14, డిసెంబర్ 2021, మంగళవారం

గీతా జయంతి

 ॐ గీతా జయంతి శుభాకాంక్షలు 

                        సందేశం - 1 


    భగవానుని ముఖతః, ఉపనిషత్సారమైన "గీత" అవతరించిన మార్గశిర శుక్ల ఏకాదశి ఈ రోజే! ఇదే "గీతా జయంతి". 

    శ్రీకృష్ణుని రూపంలో భగవానుడు,అర్జునుని రూపంలో ఉన్న నరునికి చేసిన బోధయే "భగవద్గీత". 

     చాలా మందిలో ఇది ఒక మతగ్రంథము అనే అపోహ కనిపిస్తూంటుంది. 

    "భగవద్గీత" అనేది - క్రీస్తు అందిచ్చిన బైబిల్, ప్రవక్త ఇచ్చిన ఖురాన్ వంటి గ్రంథం కాదు. 

    సకల మానవాళికీ సంపూర్ణ విజ్ఞానం భగవద్గీత ద్వారా అందుతుంది. 

    తద్వారా మానవుడు తన మనోవాక్కాయకర్మలతో భూమిమీదే దైవత్వాన్ని పొందే వీలుంది. 

    సమాజపరంగా యజ్ఞాలవలన 

వర్షాలు కురుస్తాయని చెప్పడం, వాతావరణ కాలుష్య తొలగింపు వంటి అనేక వైజ్ఞానిక అంశాలని అద్భుతంగా అందిస్తుంది భగవద్గీత. 

       అన్నిటికన్నా ముఖ్యమైనది కర్తవ్య నిర్వహణ. అర్జునునికి యుద్ధవిధి నొక్కి చెబుతూ, తద్వారా సకల మానవులకీ ఆలోచన - మాట - చేతల కర్తవ్యబోధ చేసే విజ్ఞాన సర్వస్వమే భగవద్గీత.


        భగవద్గీతకి సంబంధించి మచ్చుకి కొన్ని విషయాలు పరిశీలిద్దాం. 


1.దైవ - రాక్షస లక్షణాలు 

  (దైవాసుర సంపద్విభాగ యోగము) 


    పదహారవ అధ్యాయాన్ని చూస్తే, మంచి - చెడులకి సంబంధించి విషయాలు వివరంగా తెలుస్తాయి. 

    తద్వారా మనలోని రాక్షసత్వాన్ని తొలగించుకొని, దైవత్వాన్ని పొందే అవకాశం కలుగూతుంది. 


2. సత్త్వ రజస్తమో గుణాలు 

   (గుణత్రయ విభాగ యోగము) 


    రజో గుణము సృష్టికి కారణము.

    సత్త్వ గుణము స్థితికి/అస్తిత్వానికి కారణము. 

    తమో గుణము లయమునకు కారణము. 

     ఇవి మానవులకే కాక జంతువులకు కూడా వర్తిస్తాయి. 

     మతపరంగా కాక సకల జీవరాశికీ వర్తించే ఈ త్రిగుణాల వివరణాత్మక సందేశం భగవద్గీతలో అద్భుతంగా వివరింప బడింది. 


3. లోకంలో భగవచ్ఛక్తి 

   (విభూతి యోగము) 

    అంతటా, అన్నిటా నిండియున్న దైవీశక్తి ఉదాహరణలతో తెలుపబడింది. 

    సర్వ జీవులలో ఆ "నేను" అనే దైవీభావమును యోగమూర్తిగా ధ్యానము చేయాలి. 

     అప్పుడు ఆత్మభావనతో పరమాత్మ తత్త్వం అవగతమవుతుంది. 

     ప్రహ్లాదుడు అన్నిటా ఒకటే అయి ఉన్న దైవశక్తిని చూచి అసలైన వైష్ణవుడయ్యాడు. 


          ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: