🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*త్రిలింగ వైభవం*
➖➖➖✍️
*‘త్రిలింగ’ అంటే మూడు లింగాలని అర్థం. దాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అనే మూడు పుణ్య శైవపుణ్య స్థలాలచే ఆవృతమైన ప్రాంతానికి త్రిలింగ దేశమనే పేరు వచ్చిందని ప్రాచీనకాలం నుంచి ఒక అభిప్రాయం ప్రగాఢంగా ఉంది.*
త్రిలింగము -ప్రకృతి,
తెలుగు- వికృతి
*క్రీ.శ. రెండో శతాబ్దానికి చెందిన గ్రీకు శాస్త్రజ్ఞుడు టోలమి ‘ట్రిలింగానా’ అనే పదం తన గ్రంథంలో ఉపయోగించాడు. వాయు, మార్కండేయ పురాణాల్లో ‘త్రిలింగాశ్చ’ అనే పదం కనిపిస్తుంది. విద్యానాథుడనే పండితుడు తన ‘ప్రతాపరుద్రీయమ్’ అనే అలంకారశాస్త్ర గ్రంథంలో మొట్టమొదట త్రిలింగ వైభవం త్రిలింగాలను పేర్కొనడమేగాక తన రాజు కాకతీయ ప్రతాప రుద్రుణ్ని ‘త్రిలింగ పరమేశ్వర‘ అని సంబోధించాడు. 15వ శతాబ్దానికి చెందిన విన్నకోట పెద్దన తన ‘కావ్యాలంకార చూడామణి’లో త్రిలింగ పదం తెలుగుగా మారిందని పేర్కొన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాలకు ఈ మూడు శివక్షేత్రాలు ప్రతీకలు. దాక్షారామం కోస్తా ప్రాంతంలో ఉంటే, శ్రీశైలం రాయలసీమకు చెందినది. కాళేశ్వరం తెలంగాణలో ఉంది.*
*తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామం పంచారామాల్లో ఒకటి. ఇక్కడి శివుడు భీమేశ్వరుడు. స్వయంభువుగా వెలసిన శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడని పురాణ కథనం. దక్షప్రజాపతి తన అల్లుడైన శివుణ్ని అవమానించిన సందర్భంలో దాక్షాయణి, శివపత్ని అయిన సతీదేవి యాగాగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుందని, ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు అయ్యాయని సంప్రదాయ విశ్వాసం. సతీదేవి కణత పడిన ప్రదేశమే మాణిక్యాంబ పీఠమైనదని, అదే దాక్షారామమని పురాణోక్తి. ఈ ఆలయంలో మూల విరాట్టు 20 అడుగుల ఎత్తున లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో స్వామి అభిషేకానికై సప్తర్షులు గోదావరికి ఏడు పాయలుగా రూపొంది జలాలను సమకూరుస్తున్నారని అందుకే దీనిని ‘సప్తగోదావరం’ అంటారని ఐతిహ్యం.*
*వింధ్య పర్వతానికి గర్వభంగం చేయడానికి దక్షిణానికి వచ్చిన అగస్త్యుడు ఈ ‘దక్షిణకాశి’లో భార్య లోపాముద్రతోపాటు నివసించాడు. కాశీ నుంచి బహిష్కృతుడై దాక్షారామానికి వచ్చిన వ్యాసుడికి అగస్త్యముని స్వాగతం పలికాడు. శ్రీనాథుడి ‘భీమేశ్వరపురాణం’ ఈ క్షేత్రమహాత్మ్యాన్ని వర్ణించే కావ్యం.*
*శ్రీశైల శిఖరం దర్శిస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం. ఇక్కడి శివుడు, మల్లికార్జునుడు. అమ్మవారు భ్రమరాంబిక. గణపతి పేరు ‘సాక్షి గణపతి’ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈ క్షేత్రంలోనే కూర్చుని శివానందలహరి, భ్రమరాంబపై అష్టకం రచించినట్లు ప్రతీతి. శ్రీశైలాన్ని శైవ సంప్రదాయంలోని కాపాలిక క్షేత్రంగా భవభూతి కవి ‘మాలతీ మాధవం’లో పేర్కొన్నాడు. ఇక్కడ అనేక మఠాలుండేవి. పార్వతీ కల్యాణం, కిరాతార్జునీయ ఘట్టం, మహిషాసుర మర్దన వృత్తాంతం వంటివి ఇక్కడి శిల్పాల్లో విరాజిల్లుతున్నాయి.*
*కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర భూపాలపల్లి(కరీంగర్) జిల్లాలో ఉంది. ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రదేశంలో శివుడు వెలశాడు. కాలుడంటే యముడు. ఒకే పానవట్టంపై శివుడు, యముడు వెలశారు. పాపుల సంఖ్య తగ్గిపోతుందని యముడు శివుడితో మొరపెట్టుకుంటే తాను ముక్తేశ్వరుడిగా వెలసిన క్షేత్రంలో తన పక్కన పూజలు అందుకొమ్మని శివుడు అతడికి వరం ఇచ్చాడని స్థలపురాణం. అభిషేకించిన జలంపై గల రంధ్రం ద్వారా గోదావరి సంగమ స్థలానికి చేరుకుంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహా సరస్వతి ఆలయం ఉంది. బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞానతీర్థం ఉన్నాయి.*✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి