14, డిసెంబర్ 2021, మంగళవారం

భగవద్గీత లో

 *భగవద్గీత  లో ఇష్టమైన శ్లోకాలు..*


భగవద్గీత  లో భక్తి జ్ఞాన వైరాగ్య సంబంధమైన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 


వీటికి తోడు జీవితంలో సాధారణంగా ఎదురయ్యే కష్టాలు ఇబ్బందులు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకు సూటిగా కాకుండా కాకున్నా కాస్త చుట్టూ తిరిగి వచ్చేటట్లు గా జవాబులు ఉంటాయి. మనకు అప్పటి మన పరిస్థితులకు ఏదో ఒక శ్లోకం సరిగ్గా సరిపడేది ఉంటుంది. ఎవరికైనా తమకు పనికివచ్చే శ్లోక మే ఇష్టమైన శ్లోకం అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే భగవద్గీతలో ప్రతి శ్లోకమూ గొప్పదే.


నాకు సంబంధించినంత వరకు జీవితంలో చాలా సందర్భాల్లో చాలా శ్లోకాలు ఉపయోగపడ్డాయి. ఎక్కువ భాగం మనకు వచ్చే సందేహాలకు జవాబులు దొరకడం మన బాధలకు ఊరట మనశ్శాంతి కలగడం ఈ శ్లోకాలవల్ల జరుగుతుంటుంది. అంతేకానీ, సుందరాకాండ పారాయణము, సత్యనారాయణ వ్రతము మొదలైన వాటి లాగా భగవద్గీత శ్లోకాలు వల్ల డబ్బులు రావడం కష్టాలు తీరడం వంటి ఉపయోగాలు అంత ప్రసిద్ధంగా ఎవరూ చెప్పలేదు. 


 మనశ్శాంతి కోసమో సందేహ నివారణ కోసమో భక్తి జ్ఞాన వైరాగ్యా ల కోసమో భగవద్గీత ను ఉపయోగించుకోవాలి అనుకుంటే మొదట మొత్తం పుస్తకాన్ని చదివి   ఏ అధ్యాయములో ఏమి ఉందో కొద్దిగా అవగాహన చేసుకొని ఉండాలి. అప్పుడు మనకు పనికి వచ్చే శ్లోకాన్ని గుర్తుపట్టవచ్చు. 


 సంస్కృత భాషలో పరమ చరమ అని రెండు పదాలు ఉన్నాయి.దానికి మించి  దానికి పైన మరి ఏమీ లేకపోతే అది పరమ అవుతుంది. పరమేశ్వరుడు అంటే అతడిని అదుపాజ్ఞల్లో పెట్టేవాడు మరి ఎవరు ఉండరు. అందరికంటే పైన ఉండేవాడు అతనే అని అర్థము. అలాగే చరమ అంటే ఆఖరిది. కొస ముక్క. అంత దాకా చెప్పిన దాని సారమంతా దానిలో ఉంటుంది అని అర్థము.


 వైష్ణవులు మూడు శ్లోకాలను చరమ శ్లోకాలు గా భావిస్తారు. మొదటిది రామాయణంలో  ఉంది. రెండవది భగవద్గీతలో ఉంది. మూడవది వరాహ పురాణంలో ఉంది.


1.


సకృదేవ  ప్రపన్నాయ తవాస్మితీ చ యాచతే |

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ౹౹ - రామాయణము.


2.


సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ౹

అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ౹౹ - భగవద్గీత.


3.


స్తితే మనసి సుస్వస్తే శరీరే సతి యో నరః |

ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మా మజం

త థా స్తాం మ్రియమానం తు కష్ట పాషాణ సన్నిభం 

అహం స్మరామి మద్భక్తం నయామి పరమామ్ గతిమ్౹౹ ౼ వరాహ పురాణము.


ఇవి కాక సీతా  చరమ శ్లోకం అని శ్రీరంగ చరమ లోకమని, ఇంకా బోలెడు శ్లోకాలు చలామణిలో ఉన్నాయి.


భగవంతుడిని నమ్మి ఆయనను శరణు పొందడమే వైష్ణవ మతం లో ప్రధానమైన అంశం. వాళ్లు ఎంతో పవిత్రంగా భావించే ద్వయ మంత్రానికి అర్థం కూడా ఇదే. ద్వయ మంత్రం కానీ శరణాగతి గాని జీవుడి వైపు నుంచి చేసేవి. దీనికి ఆధారము భగవంతుడు "నన్ను శరణు అన్నవాడిని నేను ఉద్దరిస్తాను" అని ఇచ్చిన వాగ్దాన మే. ఆ వాగ్దాన ఉన్న శ్లోకాలే చరమ శ్లోకాలు. అది భగవద్గీతలో అ.18 శ్లో. 66 సర్వ ధర్మాన్ పరిత్యజ్య అని ఉన్నది. చాలామంది దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: