_*శ్రీ శివ మహాపురాణం - 27 వ అధ్యాయం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*నారదుని తపస్సు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*సూతుడిట్లు పలికెను -*
ఓ విప్రులారా ! ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు , బ్రహ్మ గారి కుమారుడు , వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు సంకల్పించెను . హిమవత్పర్వతము నందు ఒక మిక్కిలి సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు గంగ వేగముగా ప్రవహించుచుండును . అచట అనేక శోభలతో గూడిన దివ్యమగు ఆశ్రమము గలదు. పుణ్యదర్శనుడగు నారదుడు తపస్సు చేయుటకు అచటికి వెళ్లెను . ఆ ముని పుంగవుడు ఆ ఆశ్రమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, మౌనియై, ప్రాణయామమునుచేసిస పవిత్రాంతః కరణుడై దీర్ఘకాలము తపమాచరించెను .
నారదముని 'అహం బ్రహ్మాస్మి (బ్రహ్మము నేనే)' అను దర్శనము గల సమాధిని పొందెను. ఓ ద్విజులారా! ఇట్టి తపస్సు వలన బ్రహ్మ సాక్షాత్కారహేతువగు జ్ఞానము సిద్ధించును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇంద్రుని మనస్సు తీవ్రమగు ఆదుర్ధాతో కంపించెను . 'ఈమహర్షి నారాజ్యమును కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇంద్రుడు నారదుని తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను . దేవతలకు నాయకుడగు ఇంద్రుడు మనస్సులో మన్మథుని స్మరించెను. అపుడు మహిమ గలవాడు, పుష్పబాణుడు నగు మన్మథుడు వెంటనే విచ్చేసెను.
దేవతలకు ప్రభువగు ఇంద్రుడు మన్మథుని రాకను చూచెను. ఆతడు స్వార్ధమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ధి చతురత గలవాడు. ఆతడు మన్మథుని వెంటనే పిలిచి ఇట్లు పలికెను .
*ఇంద్రుడిట్లు పలికెను -*
ఓ శ్రేష్ఠమిత్రమా ! నీవు గొప్ప వీరుడవు. మాకు ఎల్లవేళలా హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, సాహాయ్యమును చేయుము . నేను నీ బలముతోనే అనేకుల తపోగర్వమును అడంచితిని . ఓ మిత్రమా ! నా రాజ్యము యొక్క స్థిరత్వము అన్ని వేళలా నీ అనుగ్రముపై నాధారపడి యున్నది . హిమవత్పర్వత గుహలో నారదముని జగత్పితను ఉద్దేశించి గొప్ప నియమముతో కఠినమగు తపము నాచరించుచున్నాడు .
ఆ నారదుడు బ్రహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళ్లి, ఆయన తపస్సునకు విఘ్నమును కలిగించుము . ఈ విధముగా మహేంద్రునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మథుడు ప్రియమిత్రుడగు వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళ్లి తన ఉపాయమును మొదలిడెను . ఆతడచట వెనువెంటనే తన కళలనన్నిటినీ ప్రదర్శింపజొచ్చెను. వసంతుడు కూడా గర్వించిన వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను . ఓ మునిశ్రేష్ఠులారా! నారదముని యొక్క మనస్సు మహేశుని అనుగ్రహముచే వికారమును పొందలేదు. మన్మథునకు గర్వభంగమాయెను .
ఓ శౌనకాది ఋషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శ్రద్ధగా వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని ప్రభావము నిరుపయోగము . మన్మథ శత్రువగు శంభుడు గొప్ప తపస్సు చేసిన స్థలమదియే. మహర్షుల తపస్సును భంగము చేయు మన్మథుడచటనే శివునిచే దహింపబడినాడు . మన్మథుని బ్రతికించుడని రతీదేవి దేవతలను ప్రార్థించగా, వారు శివుని ప్రార్థించిరి. లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు అపుడిట్లనెను . ఓ దేవతలారా! కొంతకాలము తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో మన్మథుని ఆటలేమియూ సాగవు . ఓ దేవతలారా! ఇచట నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు .
శివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో ఇంద్రుని వద్దకు వెళ్లెను . మన్మథుడు నారదుని ప్రభావమును, జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇంద్రునకు విన్నవించెను. వసంత మిత్రుడగు మన్మథుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తన స్థానము చేరెను . అపుడు ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై నారదుని ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నెరుంగని ఇంద్రుడు శివమాయచే మోహితుడయ్యెను . శివుని మాయ సర్వప్రాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చేసిన భక్తుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును .
ఈశ్వరుని అనుగ్రహముచే నారదుడచటనే చిరకాలముండెను. తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి విరమించెను . మన్మథునిపై విజయము తన ప్రభావమేనని ఆ మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యెను. ఆయన జ్ఞానము వృథా అయెను . ఓ మునిశ్రేష్ఠులారా! శంభుని మహా మాయ మిక్కిలి ధన్యమైనది. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారికి కూడా దాని ప్రసారము తెలియకుండును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను శివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు దేరెను .
గర్వితుడగు ఆ మహర్షి తాను మహాత్ముడననియు, మన్మథుని పై విజయము తన ప్రభావమేననియు తలంచినవాడై, రుద్రునకు నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పెను . భక్త వత్సలుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను .
*రుద్రుడు ఇట్లనెను -*
వత్సా ! నారదా ! నీవు ప్రాజ్ఞుడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. ఈ మాటలను ఇతరుల వద్ద చెప్పకుము. విష్ణువు యెదుట సుతరాము చెప్పకుము . నీవు నాకు చెప్పిన ఈ వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఏనాడైననూ బయటపెట్టకుము నీవు విష్ణుభక్తుడవు. విష్ణుభక్తులు నాయందు కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి ప్రియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను . ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుద్రుడు నారదునికి అనేక విధముల నచ్చచెప్పెను. అయిననూ, శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను లెక్కచేయలేదు .
రాబోవు కర్మఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. శంకరునని ఇచ్ఛానుసారముగా కర్మగతి ప్రవర్తిల్లును . అపుడా మహర్షి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మకు నమస్కరించి, తాను తన తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పెను . విధి ఆ మాటలను విని శంభుని పాదపద్మములను స్మరించి, కాముని జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని అట్లు ప్రచారము చేయవద్దని నివారించెను . నారదుడు గొప్ప జ్ఞానియే అయిననూ, శివమాయచే మోహితుడగుటచే, అతని మనస్సునందు గర్వము అంకురించి, బ్రహ్మ గారి మాటను పెడచెవిని పెట్టెను . లోకమునందు సర్వము శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగును. జగత్తంతయూ శివుని అధీనమునందుండును. ఇది సత్యము .
వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు తరువాత వెనువెంటనే తన గొప్పదనమును ప్రకటించుటకు విష్ణులోకమునకు వెళ్లెను . నారద మహర్షి వచ్చుచుండుటను గాంచి, విష్ణువు లేచి, కొద్ది దూరము ఎదురేగి కౌగిలించుకొనెను. నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే . విష్ణువు నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని పాదపద్మములను స్మరించి అతని గర్వమును పోగొట్టు సత్యవచనముల నిట్లు పలికెను .
*విష్ణువు ఇట్లు పలికెను -*
వత్సా ! ఎచటనుండి వచ్చుచున్నావు ? ఇచటకు వచ్చుటకు కారణమేమి ? ఓమునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. నీ రాకచే నేను పవిత్రుడనైతిని . విష్ణువు యొక్క ఈ మాటలను విని, గర్వితుడగు నారద మహర్షి మోహమునకు వశుడై అహంకారముతో తన వృత్తాంతమును చెప్పెను . అపుడు విష్ణువు గర్వముతో నిండియున్న మహర్షి వాక్యములను వినెనే గాని, కామజయమునకు గల వాస్తవ కారణము ఆనకు విదితమే . ఆయన శివుని పాదపద్మములను హృదయములు స్మరించెను . శివభక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధమగు అంతఃకరణము గల వాడునగు విష్ణువు శిరసువంచి, దోసిలి యొగ్గి పరమేశ్వరుని భక్తితో స్తుతించెను .
*విష్ణువు ఇట్లు పలికెను -*
హే శివ! నీవు దేవదేవుడవు. మహాదేవుడవు. అనుగ్రహింపుము. నీవు ధన్యుడవు. అందరినీ మోహింపజేయు నీ మాయ ధన్యము . ఈ విధముగా ఆయన పరమేశ్వరుని స్తుతించి, కళ్లను మూసుకుని, శివుని పాదపద్మములను ధ్యానించి, విరమించెను . శివుని యాజ్ఞచే జగత్తును పరిపాలించు విష్ణువు మనస్సులో శంకర కృతమగు కామజయమును ఎరింగి, నారద మహర్షితో నిట్లనెను .
*విష్ణువు ఇట్లు పలికెను -*
ఓ మునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. తపస్సునకు నిధివి. గొప్ప జ్ఞానివి. ఓ మహర్షీ ! భక్తి జ్ఞానవైరాగ్యములనే మూడు లేనివానికి , సర్వ దుఃఖములనిచ్చే కామ మోహాది వికారములు శీఘ్రమే కలుగును. నీవు నైష్ఠిక బ్రహ్మచారివి. సదాజ్ఞాన వైరాగ్యములు గలవాడవు . నీవు జన్మప్రభృతి వికారములు లేని వాడవు. గొప్ప జ్ఞానివి. నీకు కామవికారమెట్లు కలుగును ?
ఈ విధముగా అనేకములగు పలుకులను విని ఆ మహర్షి పెద్దగా నవ్వెను . అతడు మనస్సులో విష్ణువునకు నమస్కరించి ఇట్లు బదులిడెను.
*నారదుడిట్లు పలికెను -*
ప్రభూ! నీదయ నాయందున్నచో మన్మథుని సామర్థ్యమెంతటిది ? . ఇట్లు పలికి విష్ణువునకు నమస్కరించి ఆ మహర్షి తనకు తోచిన దారిన వెళ్లెను .
_*శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండమగు సృష్ట్యుపాఖ్యానములో నారదతపోవర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది .*_
_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_
9849100044
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి