*పిల్లలు అప్పుడు- ఇప్పుడు!* #కొత్తకథ
🌷🌷🌷
మధ్యాహ్నం ఇంటిపనంతా పూర్తవగానే ,ఒక చిన్న కునుకు తీయడం లతకు అలవాటు! పిల్లలకు వేసవి సెలవులు అవ్వడం వలన , ఎండలో బయటకు వెళ్లకుండా,తలుపులేసి ,హాల్లో ఆడుకోమని చెప్పి ,అక్కడే సోఫాలో పడకకు ఉపక్రమించింది లత!
పడుకుంది కానీ ఓ పక్కన పిల్లల కబుర్లు ,ఆటపాటలు చెవిన పడుతూనే ఉన్నాయి! నిద్రలోనే నవ్వుకుంటూ, వారి మాటలు వింటోంది లత!
పిల్లలిద్దరూ బొమ్మరిల్లు కట్టుకుని , లక్క పిడతలు సర్దుకుంటున్నారు! ఇంతలో హఠాత్తుగా లతకూతురు వెన్నెల ...తమ్ముడితో అంటోంది....
" ఒరేయ్ తమ్ముడు! ఈ టీవీని నేను చెప్తేనే ...నాన్న కొన్నారు !కనక పెద్దయ్యాక ఈటీవీ నాదే సుమా!"
" సరేనే అక్కా! టీవీ నువ్వు తీసుకో ! నాన్న కంప్యూటర్ నేను తీసుకుంటాను! నేను కూడా నాన్నలా కంప్యూటర్ ఉద్యోగం చేయాలి కదా పెద్దయ్యాక!"
" తమ్ముడూ! నేను పెళ్లి చేసుకున్నాకా...అమ్మలా వంటలు అవి చేస్తాను కదా! అందుకనే ఈ గ్యాస్ స్టవ్, గ్రైండర్ ,ఈ ఫ్రిజ్ నేను తీసుకుంటానే! "
"పోవే అక్కా! నాకెందుకు ఆ పిచ్చి వంటింటి సామానంతా! నేను ఏమైనా వంట చేస్తానా ఏంటి పెద్దయ్యాక! నువ్వే తీసుకో! కానీ ఈ ఫ్రిడ్జ్ మాత్రం నాదే సుమా! నేను పెద్దయ్యాక చాలా ఐస్క్రీమ్లు కొనుక్కుని, ఫ్రిజ్లో పెట్టుకోవాలి!"
ఆ విధంగా పిల్లలిద్దరూ గాడ్రెజ్ బీరువా, డైనింగ్ టేబుల్, సోఫాలు, వాళ్ళ నాన్న స్కూటరు ,వాళ్ళ అమ్మ నగలు ,బట్టలు ..ఆఖరికి కుక్కపిల్ల తో సహా అన్ని పంచేసుకున్నారు!
లతకు వాళ్ల మాటలు వింటుంటే మతిపోయింది! ఒక్కసారిగా దిగులు కూడా వేసింది! "పట్టుమని పదేళ్లు కూడా లేవు ఇద్దరికీ! ఎవరో మప్పినట్టు ఎలా మాట్లాడుకుంటున్నారో".... అనుకుంది!
"అమ్మానాన్నల తదనంతరం అంటూ ....అప్పుడే ఎన్ని పంపకాలు చేసేసుకుంటున్నారు! రేపు పొద్దున్న... అమ్మ నాది నాన్న నీది అంటూ కూడా... తమను పంచేసుకుంటారో ఏమో ఈ గడుగ్గాయలు!"... తను ఇంకా పడుకునే ఉంటే... ఇంకా ఏమి వినాల్సి వస్తుందో ...అని గబగబా నిద్రలేచింది లత!
తల్లి ని చూస్తూనే ,మాటలు ఆపేసి , ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ,ఏమీ ఎరగనట్టు ఎవరి ఆటల్లోకి వాళ్ళు దూరి పోయారు అక్కా తమ్ముడు! ఎందుకు కొడుతోందో చెప్పకుండానే ...ఇద్దరివీపుల మీద రెండు దబదబా బాది, వంటింట్లోకి వెళ్ళిపోయింది లత, పిల్లలకు తినడానికేమైనా చేయాలని!
ఆ తర్వాత కూడా తన పరోక్షంలో పిల్లలు రెండు మూడు సార్లు ఇదే ఆట ఆడడం లత గమనించింది! ఎవరి ప్రమేయం లేకుండానే ...పిల్లలలో కనిపిస్తున్న ఈ సంకుచిత మనస్తత్వం లతను...విపరీతమైన అసహనానికి గురి చేసింది! ఈ విషయమై భర్త తో చర్చించినప్పుడు ,అతను ఫెళ్ళున నవ్వుతూ.. పిల్లల ఆట అంటూ తీసి పడేసాడు!
ఒకరి కోసం ఒకరు ఆగని ఈ కాలంలో... కాలం మాత్రం ఎవరి కోసం ఆగుతుంది?. దాని పరుగులు అది పెట్టేస్తోంది!
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు! కష్టపడే పెంచారో.. ఇష్టపడే పెంచారో కానీ... మొత్తానికి ఏ లోటు లేకుండా పెంచారు! ఇద్దరికీ మంచి చదువులు చెప్పించారు! ఆడపిల్ల ,మగ పిల్లవాడు మంచి ఉద్యోగాల్లో కుదురుగానే.... తలకు మించి ఖర్చుపెట్టి ...సవ్యమైన సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు లతా,ఆమె భర్త రాజారావు!
చిన్నతనంలోనే పిల్లలిద్దరూ ఇచ్చిన ఝలక్ చవిచూసింది కనుక ...లతకు పిల్లల మీద పెద్దగా ఆశలు అయితే ఏమీ లేవు! కానీ ఆమె భర్త రాజారావు ఆశావాది! తన రిటైర్మెంట్ తర్వాత ...తన పిల్లలు తప్పకుండా తనను ,భార్యను బాగా చూసుకుంటారు అని అతనికి విపరీతమైన ధీమా! అందుకే పాపం ఉద్యోగంలో ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ,ఇతర పొదుపులు అన్నీ ...పిల్లల భవిష్యత్తు కోసమే ఖర్చు పెట్టేశాడు ఆయన!
ఆలస్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం వలన, ఉద్యోగ విరమణ అనంతరం... రాబోయే పెన్షన్ కూడా అతనికి తక్కువే! ఇరు వైపుల నుండి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు! అందుకే లతకు తమ భవిష్యత్తు తలచుకుంటే విపరీతమైన బెంగ! ఉండడానికి చిన్న ఇల్లు కూడా కనుక్కోలేకపోయారు... పిల్లల భవిష్యత్తుల రంధిలో పడి!
ఇంతలో...భగవంతుడు వీళ్ళకు కాస్త మేలు చేద్దాం అనుకున్నాడో ఏమో, అమెరికాలో లో ఏభైఏళ్ల క్రితమే సెటిల్ అయిన లత పెద్దన్న గారు... ఎప్పుడో నగర శివార్లలో కొని ,మర్చిపోయిన ఒక మూడు వందల గజాల స్థలాన్ని ...లత పేరట రిజిస్టర్ చేయించారు!
విషయం తెలియగానే కూతురు, కొడుకు వెంటనే వచ్చి వాలిపోయారు! ఆ స్థలం హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడంతో... అక్కడ ఇద్దరూ కలిసి, ఇల్లు కట్టుకుంటామని ప్రతిపాదించారు! పిల్లలిద్దరి స్వార్థానికి విస్తుపోయింది లత!
చిన్నప్పటి నుండి వారు కోరినవి ఏవీ కాదనకుండా అమర్చడం రాజారావుకు బలహీనత! ఆ స్థలంలో తాము ఎలాగూ ఇల్లు కట్టలేని పరిస్థితి గనుక ,పిల్లలు ఎంజాయ్ చేయడమే సబబని ,రాజారావు భార్యను ఒప్పించడంతో ,పిల్లలకు ఇల్లు కట్టుకోవడానికి అనుమతిచ్చింది లత!
ఏడాదిలో రాజారావు రిటైర్ అయిపోవడం , ఇంటి పని పూర్తవడం ఒకేసారి అయింది! పిల్లలు, వారి జీవన సహచరులు మంచి ఉద్యోగాల్లో ఉండడం వలన, లోన్లు తీసుకొని , ఆధునికమైన హంగులతో...చక్కని రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నారు! క్రింద అక్కగారు, పైన తమ్ముడు ఉండేటట్టు! రెండు అంతస్తులను కలుపుతూ లిఫ్ట్ సౌకర్యంతో సహా ఏర్పరుచుకున్నారు!
గృహ ప్రవేశం చాలా ఘనంగా తలపెట్టారు ఇరువురు!! ఆ రోజే అనుకోకుండా... రాజారావుకు అరవై ఏళ్ళు నిండుతాయి! తమ జీవితంలో పెద్దగా వినోదాలు , సంబరాలకు తావు లేకపోయినా....తమ కుటుంబం కోసం అంతగా కష్టపడిన భర్తకు... షష్టిపూర్తి ఘనంగా జరిగితే బాగుండునని లత కు ఎంతో ఆశ ఉండేది! పాతికేళ్లకే పెళ్లి ,సంసారబాధ్యతల్లో మునిగిపోయిన రాజారావు ...ఎప్పుడూ తనకై తాను ఎలాంటి ప్రత్యేకత ఆశించేవాడు కాదు! తన జీవితం కుటుంబానికే అంకితం అనుకునేవాడు! భార్యా పిల్లలు ఆనందంగా ఉంటే, అదే పదివేలు అనుకునే అల్పసంతోషి అతను!
పిల్లలు తమకు ఉద్యోగాలు వచ్చాక ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకుంటామన్నా కూడా... వారికి ఆ బాధ్యత అప్ప చెప్పని ఔన్నత్యం అతనిది! ఆ విషయంలో లతకు అతని చాదస్తం మీద కోపం కూడా వస్తూ ఉంటుంది! " పిల్లలు సంపాదించుకుంటున్నారు కదా ఇప్పుడు! వాళ్ల లోన్ వాళ్ళకు అప్పచెప్పేయండి"... అంటూ వాదిస్తూ ఉంటుంది! వాళ్లకు బంధాలు తప్ప, బాధ్యతలు అప్పచెప్పనని అతని జవాబు!
ఎగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన లతకు , మిగిలిన వారి కన్నా తన కుటుంబం ఆర్థికంగా ఎదగనందున, అసంతృప్తి అయితే లేదు కానీ... ఎక్కడో అంతర్లీనంగా కొంత ఆత్మన్యూనత ఉంది! అందుకే ఎక్కడయితే అంతస్తుల తారతమ్యాలు చూపిస్తారో... అక్కడ ఎక్కువగా కలవడానికి ఇష్టపడదు! అంతర్ముఖురాలై ఉంటుంది చాలా వరకు! పిల్లలపై రాజారావు చూపించేంతటి ప్రేమ కూడా, లత చూపించడానికి జంకుతూ ఉంటుంది! పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో కి వెళ్లారు ! సంపన్నులైన తమ అత్తమామలతో, తల్లిదండ్రులను ఎక్కడ పోల్చి చూస్తారో అన్న ఆత్మన్యూనత లత లో అధికం! పిల్లలకు సంపదలు పోగేసి ఇవ్వనప్పుడు ,వారి నుండి ఏమీ ఆశించడం కూడా తప్పే అనుకుంటుంది ఆమె!
అందుకే భర్త షష్టిపూర్తి గురించి తన మనసులోని భావాలు, కోరికలు బయటకు చెప్పలేకపోయింది! ఎవ్వరినీ ... "ఇది చెయ్యండి... "....అని ఆదేశించడం ఆమెకు రాదు!
పిల్లలిద్దరూ ప్రేమగానే ఉంటారు! పెళ్లయి ,సంసారాలు ఏర్పడ్డాక ,తల్లితండ్రులను ఏ విషయంలోనూ "ఇది కావాలి ,అది కావాలి 'అని బాధించలేదు! అమెరికాలో ఉన్న అయిదేళ్ళు... పురుళ్ళకు, పుణ్యాలకు అత్తవారినే ఆశ్రయించారు ,కానీ తల్లిదండ్రులను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు! తల్లిదండ్రులను అమెరికా రమ్మన్నా కూడా ...రాజారావు ఉద్యోగ బాధ్యతల వలన, ఇద్దరూ వెళ్ళలేకపోయారు!
************
గృహప్రవేశం రోజు ఉదయమే.. కూతురు ,అల్లుడు కొడుకు ,కోడలు రాజారావు ఇంటికి వచ్చి , తల్లిదండ్రులకు...నూతన వస్త్రాలను ఇచ్చి , పాదాలకు నమస్కరించి ,దంపతుల నిద్దరిని కారులో కొత్త ఇంటికి తీసుకెళ్లారు!
తమకు అసాధ్యమైన పనిని పిల్లలిద్దరూ సాధించడంతో రాజారావు లతకు చాలా సంతోషం కలిగింది! కొడుకు... తండ్రి చేతిలో సత్యనారాయణ స్వామి చిత్రపటం పెట్టాడు! కూతురు తల్లి చేతిలో లక్ష్మిదేవి విగ్రహం ఉన్న ...వెండి సింహాసనాన్ని ఉంచింది! ఆశ్చర్యంగా చూస్తున్న వారిద్దరితో పిల్లలు.... "మీరే గృహప్రవేశం పీటలమీద కూర్చోబోతున్నారు"...అని చెప్పారు!
ఆవు దూడ,తల్లిదండ్రులు ,వారి వెనుక నీళ్ళ బిందె తో ఆడపడుచు ,ఆ వెనుక కొడుకు అనుసరించగా... శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు!
వాస్తు హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో ఘనంగా... లతా ,రాజారావు లు పీటలమీద కూర్చుని పూర్తిచేశారు! లతకు మనసులో ఎంతో సంభ్రమంగా ,సంబరంగా ఉంది... కనీసం ఆ మాత్రమైనా తమకు గౌరవం దక్కించినందుకు! గృహప్రవేశం భోజనాలకు ఎక్కువమంది అతిధులను పిలుచుకో లేదు! ఒంటిగంటకల్లా కార్యక్రమం అంతా ముగిసిపోయింది!
సాయంత్రం అయ్యే సరికి కొత్త ఇల్లంతా విద్యుద్దీపాలతో, పూలమాలలతో, తోరణాలతో అలంకరించారు! ముందంతా షామియానా, కుర్చీలు వేయించారు! కేటటర్స్ వచ్చారు! "ఓహో రిసెప్షన్ పెట్టుకున్నారు ఏమో పిల్లలు!"... అనుకున్నారు రాజారావు దంపతులు!
కొడుకు, అల్లుడు తండ్రిని గదిలోకి తీసుకెళ్లి చక్కని పట్టుపంచ ,లాల్చీ వేయించారు! నుదుట తిలకం తో చిన్న నిలువు బొట్టు దిద్దారు, బుగ్గన దిష్టిచుక్క పెట్టారు! మెడలో సన్నని బంగారు గొలుసు వేశారు! "ఏంట్రా !ఈ హడావుడి ?"...అని అడ్డుచెప్తున్న తండ్రితో.. "ఊరుకో నాన్నా! ఇన్నాళ్లు మీ మాట మేము విన్నాం! ఇప్పుడు మా మాట మీరు వినాలి!" అన్నాడు కొడుకు!
అలాగే కూతురు, కోడలు లతను చక్కగా ముస్తాబు చేశారు! కొన్నేళ్లుగా పుస్తులతాడు ,సన్నని నల్లపూసల గొలుసు,జతగాజులు తప్పా మారు ఆభరణం ఎరుగని లత మెడలో ,కూతురు రెండు పేటల చంద్రహారాలు వేసింది! చేతులకు రెండు జతల గాజులు ఎక్కించింది!
" ఏంటి ఇదంతా వెన్నెల? నాకు ఇవన్నీ అలవాటు లేదు ! పరుల సొమ్ము బరువు చేటు!"...అంటూ సున్నితంగా తిరస్కరిస్తున్న తల్లితో...." ఎందుకు అలవాటు లేదమ్మా! నీ పుట్టింటి బంగారం పదిహేను తులాలు మా కోసమే కదా... కరిగించావు! అయినా పరాయి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నీకు ఈ మాత్రమైనా చేసే హక్కు, అధికారం మాకు లేదా? "... అంటూ తల్లిని ప్రేమగా కావలించుకుని, బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది కూతురు!
ఆ సాయంత్రం ఫంక్షన్ కు వచ్చిన వారంతా రాజారావు ఆఫీస్ కొలీగ్స్, లతా రాజారావుల బంధుమిత్రులు! వారందరి సమక్షంలో తల్లిదండ్రులతో దండలు మార్పించి,తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని... పెద్ద కేక్ కట్ చేయించి, షడ్రసోపేతమైన విందు తో అతిథులను అలరించారు పిల్లలు!
పిల్లలిద్దరూ ఆహుతుల సమక్షంలో మాట్లాడుతూ.... వాళ్ళ అమ్మానాన్నలు ఎంత గొప్పవారో, తమనెంత ప్రేమగా ,గారంగా పెంచారో, తమ ప్రగతికి వారెంత కృషి చేశారో... చెప్తూ ఉంటే... లత కళ్ళల్లో నీరు తిరిగింది! తన పిల్లలను తను సరిగ్గా అర్థం చేసుకోలేదేమోననుకుంది! బాల్య చాంచల్యంతో... చిన్నతనంలో...వారు మాట్లాడుకున్న మాటలు ,తన మనసులో ,అంతర్లీనంగా వారి మీద ఒక అభిప్రాయాన్ని సృష్టించడం వలన....వాళ్లు ఏం చేసినా ...స్వార్థంతో చేస్తున్నారనే....ఒక దురభిప్రాయం ఏర్పడింది ఏమో తనలో! తమ కుటుంబాల్లో కొందరు పిల్లలు ...తమ తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న నిరాదరణ చూసాకా...తన పిల్లలు కూడా, అదే దారిలో నడుస్తారన్న నమ్మకం తన మనసులో దృఢంగా పాతుకుపోయిందేమో! మాతృత్వ మమకారాన్ని కూడా ఒకలాంటి మాయతో కప్పేసుకుని ...పిల్లలకు ,తనకు మానసికంగా దూరం పెంచుకుంది ఇన్నాళ్ళు!.... లత లో అంతర్మధనం మొదలైంది!పిల్లలతో మనసువిప్పి మెసలుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ రాత్రి...అతిథులంతా.. రాజారావు దంపతుల అదృష్టాన్ని కొనియాడి... సెలవు తీసుకున్నాకా .... లతకు రాజారావుకు తమచుట్టూ ఏమవుతుందో కూడా తెలియనంత పరవశత్వం కలిగింది!! ఏదో స్వప్న లోకంలో ఉన్నట్టుంది! పిల్లలు చేసిన ఆ సన్మానం... వారి మనసులను ఎనలేని ఆనందంతో నింపేసింది!
ఆ మర్నాడు అల్లుడు, కొడుకు వచ్చి లతను,రాజారావును రిజిస్ట్రార్ ఆఫీస్ కి తీసుకెళ్లారు!! వారు కట్టిన ఆ యింటిని ...తల్లిదండ్రుల పేరిట రిజిస్టర్ చేయించారు అక్కా, తమ్ముడూ! ఆ దంపతులు ఎంత వ్యతిరేకించినా పిల్లలు వినలేదు! ఆ ఇంటి మీద సంపూర్ణ హక్కు తల్లిదండ్రులదే అన్నారు! తల్లిదండ్రుల తోనే వారిద్దరూ తమ కుటుంబాలతో..ఇకపై, ఉండబోతున్నామని కూడా ప్రకటించారు!
ఇప్పుడు లతా, రాజారావు పిల్లలతోనే ఉంటున్నారు! లత మనసులో మునపటి బిడియం, ఆత్మన్యూనతా లేవు! తన పిల్లల విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది ఆమె! తను వేరు ,వారు వేరు అన్న భావం ఆమె మనసులో చెరిగిపోయింది! తన పిల్లల గురించి , వారి బాల్యంలోనే తాను ఏర్పరుచుకున్న ఊహలు, అంచనాలన్నీ తారుమారు అయినందుకు లత ఎంతో సంతోషిస్తుంది ఇప్పుడు!
అయితే...ఇప్పటికీ అక్కా, తమ్ముడూ పంపకాలు వేసుకుంటూనే ఉంటారు! ఎటొచ్చి అమ్మానాన్న" నా దగ్గర ఉండాలి" అంటే..." నా దగ్గర ఉండాలి.." అని!
*ధన్యవాదాలతో ఓలేటి శశికళ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి