11, జూన్ 2021, శుక్రవారం

*మూక పంచ శతి.*

 *మూక పంచ శతి.*


మూకం కరోతి వాచాలం. ఈ శ్లోకం భగవద్గీత పుస్తకా లన్నింటిలో  మొదటే ఉంటుంది. దీని తాత్పర్యానికి సరిగా సరిపోయే ఉదాహరణ మూక కవి జీవితం. మూక కవి పేరుకు తగి నట్టుగా పుట్టుకతో మూగ వాడు. కంచి కామాక్షి అమ్మవారి కటాక్షం వల్ల మాటలే కాదు కవిత్వం కూడా వచ్చింది. అలావచ్చిన కవితాశక్తి ని మళ్ళీ అమ్మవారి స్తుతి లో నే వినియోగించి ఆయన మొక్షానికి వెళ్ళాడు.


మూక కవి  కామాక్షి అమ్మవారి  పైన వ్రాసిన కావ్యం మూక పంచశతి. ఇందులో 5 అధ్యాయాలు  అంటే 5 శతకాలు గా మొత్తం 500 శ్లోకాలు ఉంటాయి.  ఆ శతకాల కూర్పు వాటి పేర్ల లో ఒక చమత్కారం ఉంటుంది. మొదటిది ఆర్యా శతకం. రెండవది పాదారావింద శతకం. మూడవది స్తుతి శతకం. నాలుగవాది కటాక్ష శతకం. ఐదవది మందస్మిత శతకం.


మూకకవికి పాండిత్యం కలగగానే మొదటగా గుర్తొచ్చింది అమ్మ నే. అది *ఆర్యా శతకం* గా రూపుదిద్దుకుంది. (ఆర్యా అంటే అమ్మవారు అనీ ఒక అర్ధం. అది ఒక చందస్సు పేరుకూడా. మొదటి 100 శ్లోకాలు ఆర్యా చందస్సులో అమ్మవారి మీద వ్రాసినవి.) తరవాత ఆయన బుద్ధి ఆవిడ పాదాల వైపు మళ్ళింది. అది *పాదారావింద శతకం* గా రూపుదిద్దుకుంది. అయనకు భక్తి కుదిరి అమ్మను ధ్యానం చేద్దా మను కున్నాడు. అది *స్తుతి శతకం* గా రూపుదిద్దుకుంది. ఆవిడ కరుణను కోరుకున్నాడు. అది *కటాక్ష శతకం* గా రూపుదిద్దుకుంది. ఆవిడ సంతోషించి అనుగ్రహించింది. ఆ అనుభూతి లోనుంచి వచ్చినది *మందస్మిత శతకం.*


మూక కవికి అమ్మ కరుణవల్ల పాండిత్యం రాగానే మొట్టమొదట వ్రాసిన కావ్యం ఇదే. ఈ కావ్యం రాసిన తర్వాత ఆయన మరి ఇంకొక కావ్యము ఏదీ కూడా రాయలేదు. అమ్మ అనుగ్రహించిన కవిత్వాన్ని ఆమెకే ఒప్పగించాడు.


పుష్పదంతుడు వ్రాసిన శివమహిమ్నస్తోత్రము రావణాసురుడి శివ తాండవ స్తోత్రము ఆదిశంకరుల కనకధారా స్తోత్రము లాగా ఇది చాలా ప్రసిద్ధికెక్కిన స్తోత్రము. కంచి కామకోటి పీఠం లోని ఆచార్యులు అందరికీ  పరంపరగా చాలా ఇష్టమైన స్తోత్రం ఇది. 500 శ్లోకాలు ఉన్నందువల్ల కంఠతా పెట్టడానికి అనువుగా ఉండదు.  సాధారణంగా  శుక్రవారాలు ఒక్కొక్క శతకం చొప్పున కానీ రోజూ ఇన్ని శ్లోకాలని గాని పారాయణ చేస్తారు. 


మూక కవి వ్రాసిన శ్లోకాలు చాలా ప్రౌఢంగా ఉంటాయి.  మామూలు గా పైకి చూస్తే అందమైన వర్ణనలు, పురాణ విషయాలు అమ్మవారి వివిధ రూపలు కనిపిస్తాయి. లోపల వెతికితే శ్రీవిద్య,  శ్రీచక్రం, అమ్మవారి పూజా సంప్రదాయాలు, కుండలిని ఉపాసన మొదలయిన వాటికి సంబంధించిన  మంత్ర,  తంత్ర శాస్త్ర సంబంధ మైన విషయాలు ఉంటాయి.


మూక కవి సంస్కృత పదాలను చిత్రంగా వాడతాడు.  అమ్మవారిని వర్ణిస్తూ ఒక చోట "ఏవం పద దూరా" అంటాడు. ఒక పట్టాన అర్థం కాదు. ఏదైనా పదార్ధాన్ని వర్ణించడానికి ఏవం అనే పదాన్ని సంస్కృతంలో ఉపయోగిస్తారు. "ఇట్లా గా, ఇట్లాటిది" అని ఆ పదానికి అర్థం. భగవంతుడు అవాగ్మానసగోచరుడు. అంటే వాక్కు కు మనసుకు అందనివాడు. వర్ణించ డానికి వీలు లేని వాడు. పరాశక్తి లక్షణం కూడా అదే. అందువల్లనే కామాక్షి అమ్మవారిని "ఏవంపద దూరా"  అని సంబోధించాడు. ఇంకొక చోట అమ్మవారిని శివుని "అతఃపురము" అని వార్ణిస్తాడు.  అతఃపురము అంటే భార్య అని అర్థం రాస్తారు. గృహం  అనే మాటకు భార్య అని అర్థం ఉన్నది. కానీ అతఃపురము అనే పదానికి భార్య అని ప్రియురాలు అని ఎక్కడా అర్థాలు లేవు. మరి ఈ అర్థం ఎలా పొసుగుతుంది. శివుడికి ఇల్లే లేదు. ఇక అతఃపురము ఎక్కడ? అన్వయం సాధించాలంటే కాస్త మూక కవి ఉద్దేశ్యం ఏమై ఉంటుందో మనం ఊహ చేయాలి. శివుడికి ఆకలి వేస్తే అమ్మవారు అన్నపూర్ణ రూపంలో ఆయనకు kitchen cum dining room గా మారితుంది. ఆయనకు సలహా కావాలిసి వస్తే ఆవిడ జ్ఞానప్రసూనాంబ రూపంలో కాన్ఫరెన్స్ హాల్ గా మారిపోతుంది. శివునికి కోరిక కలిగితే ఆవిడ కామాక్షి రూపంలో అతఃపురం గా మారి పోతుంది. ఇలా భావిస్తేనే ఆ సంబోధన కు అన్వయం వస్తుంది. ఇంకో రకంగా అర్థము పోసగదు.


*మూక కవి ఊహను మామూలు గా అందు కోవడం చాలా కష్టం. ఈయన శ్లోకాలను కనుక అర్థం చేసుకోగలిగితే సంస్కృత భాషలో ఇంకెవరి కవిత్వాన్ని అయినా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం 500 శ్లోకాలలో కనీసం 350 శ్లోకాలు ఇలాగే భాషా సంబంధమైన చమత్కారాలు గానీ మంత్రార్ధాలు గాని వేదాంత అర్థాలు శ్రీవిద్య,  శ్రీచక్ర రహస్యాలు మొదలైనవి కలిగి ఉంటాయి..*


"సుకవితా యది రాజ్యేన కిం" అని సంస్కృత భాషలో ఒక నానుడి ఉంది. దాని అర్థం మంచి కవిత్వం ఉంటే రాజ్యం కూడా అక్కరలేదు అని. మూక పంచ శతి స్తోత్రం లో ఉన్న కవిత్వం ఆ స్థాయికి చెందినది. 


*చాలా చాలా మంత్రాలూ, బీజాక్షరాలూ ఈ స్తోత్రం లో నిక్షిప్తం అయి ఉన్నాయి కాబట్టి, మూక పంచ శతిని ఊరికే స్తోత్రం లాగా (పారాయణగా) చదివినా మంచిదే.  వ్యాఖ్యానం తో చదివి తే ఇంకా మంచిది...**పవని నాగ ప్రదీప్.*

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి