26, జనవరి 2021, మంగళవారం

మన మహర్షులు- 5

 మన మహర్షులు- 5


 *అష్టావక్ర మహర్షి* 


🍁🍁🍁🍁

 

గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. 


తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని.  


జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయన గురువు.


 అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు అతని తండ్రి ఏకపాదుడే. 


అలాంటి మహర్షికి   స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా.


వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఆతను వేదవేదాంగాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు.


 కొన్నాళ్ళకు గర్భవతి అయింది సుజాత.  కడుపులో ఉన్న బాబు  తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను వింటూ ఉండేవాడు. 


ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు.  దానితో ఆగ్రహించిన తండ్రి ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాకా ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి నువ్వు అష్ట వంకరలతో పుట్టుగాక అని శపిస్తాడు.


ఒకసారి  ఏకపాదుడు ధనం కోసం జనకుడి దగ్గరకి వెళ్ళే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో  వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని  అంటాడు.


 ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు.


తన తండ్రి గురించి తెలుసుకున్నఅష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్లి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు.


 ఆ ఆనందంలో తండ్రి అతనిని అందంగా మారేలా వరమిస్తాడు.


 అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు.


అష్టావక్రునికి సంతానం కలిగాక తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోతాడు.


 అతని దగ్గరకి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినపుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.


అంతేకాదు గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే. 


ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే “అష్టావక్రసంహిత”. ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది.



 తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.


అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడు. 


ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు వైకుంఠానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు.


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: