గోడేమిటి ఎద్దుగా మారడమేమిటి !
.........................................................
ఇడగూరు రుద్రకవి తెలుగుకన్నడలలో మేలైన కవిత్వం చెప్పగల దిట్ట. ఇతను 1822 - 1887 కాలంనాటివాడు. పుట్టిందేమో ఇడగూరు.కర్ణాటకలోని ఇప్పటి చిక్కబళ్ళాపురం జిల్లాలోని గౌరిబిదనూరు తాలూకాలో వుందీ ఇడగూరు. దీనికే హిడింబాపురమని కూడా పేరు. ఈ గ్రామం శివగురువులకు నిలయం.
ఈప్రాంతంలోనున్న గోడలాపురం (🚩) గ్రామంలో వివాహితుడైన శివదీక్షాగురువు ఒకరుండేవారు. ఆయన గుర్రానికి బదులుగా ఎద్దునెక్కి సంచరించేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఎద్దుకట్లు తెంచుకొని ఎటో వెళ్లిపోయింది. ఉదయాన్నే అల్లరిపిల్లలు కొందరు నీ ఎద్దుతప్పించుకోని పారిపోయింది కదా ! నీవేలా పోతావంటూ బాగా గేలిచేసారు. అందుకా శివాచార్యుడు చిన్నగానవ్వి పక్కనే పడిపొయివున్న గోడమీద కూర్చుని పదపద అంటూ చర్నకోలను ఝళిపించాడు.ఆ గోడ అమాంతంగా గాల్లోలేచిపోయింది.
అప్పటినుండి ఇతనికి ఎత్తినయ్య అనేపేరు కలిగింది. కన్నడభాషలో ఎత్తినంటే ఎద్దని అర్థం.
కొంతకాలానికి ఈ గురువు హిడింబాపురంచేరుకొన్నాడు. హిడింబాసురుని సంహరించడం వలననే ఇడగూరుకు హిడింబాపురమనే పేరు కలిగిందని ఇక్కడి శాసనమొకటి తెలియచేస్తోంది.
ఆ గ్రామంలో పుష్పాచార్యుడనే సదాచార సంపన్నుడొకడు వుండేవాడు. ఎత్తినయ్య తన కూతురుని అతడికిచ్చి వివాహం చేశాడు. పుష్పాచార్యుని కొడుకే రుద్రకవి.
కోలారుజిల్లాలో నాటి ప్రజల వ్యవహారభాషైన తెలుగులో లేపాక్షిరామాయణం, శశిరేఖాపరిణయం, లవకుశ వంటి యక్షగానాలు ప్రచారంలోవుండేవి.రుద్రకవి బాల్యం నుండే కన్నడసంస్కృతాలలో కవిత్వం చెప్పగల సామర్థ్యం కలవాడు. తెలుగులో మాట్లాడగలడు కాని కవిత్వం చెప్పలేడు. సుందరమైన మధురమైన తెలుగును నేర్చుకోవాలని సంకల్పించినాడు.
గౌరిబిదనూరులో కవికలభ కంఠీరవ బిరుందాంకితుడైన భట్టుమూర్తి వుండేవాడు. భట్టుమూర్తి తెలుగుసాహిత్యంలో మేటి. అతనివద్ద శిష్యరికం చేసి తెలుగువ్యాకరణంతో సహ తెలుగులో కవిత్వం చెప్పగల నేర్పును సంపాందించాడు.
ప్రజల అభిరుచిమేరకు మిత్రులైన సాహుకారు మురుడప్ప, హొన్నేగౌడల ప్రోత్సాహంతో తెలుగులో మార్కేండేయచరిత్రమనే యక్షగానాన్ని వ్రాసి ప్రదర్శించాడు. మురుడప్ప కోరికమేరకు దానిని కన్నడభాషలోనికి అనువదించాడు..
ఇతని కీర్తిని విని, మైసూరు మహరాజు కృష్ణరాజవడయారు వారు తన సంస్థానంలో యక్షగానాలను ప్రదర్శించాల్సిందిగా ఆహ్వానించాడు. రాజభవనంలో యక్షగాననాటకాల ప్రదర్శనకు మైసూరుమహరాజు, అధికారులు, అంత:పుర స్త్రీలు, పురప్రముఖులు విచ్చేశారు.మొదట రాజుగారి తొలి పలుకులనంతరం రుద్రకవి రాజుగారి కీర్తిని వర్ణిస్తూ, సాహిత్య తన్మయానికి లోనైనాడు. ఆ పరధ్యానంలో రాజుగారిని కీర్తించటానికి బదులుగా తననాదరించిన హొన్నేగౌడను ప్రశంసించడం మొదలుపెట్టాడు. అంతవరకు ముగ్ధులైవింటున్న మహరాజుకు ఇది సహించలేదు. సభికులు బిత్తరపోయారు. రాజుగారు లేచి చరచర వెళ్ళిపోయారు. ఇంకేముంది నాటకం రసాభసమైంది. అతని నాటకసామాగ్రిని బయటపడేశారు. నాటకపాత్రదారులకు మెడబట్టి తోసినంత పనైంది.
తనకు తెలియకుండా తాను మైసూరు రాజాశ్రయంలో ఇతరులను ప్రశంసించినందుకు రుద్రకవి ఎంతో బాధపడ్డాడు. కాని ఏం ప్రయోజనం వీధినపడ్డాడు. ఏం చేయాలో తోచక రోజు చాముండికొండ పైనున్న చాముండిని దర్శించుకొని అమెపై అసువుగా కవిత్వం చెప్పుకొనేవాడు. ఒకరోజు ఉదయం పర్వత పాదంలోనున్న నందిశిల్పం వద్ద బసవవర్ణన చేస్తూ
కరుణిమ కర్తుక ప్రణుత కల్మషదూరగ కద్రువాత్మజా
...............
...............
..... కకార సుతాం బసవేశ పాహిమాం.
అంటూ శ్రావ్యంగా ఆలాపించసాగాడు. అదే సమయంలో రాజు అమ్మవారిని దర్శించుకొని వెనుదిరిగి వస్తున్న సమయంలో ఈ మధురగానాన్ని విని సిబ్బంది ద్వారా ఆ గానం చేస్తున్నది రుద్రకవేనని తెలుసుకొని, పశ్చాత్తాపం చెంది, రుద్రకవి యక్షగానాలను తన రంగమండపంలో ఏర్పాటుచేయించుకొని చూచి విని ఆనందపడి రుద్రకవిని ఘనంగా సన్మానించుకొన్నాడు.
1876 - 78 ప్రాంతంలో కోలారుజిల్లాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి ప్రజలు రైతులు తీవ్రమైన బాధలకు లోనైనారు. ఈ సమయంలోనే పన్నులను వసూలు చేయటానికి అదాలత్ రుద్రప్పనే అధికారి వచ్చాడు. రుద్రకవి కవిత్వంతో అతనికి స్వాగతం పలికాడు. ఇదంతాపట్టని అదాలత్ రుద్రప్ప బలవంతంగానైనా సరే శిస్తువసూలుకు సిద్ధమైనాడు. అపుడు
.... నాల్గు తాలూకు లాప్కారి కంట్రాక్టుకీవే ఇజార్దారుడవై........
అంటూ వచన తెలుగుదండకంలో రుద్రప్పను ఏకిపారేశాడు. రుద్రకవి తెలుగులో వేంకటేశ్వర మహత్య్మం, విరూపాక్షమహత్య్మం, మురుడేశ్వరశతకం, రుద్రకవిశతకం, తిట్లదండకం మొదలైనవి కన్నడనాట వ్రాసి తెలుగు కన్నడీగుల హృదయంలో స్థానం సంపాదించుకొన్నాడు.
(🚩) గోడలల్లి,గోడలాపురాలను అపభ్రంశరూపంలో గోళ్ళపల్లి గోళ్ళాపురాలుగా మారిపోయాయి. ఆంగ్లభాషా పుణ్యాన అవి గోల్లపల్లి, గొల్లపురాలుగా మారాయి.
( సేకరణ)
........................................................................................................................ జి.బి.విశ్వనాథ. 9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి