26, జనవరి 2021, మంగళవారం

పరనింద

 *పరనింద అంటే ఏమిటి??? - దాని వల్ల ఎలాంటి దోషమో !!! ఒకసారి తెలుసుకొందాము!!!*

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. 


ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు *"ఆ గొల్లవనితది"* తప్పన్నారు. *కొందరు పాముది తప్పుఅని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పు* అని వాదించటం ఆరంభించారు. 


ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి. చిత్రగుప్తుడు *"ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది"* అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. 


దానికా సమవర్తి *"చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? ఎమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు"* అని తీర్పునిచ్చాడు. 


కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపము లో భాగము మనకు పంచుతారు. *తస్మాత్ జాగ్రత్త!*


*పరనింద మహాపాపం* ..


.

కామెంట్‌లు లేవు: