11, జూన్ 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందిన దంపతులు..*


*(యాభై ఐదవ రోజు)*


సత్యనారాయణమ్మ గారిని కనిగిరి లో వదిలిపెట్టి వచ్చిన తరువాత శ్రీ స్వామివారిని శ్రీధరరావు దంపతులు కలిసారనీ..మాట్లాడదాము రమ్మని ఆ దంపతులను ఆశ్రమం లోకి తీసుకువెళ్లారు శ్రీ స్వామివారు..శ్రీ స్వామివారి కెదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


"అమ్మా..ఏదో దుష్ట శక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి..ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..ఆ వచ్చినావిడ మీ పాలిట దుష్ట శక్తి కాదు..మీకు అయాచితంగా.. పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి..శ్రీధరరావు గారూ నేను మొదటిసారి మొగలిచెర్ల లోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను గుర్తుందా..మీ అమ్మగారికి మృత్యువు పొంచివుంది..ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను..నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పి వున్నాను..ఆమె బాధ్యతను మీనుంచి తొలగించడానికే దైవం ఆ "బంధువు" ను   ఇక్కడికి పంపాడు..ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు..పడలేరు..ఎక్కువ సమయం లేదామెకు..కొద్దిరోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు..


"ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవ ఫలితం ఎక్కడికీ పోదు..మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ..మళ్లీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది..ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి..ఇది మీకు మరో జన్మ గా అనుకోండి!..మీకు  దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు..అవి మీరు నెరవేర్చాలి..అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగి పోవాలి..ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం..ఒక కష్టం..ఒక సుఖం..ఒక దుఃఖం..ఒక సంతోషం..వీటన్నింటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి..వీటన్నిటి కి ప్రేరణే ఈనాడు ఆ  భగవంతుడు చేసిన ఏర్పాటు.."


"మరో ముఖ్య విషయం..త్వరలో నా పరంగా మీమీద పెద్ద భారం పడబోతోంది..అందుకూ మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది..ఇక మనసు గట్టి చేసుకోండి..నిశ్చింతగా వుండండి.. ఏ బాధా.. ఏ సంతోషం..మీ మార్గం నుంచి వేరు చేయలేవు..ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది..అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు.." 


"అమ్మా..నువ్వు రచయిత్రివి..నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి..ఇక ఎక్కువ ఆలోచించకండి..శుభం జరుగుతుంది.." అన్నారు..


శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్తైర్యాన్ని ఇచ్చింది..మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి..ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము..అనే భావనలోకి వచ్చేసారు..ఆరోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది..పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది..శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది..


ఎందరో సాధకులు..ముముక్షువులు..పండితులు..శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెర్ల రా సాగారు..వారిని ఆదరించడం..సత్సంగ గోష్ఠులు..ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది..వారూ అందులో ఇమిడిపోయారు.


ప్రభావతి గారిని తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..రేపు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: