14, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *14.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*15.1 (ప్రథమ శ్లోకము)*


*జితేంద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య యోగినః|*


*మయి ధారయతశ్చేత ఉపతిష్ఠంతి సిద్ధయః॥12775॥*


*శ్రీభగవానుడు వచించెను* "ఉద్ధవా! ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును తన వశమునందుంచుకొని, తన చిత్తమును నాయందే లగ్నమొనర్చిన యోగికి, అతని సాధనయందు విఘ్నము కలిగించుటకుగాను పెక్కు సిద్ధులు వచ్చి అతని ముందు నిలబడును. సిద్ధులు ప్రాప్తించును".


*ఉద్ధవ ఉవాచ*


*15.2 (రెండవ శ్లోకము)*


*కయా ధారణయా కా స్విత్కథం వా సిద్ధిరచ్యుత|*


*కతి వా సిద్ధయో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్॥12776॥*


*ఉద్ధవుడు నుడివెను* "అచ్యుతా! సకలలోకపూజ్యుడవైన నీవు యోగిపుంగవులకు సిద్ధులను ప్రసాదించు మహానుభావుడవు. సిద్ధులు ఎన్ని? దేనిని ధారణచేసనచో ఏ సిద్ధి ఎట్లు ప్రాప్తించును? దయతో వివరింపుము".


*శ్రీభగవానువాచ*


*15.3 (మూడవ శ్లోకము)*


*సిద్ధయోఽష్టాదశ ప్రోక్తా ధారణాయోగపారగైః|*


*తాసామష్టౌ మత్ప్రధానా దశైవ గుణహేతవః॥12777॥*


*శ్రీభగవానుడు పలికెను* "మహాత్మా! ఉద్ధవా! ధారణాయోగ పారంగతులైనవారు పదునెనిమిది సిద్ధులను పేర్కొనిరి. వాటిలో ఎనిమిది సిద్ధులు ముఖ్యరూపముగ నాయందే గలవు. మిగిలిన పది సిద్ధులు సత్త్వగుణముయొక్క ఉత్కర్షతో యోగులకు లభించును.


*15.4 (నాలుగవ శ్లోకము)*


*అణిమా మహిమా మూర్తేర్లఘిమా ప్రాప్తిరింద్రియైః|*


*ప్రాకామ్యం శ్రుతదృష్టేషు శక్తిప్రేరణమీశితా॥12778॥*


*15.5 (ఐదవ శ్లోకము)*


*గుణేష్వసంగో వశితా యత్కామస్తదవస్యతి|*


*ఏతా మే సిద్ధయః సౌమ్య అష్టావౌత్పత్తికా మతాః॥12779॥*


ఈ ఎనిమిది సిద్ధులలో అణిమ, మహిమ, లఘిమ, అను మూడును శరీరమునకు సంబంధించినవి. కోరిన కోర్కెలను తీర్చెడి *ప్రాప్తి* అను సిద్ధి ఇంద్రియములకు సంబంధించినది. లౌకిక పారలౌకిక పదార్థములను లభింపజేసెడి సిద్ధి ప్రాకామ్యము. మాయను, దాని కార్యములను ప్రేరేపించు సిద్ధి ఈశిత్వము. శబ్దాది విషయములయందు ఉన్నను వాటియందు ఆసక్తుడు కాకుండజేయునది వశిత్వసిద్ధి. అన్ని విధములగు కోరికలు నశించిపోవునట్టిది *కామావసాయిత* అను సిద్ధి. ఈ అష్టసిద్ధులను నాలో సహజముగనే గలవు".


*శ్లో. అణిమా, మహిమాచైవ, గరిమా లఘిమా తథా| ప్రాప్తిః, ప్రాకామ్యమ్, ఈశిత్వం, వశిత్వం చాష్టసిద్ధయః॥* అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యమ్, ఈశిత్వం, వశిత్వం అను ఈ అష్టసిద్ధులను అమరుడు అష్టసిద్ధులుగా తెలిపెను. (అమరకోశము).


*15.6 (ఆరవ శ్లోకము)*


*అనూర్మిమత్త్వం దేహేఽస్మిన్ దూరశ్రవణదర్శనమ్|*


*మనోజవః కామరూపం పరకాయప్రవేశనమ్॥12780॥*


*15.7 (ఏడవ శ్లోకము)*


*స్వచ్ఛందమృత్యుర్దేవానాం సహక్రీడానుదర్శనమ్|*


*యథాసంకల్పసంసిద్ధిరాజ్ఞాప్రతిహతాగతిః॥12781॥*


ఇవి మాత్రమేగాక, ఇంకను మరికొన్ని సిద్ధులు గలవు. ఈ శరీరమనందు ఆకలిదప్పులను, కామక్రోధములను అదుపులో ఉంచగలుగుట, దూరప్రదేశమునగల శబ్దములను వినగలుగుట, వస్తువులను చూడగలుగుట, సశరీరముగా మనోవేగముతో ఇతర ప్రదేశములకు చేరగలుగుట, కోరుకొనిన రూపమును ధరింపగలుగుట. ఇతర శరీరమునందు ప్రవేశింపగలుగుట (పరకాయ ప్రవేశము), స్వచ్ఛందముగా దేహమును చాలింపగలుగుట, దేవతలు, దేవతలవలె అప్సరసలతోగూడి క్రీడించుట, సంకల్పించినదానిని సిద్ధింపజేసికొనగలిగి యుండుట (సంకల్పసిద్ధిని గలిగియుండుట) తిరుగులేని ఆజ్ఞాశక్తిని గలిగియుండుట. ఈ పది సిద్ధులను సత్త్వగుణవృద్ధిచే సమకూరును.


*15.8 (ఎనిమిదవ శ్లోకము)*


*త్రికాలజ్ఞత్వమద్వంద్వం పరచిత్తాద్యభిజ్ఞతా|*


*అగ్న్యర్కాంబువిషాదీనాం ప్రతిష్టంభోఽపరాజయః॥12782॥*


త్రికాల (భూత, భవిష్యద్వర్తమాన కాలముల) జ్ఞానమును కలిగియుండుట. శీతోష్ణ, సుఖదుఃఖ, రాగద్వేషాది ద్వంద్వములకు లోనుగాకుండుట, పరేంగిత జ్ఞానమును (ఇతరుల మనస్సులలోని భావమును) ఎరుంగగలుగుట. అగ్ని, సూర్యుడు, జలము, విషమువంటి శక్తులను స్తంభింపజేయుట, ఎట్టి స్థితిలోను (ఎవరివలనను) పరాజయము పాలుగాకుండుట, అను ఈ ఐదు సిద్ధులును యోగసాధన బలముచే లభించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: