14, అక్టోబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం*

 *14.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణసిద్ధయః|*


*యయా ధారణయా యా స్యాద్యథా వా స్యాన్నిబోధ మే॥12783॥*


ఉద్ధవా! ఇంతవఱకును నేను తెలిపిన ఈ సిద్ధులన్నియును యోగధారణవలన లభించునట్టివి. వాటి పేర్లనుగూడ వివరించితిని. ఇంక ఏ యోగ ధారణ వలన ఏయేసిద్ధులు ఎట్లు లభించునో విపులీకరించెదను, ఆలకింపుము.


*15.10 (పదియవ శ్లోకము)*


*భూతసూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః|*


*అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ॥12784॥*


ఉద్ధవా! పంచమహాభూతముల సూక్ష్మరూపములైన పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) నా శరీరమే. నా ఈ పంచతన్మాత్రలను మనస్సున ధారణ చేయు సాధకునకు *అణిమ* అను సిద్ధి ప్రాప్తించును.


*15.11 (పదకొండవ శ్లోకము)*


*మహత్యాత్మన్మయి పరే యథాసంస్థం మనో దధత్|*


*మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్॥12785॥* 


'మహత్ తత్త్వరూపమున నేనే ప్రకాశించుచున్నాను. మహత్తత్త్వ రూపములోనున్న పరమాత్మయందు మనస్సును నిలుపుటవలన *మహిమ* అను సిద్ధి సమకూరును. అట్లే ఒక్కొక్క మహాభూతముయొక్క తన్మాత్ర యందు గూడ మనస్సును లగ్నము చేసినచో, *మహిమ* అను సిద్ధి లభించును.


*15.12 (పండ్రెంఢవ శ్లోకము)*


*పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్|*


*కాలసూక్ష్మార్థతాం యోగీ లఘిమానమవాప్నుయాత్॥12786॥*


వాయువు మొదలగు నాలుగు మహాభూతములయందును పరమాణురూపమున ఆకాశమే వ్యాప్తమైయున్నట్లు, నేను సర్వత్ర పరిపూర్ణముగా వ్యాపించియున్నాను. చిత్తమును నాయందే లగ్నమొనర్చునట్టి యోగి నా తాదాత్మ్యమును పొందును. అప్పుడు అతనికి *లఘిమ* అను సిద్ధి ప్రాప్తించును. ఆ విధముగనే అతడు కాలముయొక్క సూక్ష్మాతిసూక్ష్మమైన పరమాణువయ్యెడి సామర్థ్యమును గూడ పొందును.


*15.13 (పదమూడవ శ్లోకము)*


*ధారయన్ మయ్యహం తత్త్వే మనో వైకారికేఽఖిలమ్|*


*సర్వేంద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః॥12787॥*


మనస్సు ఇంద్రియములన్నింటిలో ప్రముఖమైనది. ఇది అహంతత్త్వము యొక్క సత్త్వగుణరూప వికారముచే రూపొందును. నా స్వరూపమైన సాత్త్వికాహంకారమునందు తన మనస్సును ఏకాగ్రమొనర్చిన యోగికి తన ఇంద్రియములపై ఆధిపత్యము సిద్ధించును. అట్లే మనస్సును నాయందే లగ్నమొనర్చిన భక్తునకు *ప్రాప్తి* అను సిద్ధి లభించును.


*15.14 (పదునాలుగవ శ్లోకము)*


*మహత్యాత్మని యః సూత్రే ధారయేన్మయి మానసమ్|*


*ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విందతేఽవ్యక్తజన్మనః॥12788॥*

నా అవ్యక్తరూపమునుండియే బ్రహ్మాండము యొక్క నిర్మాణము జరిగినది. మహత్తత్త్వరూపము, సూత్రాత్మయు ఐన హిరణ్యగర్భునియందు మనస్సును ధారణచేసినచో *ప్రాకామ్యము* అను సిద్ధి లభించును. అతడు బ్రహ్మాండమునకు యజమాని (అధిపతి)యై పరమేష్ఠిపదమును పొందును.


*15.15 (పదునైదవ శ్లోకము)*


*విష్ణౌ త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్కాలవిగ్రహే|*


*స ఈశిత్వమవాప్నోతి క్షేత్రజ్ఞక్షేత్రచోదనామ్॥12789॥*


ఈ ముల్లోకములకును నేనే అధిపతిని. త్రిగుణాత్మకమైన మాయకు నేనే స్వామిని. సమస్త బ్రహ్మాండములను నాశనము చేయగల కాలస్వరూపుడను నేనే. క్షేత్రమైన శరీరమునకును, క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును ప్రేరణ గూర్చు పురుషోత్తముడను నేనే. నా ఈ విష్ణుస్వరూపమును చిత్తమునందు ధారణ చేసినవానికి *ఈశిత్వము* అను సిద్ధి లభించును.నా వలెనే అతనికిని ఇచ్ఛానుసారము జీవులకు ప్రేరణను గూర్చెడి సామర్థ్యము గూడ ప్రాప్తించును.


*15.16 (పదహారవ శ్లోకము)*


*నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్దశబ్దితే|*


*మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్॥12790॥*


*శ్లో. ఐశ్వర్యస్యసమగ్రస్య ధర్మస్య యశసఃక్రియః|*


*జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం 'భగ'ఇతీరణా॥*


షడైశ్వర్యసంపన్నుడనైన *నారాయణుడను* నేనే. తురీయస్థితికి చేరిన యోగి, నా ఈ నారాయణస్వరూపమును మనస్సునందు ధ్యానము చేసి, స్థిరముగా నిలిపినచో, అతనికి సాధర్మ్యము కలుగును. అనగా నా గుణములే లభ్యములగును. అట్టియోగికి *వశిత్వము* అను సిద్ధి లభించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: