14, అక్టోబర్ 2021, గురువారం

బ్రతుకుతెరువు

 మన హైదరాబాదు మహానగరంలో బ్రతుకుతెరువు దొరకదు  అనేది లేదు.  పట్టుదల, నిజాయితీ, అంకితభావం వున్నప్రతివారు ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చు. 

వ్యాపారం చేయటం అనేది అనుభవం లేకుండా చేయటం వలన మంచి ఫలితాలను ఇవ్వదు.  చాలావరకు చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు వారికి అనుభవం లేకపోవటం చేత మూసివేయపడుతున్నాయి. ఆలా అని నేను ఎవ్వరిని నిరుత్సహ పరచటం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్రయత్నే  ఫలి. కాకపొతే సరైన మార్గదర్శకత్వం కూడా  ఉండాలి. ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందుగా మనం ఎంచుకున్న వ్యాపారం సమాజంలో ఏరకంగా వున్నది అనేది ముందుగా సర్వే చేసి దానికి నాకు వున్నఅనుభవం ఎంతవరకు పనికి వస్తుంది అనేది అంచనావేసుకొని తరువాత మాత్రమే వ్యాపారం చేయాలి.  ఇలా ఎందుకు నేను చెపుతున్నానంటే నాకు అనుభవం లేకుండా ఒక వ్యాపారం భాగస్వామ్యంతో చేసి గతంలో చేతులు కాల్చుకున్నాను. 

వ్యాపారంకన్నా మీరు ఏ వ్యాపారం చేయదలచుకున్నారో ఆ వ్యాపారం చేసే వారి వద్ద హెల్పరుగా కొన్ని రోజులు పనిచేసి ఆ వ్యాపారం యొక్క మెళకువలు తెలుసుకొని తరువాత మాత్రమే సదరు వ్యాపారం చేస్తే తప్పకుండా విజయం సాధించగలరు.  ఎవ్వరి సలహాలు తీసుకోవద్దు. నేను నా అంతట నేనుగా చేయగలను అనే ధీమా వచ్చిన తరువాతే వ్యాపారం మొదలు పెట్టాలి.  పూర్తిగా అప్పుతీసుకొని వ్యాపారం చేయకూడదు, ఆలా చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి రాకపోతే మీరు అప్పు తీర్చలేరు. 

ముందుగా నేను ఏ పనిచేయగలను అనేవిషయాన్ని సొంతంగా బేరీజు వేసుకొని తరువాత ఆ పని ఎక్కడ ఉందని విచారించి ముందుగా పనిలో ప్రావిణ్యం సంపాదించుకోవాలి.  మార్కెటు సర్వ్యే చాలా ముఖ్యం. మహిళలు కూడా వ్యాపారం చేయవచ్చు చేయవద్దని నేను అనను.  కాకపొతే వారి పరిమితులు తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టాలి.  ఎందుకంటె ఏదో ఆటోలోనో లేక మోటారుసైకిలు మీద వస్తువులు తీసుకొని దుకాణాలకు అందచేసే అటువంటి వ్యాపారాలు మహిళలు చేయలేరు. 

ప్రస్తుతం చాలా మంది మహిళలు వస్త్రాలకు సంబందించిన వ్యాపారాలు చేస్తున్నారు.  కొందరు ఊరగాయ పచ్చళ్ళ వ్యాపారాలుచేస్తున్నారు. 

కొద్దిపాటి పెట్టుబడితో చేసే వ్యాపారులు అంటే 2-5 లక్షల పెట్టుబడితో చేసేవి కూడా చాలా వున్నాయి.  కాకపొతే వాటికి సంబంధించిన ప్రజ్ఞనాన్ని ముందుగా పొంది వుండి మార్కెట్లో రిటర్న్స్ యెట్లా వున్నాయి, మూలధనం తరువాత వర్కింగ్ క్యాపిటల్ యెంత అవసరం ఉంటుంది, వస్తువులు నాణ్యంగా చేయటానికి కావలసిన మెళుకువలు, ఉత్పత్తి అయిన వస్తువులు సత్వర విక్రయం అయ్యే మార్గాలు మనకు యెంత శాతం లాభం వస్తుంది అనే విషయాలమీద ముందుగా అవగాహన తెచ్చుకోవాలి.  నా సలహా ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోను వ్యాపారం చతికిల పడకూడదు.   వృద్ధి క్రమ క్రమంగా ఉండాలి. ఇటువంటి విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే వ్యాపారం మొదలు పెట్టాలి.  

అందరు వ్యాపారం చేయలేరు ఆలా చేయగలిగితే చాలామంది వ్యాపారస్తులు అయ్యేవారు. 

వ్యాపారం జాతకం.  మన జాతకాన్ని బట్టి కూడా వ్యాపారాన్ని ఎంచుకోవటం మంచిది. ముందుగా బుధుడు మనకు వ్యాపారవృద్దికి తోడ్పడుతున్నాడా లేదా, మన జాతకంలో ఏగ్రహం మనకు మంచిగా సహకరిస్తుంది అనేది తెలుసుకుంటే మంచిది.  మీ జాతకంలో శని గ్రాహం మంచిగా వున్నదనుకోండి అప్పుడు ఇనుముకు సంబందించిన వ్యాపారం అంటే హార్డువేర్ మీకు రాణిస్తుంది.  అదే శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటే కళలకు సంబందించిన వ్యాపారం అనుకూలిస్తుంది. అన్ని తెలిసిన   జ్యోతిష్కుల సలహా తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. 

కొద్దీ పెట్టుబడితో జీవనం గడుపుతున్నారు. మనం రోజు చూస్తున్నాము కొంతమంది రోజుకు 3-6 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టి సాయంత్రానికల్లా రెండు మూడు వేలు లాభం పొందుతున్నారు.  ఆ విషయం మనకు తెలియదు. అవగాహనకోసం నేను గమనించిన కొన్ని ఉదాహరణలు మీకు తెలుపుతున్నాను. 

1) కూరగాయల వ్యాపారం.  ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం.  ఇందులో ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ప్రతివారికి కూరగాయలు రోజు అవసరం ఉంటాయి.  తెల్లవారుజామున మార్కెటుకి వెళ్లి హోలుసెలులో కూరలు తెచ్చి అమ్మితే చాలా లాభం ఉంటుంది. 

ఈ వ్యాపారంలో 300 నుంచి 500 శాతం వరకు లాభం ఉంటుంది.  కాకపొతే ఇందులో కొంత తరుగుదల ఉంటుంది.  అదేమంటే మీరు 10 కిలోలు కొన్న కూరలు మీరు ఒక్కొక్క కిలోగా లేక అరకిలోగా అమ్మితే అది 8 నుంచి 9 కిలోలుగా మాత్రమే విక్రయించ గలరు.  అయినా లాభం బాగా ఉంటుంది. ఇక రెండో విషయం ప్రారంభయంలో ధర ఎక్కువగా చెప్పి కూరలు కొద్దిగా మిగిలిన తరువాత తక్కువ ధరకు అమ్మ వలెను.  ఇలా చేయటం వలన సగటు లాభం మీకు 100-200 శాతం వరకు తగ్గుతుంది అంటే వెరసి మీకు 200-300 శాతం లాభం ఎటుపోదు.  మీరు ఒక 3 వెల పెట్టుబడితో ఒక రోజు వ్యాపారం మొదలుపెడితే సాయంత్రం వరకు హీనపక్షం  మీకు 500 నుంచి 1500 వందల వరకు లాభం కనపడుతుంది. మనం 30 రూపాయలకు కిలో కొనే ఆలుగడ్డలు హోలుసేలులో కిలో 5 రూపాయలకు దొరుకుతాయి అంటే మీరు నమ్ముతారా. 

2)  పండ్ల వ్యాపారం ఈ వ్యాపారం కూడా కూరగాయల వ్యాపారం లాగ చాలా లాభదాయకమైనది. కూరలతో కలిపి కూడా ఈ వ్యాపారం చేయవచ్చు. 

మరిన్ని వ్యాపారాల గూర్చి తరువాత ముచ్చటిద్దాం. 

కామెంట్‌లు లేవు: