14, అక్టోబర్ 2021, గురువారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*453వ నామ మంత్రము* 14.10.2021


*ఓం త్రినయనాయై నమః*


సోమసూర్యాగ్నులే తన నేత్రములై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రినయనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రినయనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లిని తన హృదయమందు దహరాకాశవాసినిగాను, తన మనోనేత్రములందు ఆ పరమేశ్వరిని సోమసూర్యాగ్ని లోచనిగాను వీక్షిస్తూ పరమమానందభరితుడై తరించును.


శివుడు త్రినేత్రుడు. శివాని (అమ్మవారు) త్రినయన. శివశక్త్యైక్యతకు సంకేతము ఇదియే. ఆ పరమేశ్వరునికి త్రికాలములు (భూతభవిష్యద్వర్తమాన కాలములు) త్రినేత్రములయితే అమ్మవారికి సోమసూర్యాగ్నులే త్రినయనములు. ఒక కంట భక్తులను తేజోమూర్తులుగాను, మరొక కంట సుధాస్వరూపులుగాను, ఫాలనేత్రముతో అగ్నిస్వరూపులై శత్రుభయంకరులుగాను మూర్తీభవింపజేయును. 


అమ్మ వారి త్రినయనములలో ఒక నయనము సూర్యుడగుటచే పగటికిని, రెండవ నేత్రము చంద్రుడగుటచే రాత్రికిని, ఫాలనేత్రము సంధ్యాకాలమునకును సంకేతములుగా కూడా భావించవచ్చును. 


శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో నలుబది ఎనిమిదవ శ్లోకంలో చెప్పిన విధానాన్ని పరిశీలిద్దాము:-


*అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా*


*త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |*


*తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః*


*సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్ || 48 ||*

 

అమ్మవారి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది

 

జగన్మాతా! సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది.చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ నుదుటి పై నున్న మూడవ నేత్రము వలన పగలుకు రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతసంధ్య,సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ! 


పరమేశ్వరి మూడు నయనములు త్రికాలజ్ఞానములకు సంకేతము. ఆ త్రినయనములలో ఒకటి సృష్టికిని, మరియొకటి స్థితికిని, ఫాలనేత్రము లయమునకును సంకేతములు. 


త్రి అనగా మూడుమార్గములను, నయన అనగా లభింపజేయునది. అనగా జీవుడు ఈ స్థూలదేహమును వీడి పోవునప్ఫుడు దక్షిణమార్గము, ఉత్తరమార్గము, బ్రహ్మమార్గములను చూపును. జీవులకు వారి వారి కర్మఫలములననుసరించి ఏ మార్గమున బోవుటకు అర్హతఉండునో ఆ మార్గమును ఆ పరమేశ్వరి అనుగ్రహింపజేయును గనుక ఆ శ్రీమాత *త్రినయనా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం త్రినయనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: