రాజ్యపాలన కన్నా.. వినోదం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ఏవో అర్థంలేని పోటీలు పెట్టి.. ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి వినోదం పొందేవాడు. ప్రజలు విసిగిపోయినా.. రాజు కాబట్టి ఏమీ అనే వారు కాదు. అదే రాజ్యంలో వివేకవర్థనుడు అనే పేదవాడు ఉండేవాడు. అతనిలో మంచి చమత్కారం, సమయస్ఫూర్తి, ధైర్యం ఉండేది. రాజుగారి తెలివితక్కువ పనుల గురించి తెలుసుకుని ఓ రోజు వివేకవర్థనుడు స్నేహితులతో మాట్లాడుతూ.. రాజుపై పరిహాసం ఆడాడు. అది విన్న సైనికులు విషయాన్ని రాజు దృష్టికి తీసుకెళ్లారు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఓ సామాన్యుడు రాజ్యానికి రాజునైన నన్నే మాటలనడమా?.. అని రగిలిపోయాడు. ఎలా అయినా శిక్షించాలనుకున్నాడు. కానీ శిక్ష విధిస్తే రాజ్యమంతా విషయం తెలిసి తనకే మరింత నష్టం జరుగుతుందని భావించాడు. రాజ్యం అంతా చూస్తుండగా అతణ్ని అవమానించాలి అనుకున్నాడు. దీనికోసం ఓ పథకం పన్నాడు.


ఓ రోజు వివేకవర్థనుడి ఇంటికి రాజభటులను పంపి కోటకు పిలిపించాడు.


నీ గురించి చాలా విన్నాం. నువ్వు బాగా తెలివైనవాడివటగా.. ‘అయితే నీ తెలివితేటలు ఉపయోగించి మా కోసం మూడు రోజుల్లోగా ఆకాశంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించు’ అని ఆజ్ఞాపించాడు. నీకు కావాల్సినంత మందిని, సామగ్రిని, ధనాన్ని నీవు తీసుకెళ్లవచ్చు. ఒకవేళ నువ్వు ఆ భవనాన్ని నిర్మించలేకపోతే మా సైనికులు నిన్ను ప్రజలందరి ముందు చంపేస్తారు అని అన్నాడు. వివేకవర్థనుడికి విషయం అర్థమైంది. అయినా ఏ మాత్రం తొణకకుండా.. ‘తప్పకుండా మహారాజా! నాకు మూడు రోజులు అక్కరలేదు. ఒక్క రోజులోనే ఆ పనిచేసి చూపిస్తా’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా బాగా ఆలోచించాడు. ఓ మంచి ఆలోచన తట్టగానే హాయిగా నిద్రపోయాడు.

అక్కడ రాజమందిరంలో రాజు మాత్రం ‘వివేకవర్థనుడు ఒట్టి పిచ్చివాడిలా ఉన్నాడే.. వీడేనా నా గురించి హేళనగా మాట్లాడింది. పోయిపోయి నాతో పెట్టుకున్నాడు. అయినా వాడు ఆకాశంలో భవనం నిర్మించడానికి ఎలా ఒప్పుకొన్నాడు. ఇంతకీ ఎలా నిర్మిస్తాడబ్బా!’ అనే ఆలోచనలతో సరిగా నిద్రపోలేదు.


పొద్దున్నే నిద్రలేచిన వివేకవర్థనుడు తన పని ప్రారంభించాడు. మధ్యాహ్నమయ్యే సరికి ఆకాశంలో నల్లని ఆకారం ప్రత్యక్షమైంది. రాజ్యంలో చాలామంది దాని గురించే మాట్లాడుతున్నారు. రాజుగారి దృష్టికి కూడా అది వెళ్లింది. దాని నుంచి గణగణమని గంట మోగుతున్న శబ్దం కూడా వస్తోంది. కాసేపటికి వివేకవర్థనుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు.


మహారాజా అదిగో చూడండి.. మీరు అడిగిన భవనం సిద్ధమవుతోంది. పొద్దున్నే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా దగ్గర ఉన్న సామగ్రితో పని మొదలుపెట్టా. నా దగ్గర ఉన్న సామగ్రి అయిపోయింది. అందుకే పనివారు పై నుంచి గంట మోగిస్తున్నారు. నిన్న మీరు ఇచ్చిన మాట ప్రకారం.. నాకు సామగ్రి అందించి సాయం చేస్తే సాయంత్రానికల్లా భవన నిర్మాణం పూర్తిచేస్తానని వివేకవర్థనుడు చెప్పాడు. రాజుగారు ఓ రకంగా బిత్తరపోయాడు. అయినా.. బయటపడకుండా సైనికులను ఆ పనికి పురమాయించాడు.


వివేకవర్థనుడు భటులను తీసుకుని ఓ చెట్టు దగ్గరికి వెళ్లాడు. దానికి ఓ పే..ద్ద దారం కట్టి ఉంది. దాన్ని సైనికులకు చూపించి.. దీని ద్వారా భవనానికి చేరుకోమని చెప్పి వెళ్లిపోయాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలా వెళ్లాలో వారికి తోచలేదు. చివరికి విసిగిపోయి.. రాజు దగ్గరకి వెళ్లి.. ఆకాశానికి చేరుకోవడం ఎవరివల్లా కాదు మహాప్రభో! అది కూడా దారం సాయంతో ఆకాశానికి చేరుకోవడం అన్నది అసంభవం అని విన్నవించుకున్నారు.


రాజు వివేకవర్థనుడిని పిలిపించాడు. ‘దారంతో ఆకాశాన్ని చేరుకోవటం అసాధ్యం కదా.. అది అవివేకం కూడా’ అని అన్నాడు. దానికి వివేకవర్థనుడు వెంటనే ‘దారం సాయంతో ఆకాశానికి చేరుకోవడమే అవివేకం అయినప్పుడు.. ఆకాశంలో భవనం నిర్మించమనడం ఇంకెంత అవివేకం’ అని జవాబిచ్చాడు. రాజుకు ఆగ్రహం వచ్చినా.. మౌనంగా ఉండిపోయాడు. ‘రాజా! మీరు క్షమించాలి. మీరంటే నాకు ఎంతో అభిమానం. నాకే కాదు.. రాజ్యంలో ఉన్నవారందరికీ మీరంటే ఇష్టమే! కానీ మీరు రాజ్యపాలన మీద కన్నా అర్థంలేని పోటీలు పెట్టి ప్రజల్ని పీడించి వినోదం పొందడమే మాకు నచ్చడం లేదు’ అని చెప్పారు. రాజు హుందాగా తన తప్పు ఒప్పుకున్నాడు. వివేకవర్థనుణ్ని ఘనంగా సన్మానించి తగిన బహుమతులతోపాటు మంత్రి పదవినీ ఇచ్చాడు. వివేకవర్థనుడు ఇంటికి వెళ్తూ..వెళ్తూ.. ఆ చెట్టుకున్న దారాన్ని తెంచి వేశాడు. అప్పటి వరకూ గాల్లో చాలా ఎత్తున ఎగురుతున్న గాలిపటం, దానికున్న గంట ఎగిరిపోయాయి.


అప్పటి నుంచి ఆ రాజు వివేకవర్థనుడి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజల బాగోగుల మీద శ్రద్ధపెట్టి చక్కగా పాలించాడు.


*సేకరణ : ఈనాడు హయ్ బుజ్జీ నుండి*

కామెంట్‌లు లేవు: