26, జనవరి 2021, మంగళవారం

మన మహర్షులు - 4*

 *మన మహర్షులు - 4* 


 *అరుణి మహర్షి* 


🍁🍁🍁🍁


పూర్వకాలమున అరుణుడను పేరు గల ముని ఉండెడి వాడు.ఆయనకు అరుణి యను పేరు గల కుమారుడు గలడు.అరుణి చిన్నతనమునుండి తపస్సాధనలో ఉండేవాడు.ఈతడు సర్వ గుణ శోభితుడు, మౌనవ్రతుడు.

బ్రహ్మతేజస్వి .

దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు.


అరుణి మహర్షి భారతీయ చింతనకు ఒక రూపునిచ్చిన తత్వవేత్తలలో ప్రముఖుడు.


వేదాంతాలకు చిహ్నాలు అనదగిన మన ఉపనిషత్తులలో ఈ అరుణి మహర్షి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. 


బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో అరుణి బోధలు ప్రముఖంగా కనిపిస్తాయి. 


అంతేకాదు. భారతీయ చింతనకు సంబంధించి ముఖ్యంగా పేర్కొనే 'తత్వమసి' (అది నువ్వే) అనే వాక్యం అరుణి మహర్షి చెప్పినదే! 


అరుణి మహర్షికి ఉద్దాలకుడు అన్న పేరు కూడా ఉంది. 


ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనమూ ఉంది.


 అరుణి తన చిన్నతనంలో దౌమ్యుడు అనే రుషి వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ గురువు గారు ఒకనాడు ఏదో పని మీద వెళ్తూ ఆశ్రమానికి చెందిన పొలాలను జాగ్రత్తగా గమనించుకోమని అరుణికి చెప్పి బయల్దేరాడు.


 దౌమ్యుడు అలా వెళ్లాడో లేదో, ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని వచ్చాయి. చూస్తూచూస్తుండగానే వర్షం చినుకులుగా మొదలై ఉధృతంగా కురవసాగింది. దౌమ్యుని పంటపొలాలకు అనుకుని ఉన్న నీటి ప్రవాహానికి గండి పడనే పడింది. నీరు నిదానంగా పొలాలలోకి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసిన ఆరుణికి ఏం చేయాలో పాలుపోలేదు. గండికి ఎంతగా మట్టి కప్పినా అది నిలవడం లేదు. ఇక ఎలాగైనా గురువుగారి పొలాలను, ఆయన మాటను కాపాడాలనే తపనతో... తానే ప్రవాహానికి అడ్డుగా పడుకొన్నాడు అరుణి.


 ఆ రోజు చీకటిపడే సమయానికి ఆశ్రమానికి చేరుకున్న గురువుగారికి అరుణి కనిపించలేదు. వెంటనే తన విద్యార్థులు కొందరిని వెంటబెట్టుకుని అడవిలోకి బయల్దేరారు గురువుగారు. అక్కడ తన పొలాలను చేరుకున్న దౌమ్యునికి, 

అంత వర్షంలో కూడా అవి నిండిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది. 


కారణం ఏమై ఉంటుందా అని నలుదిక్కులా పరిశీలిస్తున్న ఆయనకు సన్నగా ఒక మూలుగు వినిపించసాగింది. ఆ శబ్దం దిశగా చూస్తే ఏముంది! నీటి ప్రవాహానికి అడ్డుగా పడుకుని ఉన్న అరుణి కనిపించాడు. 


అరుణి చేసిన త్యాగానికి దౌమ్యుని నోట మాట రాలేదు. నీటి ప్రవాహాన్ని నియంత్రించినవాడు కాబట్టి, అరుణి ఇకమీదట ఉద్దాలకుడు అన్న పేరుతో పిలువబడతాడని ఆయన ఆశీర్వదించారు. అంతేకాదు! నీటి మీద చూపించిన సాధికారతే జ్ఞానం మీద కూడా చూపగలడని వరాన్ని అందించారు. 


 గురువుగారిచ్చిన మాట వృధా పోలేదు. తన స్వదేశమైన పాంచాలరాజ్యంలోనే కాకుండా మాద్ర, తక్షశిల వంటి రాజ్యాలన్నీ తిరుగుతూ... అక్కడ పేరుమోసిన గురువులందరి వద్దా విద్యను అభ్యసించాడు అరుణి.


 గురువుల దగ్గర్నుంచీ పొందిన జ్ఞానాన్ని మనకు ఉపనిషత్తుల రూపంలో అందించారు.


ఒకనాడు అరుణి దేవికానదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా భయంకరాకారంలో ఒక క్రూరుడు ఎదురుగా రాసాగాడు.మహర్షి శ్రీహరినామం జపిస్తూ నడుస్తూన్నాడు.అంత ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్వతేజస్సును చూపి మంత్రముగ్ధుడై సాష్ఠాంగపడ్డాడు.అతడొక దొంగల నాయకుడు. అనేక క్రూరకృత్యాలు చేసాడు.

మహర్షిని చూడగానే అతని మనస్సు మారనది. వద్దన్ననూ మహర్షి వెంటబడ్డాడు.అతనికి సేవచేయసాగాడు.సంవత్సరముల తరబడిసేవచేస్తూనే ఉన్నాడు. మహర్షికి ఏ ఆపదా రాకుండ కాపాడుచున్నాడు. 


ఒకనాడొక బెబ్బులి మహర్షి పైకి రాబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దానిని సంహరించాడు. అది అరుస్తూ అరుణి సమీపాన పడి మరణించింది. ఆ అరుపునకు అదిరిపడి నమో నారాయణాయ 

అని బిగ్గరాగా అన్నాడు. మరణించి పడివున్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్వ పురుషుడు బయటకు వచ్చాడు.అతడు మహర్షికి నమస్కరించి మహాత్మా నేనొక వీరుడను. విప్రులను బాధించుటచే వారు నన్ను పులివికమ్మని శపించారు. శాపవిమోచనం ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని శోకిన మరు క్షణం ఈ పులి రూపం పోయి మనుష్యు రూపం వస్తుందని పలికారు. మీరు పలికిన నారాయణ మంత్రం నేను విన్నాను. శాపవిమోచనం కలిగింది.అని చెప్పాడు.


 మహర్షి ఆనందించాడు..  తనను సేవించే దొంగలరాజుని పిలిచి నాయనా, నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో అని పలుకగా .


 దొంగలనాయకుడు మహర్షి మోక్షమార్గ ముపదేశించు అనగా అరుణి..నీవు  నేటి నుండి మాంసము తినడం మాని, సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తూంది. సాధన చేయి అని మహర్షి మౌనం వహించాడు.


 ముని అదేశానుశారం హరిస్మరణ చేస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరికి హరి సాయుజ్యం పొందాడు. 


 మహర్షుల కృపకు పాత్రులైనవారు దేనినైనా సాధించగలరు గదా.


 అతనికి శ్వేతకేతు అనే కుమారుడు కలిగాడు.. శ్వేతకేతు బ్రహ్మచర్య దీక్షతో విద్యాధ్యయనం సాగించాడు.


కానీ  తను నేర్చినదే సమస్తమని గర్వించసాగాడు.

కామెంట్‌లు లేవు: