14, అక్టోబర్ 2021, గురువారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*454వ నామ మంత్రము* 14.10.2021


*ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః*


హరిణాక్షియై స్త్రీలకు యోగేశ్వరేశ్వర స్వరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


కామస్వరూపిణియై, సుందరమైన విశాలనయనములతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోలాక్షీకామరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని స్మరించు భక్తులకు ఆ తల్లి కామరూపిణియై ఇష్టకామ్యసిద్ధిని కలుగజేయును.


అమ్మవారి కనులు తన ముఖసౌందర్యమనెడి ప్రవాహంలో చలించు మీనములవంటివి *(వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా)* అని లలితా సహస్ర నామావళి యందలి పదునెనిమిదవ నామ మంత్రంలో స్తుతించాము. అలాంటి మంగళకరమైన చంచలాక్షులతో పరమేశ్వరి స్త్రీ సౌందర్యానికి సంకేతంగా నిలుస్తూ, కామాక్షిగా (కంచి కామాక్షిగా) భక్తుల ఇష్టకామ్యములను నేరవేర్చునది గనుకనే ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది. 


పరమేశ్వరుడు కామేశ్వరుడు. భక్తుల కోర్కెలను అత్యంత సులభుడుగా తీర్చు భోళాశంకరుడు. ఆయన పత్ని అమ్మవారు తన మిలమిలలాడుతూ కనురెప్పల మధ్య మెరిసే కన్నులతో, త్రిభువనసుందరియై, ఆ పరమేశ్వరునికి కామరూపిణిగా గోచరించుచున్నది గనుకనే ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


అమ్మవారి కన్నులు భండాసురాది రాక్షసులకు మాత్రము అగ్నిగోళములై, ఉగ్రరూపంతో కనుపిస్తాయి గనుకనే ఆ నేత్రాగ్నులనే అస్త్రములకు ఆ రాక్షసులు భస్మమైపోయారు.


అమ్మవారు హరిణాక్షి (లోలాక్షి). ఆ కన్నులు అత్యంతసుందరమై, స్త్రీలకే మన్మథస్వరూపురాలుగా గోచరించుతున్నది గనుక, ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


అమ్మవారు కామరూపిణీ యని అనబడినది గదా! 1.కామము, 2.క్రోధము, 3. లోభము, 4. మదము, 5. మోహము, 6. మాత్సర్యము, 7.పైశున్యము (మోసము), 8. అసూయ అనునవి అష్టమాతలుగా వరాహపురాణమున చెప్పబడినది. కామమునకు యోగేశ్వరి, క్రోధమునకు మహేశ్వరి, లోభమునకు వైష్ణవి, మదమునకు బ్రహ్మాణి, మోహమునకు స్వయంభువు, మాత్సర్యమునకు కళ్యాణి, పైశున్యమునకు యమదండధరాదేవి, అసూయకు వరాహ అను గుణముల నామదేవతలుగా వరాహపురాణమునందు చెప్పబడినది. ఇందులో కామమునకు యోగేశ్వరి గనుక అమ్మవారు స్త్రీలకు యోగేశ్వరేశ్వర స్వరూపురాలుగా వివరింపబడినది. ఈ ఎనిమిది గుణములకు అష్టమాత్రుకలు అధిదేవతలై జీవుని కర్మఫలానుసారము ప్రవర్తించుచుండును. 


అమ్మవారు భక్తులకు ఏ పేరున పిలిస్తే ఆ పేరున కామరూపిణిగా, తన సుందరనయనములతో గోచరిస్తుంది గనుక, *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: