మన మహర్షులు - 3
అరణ్యక మహర్షి
అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసిందీ అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది.
ఈ మహర్షి ఆశ్రమం రేవానదీ ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది.
పెద్ద పెద్ద జంతువులు కూడ అక్కడ కలిసి మెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు
ఆయన రామనామ జపం ఎప్పుడూ చెయ్యడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది.
పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కిందపడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు
ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది.
అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం, రామ ధ్యానం, రామ స్మరణం, రామ పూజనం, రామ చింతనం, రామ మననం, మొత్తం రామ మయంగా ఉండేవాడు.
ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి, ఆయన రామ భక్తి చూసి స్వామీ ! నేను ఎప్పుడు రాముడితోనే ఉంటాను, అయినా నాకంటే మీకే ఎక్కువ రామ భక్తి ఎలా వచ్చింది? అని అడిగాడు..
అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో చదవండి మరి...
'నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది. కాని నాకు గురువు లేడు కదా... ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం, సంసార సాగరం నుంచి బయట పడే సేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు
అదే.. 'రామనామం'. 'రామ' అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ వుంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. అందుకని రామ' నామం జపించుకో ,'అని చెప్పాడు
తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు.
ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు.
ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు.
అరణ్యక మహర్షి సరయూనది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముడ్ని చూసి
ఆనందంతో కళ్లనుంచి జలజల నీళ్ళు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే
మరిచిపోయాడు
శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని, చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టాడు.
అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాలమీద పడి నమస్కారం చేసి స్వామీ! ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మధన్యమైంది. నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు.
వెంటనే ఆయన శరీరం లో నుండి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది..
చూశారా ! అరణ్యక మహర్షి 'రామ' అనే నామంతోనే భగవంతుడిలో ఎలా
కలిసిపోయాడో!
రామనామం అంత గొప్పదన్నమాట.
ఇదండీ.... పరమ రామభక్తుడైన అరణ్యక మహర్షి కథ!
అల్పపుణ్యప్రదంబు లైనట్టియాగ
ములును యోగంబులును వ్రతంబులును సరియె ?
తెగని సంసారబంధంబు త్రెంచివైచి
క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు."
జై శ్రీరామ్..🙏🙏
🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి