14, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం

 *13.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారుచతుర్భుజమ్|*


*సుచారుసుందరగ్రీవం సుకపోలం శుచిస్మితమ్॥12766॥*


*14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*సమానకర్ణవిన్యస్తస్ఫురన్మకరకుండలమ్|*


*హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్సశ్రీనికేతనమ్॥12767॥*


*14.40 (నలుబదియవ శ్లోకము)*


*శంఖచక్రగదాపద్మవనమాలావిభూషితమ్|*


*నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయా యుతమ్॥12768॥*


*14.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ద్యుమత్కిరీటకటకకటిసూత్రాంగదాయుతమ్|*


*సర్వాంగసుందరం హృద్యం ప్రసాదసుముఖేక్షణమ్|*


*సుకుమారమభిధ్యాయేత్సర్వాంగేషు మనో దధత్॥12769॥*


ఆ ధ్యాన స్వరూపము ఇట్లుండును. ఆ రూపమునందలి అవయవములు అన్నియును సమాన ప్రమాణములో సౌష్ఠవముగా నుండును. ఆ రూపము ప్రసన్నముగా ఉండును. ముఖము ఆహ్లాదకరమైనది. ఆ మూర్తియందలి నాలుగు బాహువులును, దీర్ఘములు, సుందరములు, గ్రీవము (కంఠము) ఒప్పిదమైనది మనోహరమైనది. కపోలములు దర్శనీయములు, చిఱునవ్వు మిగుల స్వచ్ఛమైనది. సమానములుగానున్న ఆ కర్ణములయందలి కుండలములు మిలమిల తళుకు లీనుచుండును. ఆ శ్యామసుందరుని పట్టుపీతాంబరము మనోజ్ఞము. ఆ దివ్యమూర్తి వక్షస్థలము శ్రీవత్స చిహ్నముతో అలరారుచు, లక్ష్మీదేవికి నిలయమై తేజరిల్లుచుండును. ఆ స్వామి ధరించిన శంఖ, చక్ర, గదా, పద్మ, వనమాలల శోభలు అద్వితీయములు. కాళ్ళయందలి అందెలకాంతులు అద్భుతములు. కంఠమునందలి కౌస్తుభమణి దివ్యకాంతులను విరజిమ్ముచుండును. ఆ మంగళకర రూపమున విలసిల్లుచుండెడి కిరీటము, కంకణములు, కటిసూత్రము, కేయూరములు అపూర్వములై శోభిల్లుచుండును. ముఖకాంతులు, వీక్షణముల వైభవములు అనిర్వచనీయములు.  వేయేల ఆ దివ్యరూపము సర్వాంగసుందరము, హృద్యము, ప్రసన్నము, సుకుమారము. అట్టి మంగళకరరూపమును మనస్సున నిలుపుకొనవలెను.


*14.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసాఽఽకృష్య తన్మనః|*


*బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః॥12770॥*


బుద్ధిమంతుడైన పురుషుడు మనస్సుద్వారా ఇంద్రియములను శబ్దాది విషయములనుండి మరల్చవలయును. పిమ్మట బుద్ధి అను సారథి సహాయమున మనస్సును నాయందు లగ్నము చేయవలెను.


*14.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తత్సర్వవ్యాపకం చిత్తమాకృష్యైకత్ర ధారయేత్|*


*నాన్యాని చింతయేద్భూయః సుస్మితం భావయేన్ముఖమ్॥12771॥*



అంతట నా పూర్తి విగ్రహమును ధ్యానించుచుండగా, చిత్తమును సర్వాంగములనుండి తొలగించి నెమ్మదిగా ఒకే స్థానమునందు నిలుపవలెను. అందులోనూ వేరే ఇతర అంగముల చింతన చేయక, కేవలము మందహాసముతో కూడి మిగుల శోభలొలికించెడు నా యొక్క ముఖమునే ధ్యానించుచుండవలెను. (అనగా, ఇంతకుముందు సర్వాంగములను ధ్యానించుమని చెప్పబడినది. ఇప్పుడు ఏకాంగమును తలంచుమని చెప్పబడినది. అనగా - సర్వాంగములను ధ్యానముద్వారా చక్కగా తలంచుచు, క్రమముగా ఏకాంగముపై చిత్తమును కేంద్రీకరించి ధ్యానతత్పరుడు కావలెనని భగవంతుడు చెప్పినమాట. కారణమేమన, నిలకడలేని మనస్సును అనుసరించి సర్వాంగములను దర్శించినమీదట ఏకాంగమున నిలిపినచో చిత్తము ఏకాగ్రము కాగలదని సాధకులకు ముఖ్యసూచన చేయబడినది.


*14.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్|*


*తచ్చ త్యక్త్వా మదారోహో న కించిదపి చింతయేత్॥12772॥*


మనస్సును చిఱునవ్వుతో ఒప్ఫుచున్న నా ముఖమునుండి మరల్చి, ఆకాశమునందు నిలుపవలెను. క్రమముగా ఆకాశచింతనమునుగూడ త్యజించి, చిత్తమును నా స్వరూపమునందే స్థిరపరచవలెను. అనంతరము నన్ను దప్ప మరి ఏ ఇతర వస్తువును గూడ స్మరింపరాదు.


*14.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ఏవం సమాహితమతిర్మామేవాత్మానమాత్మని|*


*విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతమ్॥12773॥*


ఈ విధముగా చిత్తమును ఏకాగ్రమొనర్చినప్పుడు, ఒక జ్యోతి మరియొక జ్యోతితో చేరి, ఏకమైనట్లు తనలో నన్ను అటులే సర్వాత్మనైన నా యందు చేరియున్నట్లు అనుభవింపుము. ఇట్లు నాయందు ఏకీభావస్థితిని పొందుము.


*14.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ధ్యానేనేత్థం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః|*


*సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్యజ్ఞానక్రియాభ్రమః॥12774॥*


తీవ్రమైన ధ్యానయోగముద్వారా యోగి తన చిత్తమును నాయందు లగ్నమొనర్చినప్పుడు ద్రవ్యము, జ్ఞానము, క్రియలు మొదలగువాటియొక్క నానాత్వభ్రమ వెంటనే తొలగిపోవును. అనగా అతనికి సకలపదార్థముల రూపముల యందును పరమాత్మనైన నా ఉనికియే గోచరించును. కేవలము పరమాత్మజ్ఞానము మాత్రమే మిగిలియుండును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి   *భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము* అను పదునాలుగవ అధ్యాయము (14)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: