26, జనవరి 2021, మంగళవారం

*సామ,దాన,భేద,దండోపాయాలు

 *సామ,దాన,భేద,దండోపాయాలు.*

🕉️🌞🌎🏵️🌼🚩


ప్రతి మనిషికి కోరికలుంటాయి. కొందరికీ కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి. సహజ వాంఛలుంటాయి. అవసరాలు ఉంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి!

కొందరు కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఊహాలోకంలో తేలియాడుతూ ఉంటారు.

తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే.

దేవకన్య కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి. నేనేది కోరుకుంటే అదే జరగాలి! నియంతను కావాలి! ప్రపంచం నా పాదాక్రాంతం కావాలి! అని ఆశిస్తే మాత్రం, దురాశ, అత్యాశ, వెకిలి తనం, వెర్రితనం అవుతుంది.

వాంఛ చైతన్యానికి చిహ్నం. తాను ఆశించింది పొందడానికి మనిషి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తాడు.

ధనం కావాలి - ప్రేమ కావాలి - మనిషికి అధికార బలం కావాలి. తనను సమర్దించేవారు కావాలి - తలచినది కావాలి.సామం: కొన్ని పనులను చక్కగా పరిస్థితులను స్వయంగా వివరించి చెప్పడం వలన గాని, తగిన వారితో చెప్పించడం వలన గాని చక్కబెట్టుకోవచ్చును. దీనినే "సామోపాయం" అంటారు.

దానం: అప్పటికీ నెరవేరని కార్యాలను బహుమతులు, ధనాన్ని ఇచ్చి కాని, ఇతరత్రా ప్రలోభాలకు వారిని ఎరవేసి వారి కోరికలు నెరవేర్చడం వలన సాధించ వచ్చును. దీనిని "దానోపాయం" అంటారు.

భేదం: బుద్ధి బలం ఉపయోగించి వారి సన్నితుల మధ్య అపార్థాలు కల్పించుట, అంతఃకలహాలు సృష్టించుట, వలన గాని, ఈ విధంగా విధిలేని పరిస్థితులు కల్పించుట వలన గాని అనుకున్న కార్యాన్ని సులభంగా సాధించవచ్చును. దీనిని "భేదోపాయం" అంటారు.

దండన: తప్పని పరిస్థితుల్లో కొన్నింటిని బలప్రయోగం చేయడం ద్వారానే సాధించాల్సి ఉంటుంది. దీనిని "దండోపాయం" అంటారు.

అన్ని చోట్ల ఏ ఒక్కటి మాత్రమే పనిచేయదు. కొన్ని విషయాలలో అంచెలంచెలుగా వాటిని ప్రయోగిస్తూ కార్యసిద్దిని పొందాలి. ఈ విషయంలో సమయం, సందర్భం చూసుకోవాలి. సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. దానికి తోడు మనోబలం కావాలి.

కొన్నింటిని సాధించేందుకు కొందరికీ అర్హత ఉండదు. అర్హత లేకున్నా ప్రయత్నిస్తే ఉపయోగమేముంటుంది?

భారతంలో చెప్ప బడిన రాజ నీతి, యుద్ద నీతిలో చెప్పబడిన చతుర్విదోపాయాలు.

ఈ చతుర్విద ఉపాయాల గురించి మహా బారతంలోని శాంతి పర్వం, ద్వితీయాశ్వాసంలో ఈ విధంగా వివరించబడింది.

రాజు తన ప్రధాన మూల బలం సైన్యంగా గుర్రించాలి. శత్రు శేషం లేకుండా చేసుకోవాలంటే తన సైన్యాన్ని ( చతురంగ బలాలను) ప్రేమగా చూడాలి.

శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించినప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం. యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! దీని వలన వచ్చే రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి.

అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన "సామోపాయం"తో ప్రవర్తించాలి.

‌‌ఒక్కోసారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు.

శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి "దానోపాయం" అవలంభించి తగినంత ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా "సామ దాన దండోపాయాలు" అనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు, శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి "భేదోపాయం" ప్రయోగించడానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి ఉపేక్షాభావం: శుక్రాచార్యుడి అభిమతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావం మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.

కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

ఈ ఆదునిక కాలంలో మానవులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తమ కార్యసాధనలో సామ, దాన, భేద, దండోపాయాలను రకరకాల పద్ధతుల్లో ప్రయోగించి ఫలితాలను పొందు చున్నారు.


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: