🙏🌺 ఇది ఒక 300ఏళ్ల క్రితం జరిగింది. 🌺🙏
🌺దక్షిణ కర్ణాటకలో ఒక భక్తుడుండేవాడు. అతని తల్లికి వృద్ధాప్యంవల్ల అంత్యకాలం సమీపించడంతో, కాశీకి వెళ్లి విశ్వనాథుడైన పరమశివుని సన్నిధిలో శరీరం విడిచిపెట్టాలని భావించింది. ఆమె తన జీవిత కాలంలో కోరిన కోరిక అదొక్కటే. తన కొడుకుతో “నన్ను కాశీకి తీసుకువెళ్ళు. నాకు ముసలితనం వచ్చింది.నేను అక్కడకెళ్లి శరీరం వదులుతానుఅని చెప్పింది.🌺
🌺 అతను తన తల్లితోపాటు కాశీకి ప్రయాణమై, వారు దక్షిణ కర్ణాటక అడవులగుండా నడిచి వెళ్ళడం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణం, పైగా వృద్ధురాలు కావడంతో ఆమెకు సుస్తీ చేసింది. అప్పుడతను ఆమెను తన భుజాలపై వేసుకుని నడవసాగాడు. కొద్ది సమయంలోనే అతని శక్తీకూడా క్షీణించసాగింది.
ఇప్పుడు ఈయాత్ర ముందుకుసాగాలంటే శివుడ్ని వేడుకోవడంతప్ప మరో మార్గంలేదని భావించి అతను “శివయ్య! నాప్రయత్నం వృధా కాకుండాచూడు తండ్రీ! నాతల్లి కోరుకున్న ఒక్కగా నొక్క కోరికను తీర్చనివ్వు. నేను ఆమెను కాశీకి తీసుకుళ్ళాలి. నీకోసమే మేము అక్కడకొస్తున్నాం. నాకు శక్తినియ్యవా పరమేశ్వరా..” అంటూ వేడుకోసాగాడు.🌺
🌺 అతను అలా నడుస్తూపోతున్నప్పుడు, ఎడ్లబండి వెనుకగా వచ్చేటప్పుడు మోగే గంటల శబ్దం వినబడింది. పొగమంచులో నుండి ఒక ఒంటెద్దుబండి అతనివైపు రావడం గమనించాడు. ఇదో వింత. ఎందుకంటే ఆప్రాంతంలో ఒంటెద్దు బండి కేవలం తక్కువ దూరం ప్రయాణించడానికే వాడుతారు. అడవులగుండా దూరప్రయాణం చేయాలంటే రెండెడ్లు కావాలి. కానీవారు అప్పటికే బాగా అలసిపోవడంతో ఇవేమీ పట్టించుకోలేదు.
బండి దగ్గరకొచ్చినా, దాన్ని నడిపే అతను ముసుగులాంటి బట్టకప్పుకుని ఉన్నందున ఇంకా పొగమంచువల్ల అతని మొహం సరిగ్గా కనిపించలేదు. అప్పుడతను “నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఖాళీ బండిలో మేము ప్రయాణం చేయవచ్చా?” అని అడిగాడు. బండి నడిపే అతను సైగ చేస్తున్నట్టు తలూపాడు. ఆ ఇద్దరూ బండెక్కి ప్రయాణించసాగారు.🌺
🌺 కొంత సమయానికి అతను అడవి మార్గంలోకూడా బండి అంతటి సునాయాసంగా కదలడాన్ని గమనించాడు. అప్పుడు అతడు కిందకు చూస్తే, బండి చక్రాలేమీ తిరగకుండా, స్థిరంగా ఉన్నాయి. కానీ బండిమాత్రం పోతూనే ఉంది. అప్పుడతను ఎద్దువైపు చూసాడు, అది కూర్చుని ఉంది. కానీ, బండిమాత్రం పోతూనే ఉంది.
అప్పుడతను బండినడిపే అతన్ని పరిశీలిస్తే, కేవలం ముసుగుబట్ట మాత్రమే కనిపిస్తుంది. కానీ ముసుగులో ఎవరూలేరు. తల్లివైపు చూశాడు. అప్పుడు ఆమె “ఇంకా అర్ధం కాలేదా? మనం గమ్యానికి చేరిపోయాం. ఇంకెక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇక్కడే నన్ను వెళ్లనివ్వు.” అని చెప్పి ఆ తల్లి శరీరం విడిచింది. ఎద్దు, బండి, ఆ బండిని నడిపేవాడు అందరూ మాయమయ్యారు!🌺
🌺 అతను తిరిగి అతని స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడివారు “అతను చాలా త్వరగా వచ్చాడంటే.. ఖచ్చితంగా తల్లిని కాశీకి తీసుకుపోకుండా మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడు.” అని భావించారు. అతనిని “నీ తల్లిని ఎక్కడ వదిలేసావ్?” అన్నారు. అతను “లేదు, మేము కాశీకి వెళ్ళే పనిలేకుండానే శివయ్యే మా కోసమొచ్చారు” అని బదులిచ్చాడు. వాళ్ళు “ఇదంతా ఒట్టి బూటకం!” అన్నారు.
అతను “మీరేమైనా అనుకోండి. శివుడు మాకోసమొచ్చాడు. అంతే. నా జీవితం ధన్యమైంది. నాకు నాలో అది తెలుస్తుంది. మీకు తెలియకపోతే.. నేను చేసేదేమీలేదు.” అన్నాడు. వాళ్లప్పుడు “సరే, అయితే నువ్వు శివుడ్ని చూశావనడానికి గుర్తుగా మాకు ఏమైనా చూపించు” అన్నారు. అతను “నాకు తెలీదు. ఎందుకంటే నేనతన్ని చూడలేదు. నేను ముసుగున్న బట్టనే చూశాను".🌺
🌺 "అందులో ముఖం కనబడలేదు. అక్కడ ఏమీలేదు, అంతాఖాళీ” అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టుండి అతను కనుమరుగైపోవడం గమనించారు. కేవలం అతని దుస్తులు మాత్రమే కనిపించాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప తపస్వి అయ్యారు.🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి