18, ఫిబ్రవరి 2023, శనివారం

సాధకుడు- మనస్సు

సాధకుడు- మనస్సు  

అటుపిమ్మట సాధకుని ద్రుష్టి మనస్సు మీద పెట్టాలి. నిజానికి మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఏ రకంగా అయితే ఒక కోతి ఒక కొమ్మ మీదినుంచి ఇంకొక కొమ్మమీదికి నిర్విరామంగా ఉరుకుతూ, గెంతుతూ నిలకడ లేకుండా ఉంటుందో అదే విధంగా మనస్సు అనుక్షణం వివిధ విషయాలమీద మళ్ళుతూ ఉంటుంది. ఒక క్షణం నీవు చూసిన సినిమా గుర్తుకు వస్తే మరుక్షణం నీకు జరిగిన సంతోషకరమైన లేక దుఃఖకరమైన విషయం. ఒక నిముషం మీ ఊరులో ఉంటే మరుక్షణం ఇంకొక ఊరికి ఇలా పరి పరి విధాలుగా మనస్సు పయనిస్తుంది. అన్నిటికంటే వేగంగా పయనించేది మనస్సు అనేకదా మేధావులు చెపుతారు. యదార్ధానికి సాధకుడు తన శరీరాన్ని నియంత్రించుకోవటంలో ఆంతర్యం మనస్సుని నియంత్రించుకోవటానికి మాత్రమే కదా. 

మనస్సును నియంత్రించుకోవడం: 

ఒక గుర్రం వున్నదనుకోండి దాని రౌతు  చిన్న చిన్న రేకు ఫలకాలను దానికంటికి ప్రక్కగా అమరుస్తారు  దానివలన గుర్రం చూపు ప్రక్కకు మళ్లకుండా కేవలం వీడిమీదనే ఉంటుంది.  కాబట్టి గుర్రం ముందుకు మాత్రమే పరిగెడుతుంది.  అలా గుర్రం నడిపే రౌతు గుఱ్ఱాన్ని లొంగదీసుకుంటాడు. మన మనస్సు కూడా గుఱ్ఱం లాగా పరి పరి విషయాలమీదకు మళ్లకుండా కేవలం భగవంతుని మీదకు మళ్ళటానికి మనం ఏదో ఒక ఫలకాన్ని మనస్సుకు అడ్డంగా పెట్టుకోవాలి.  అది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సాధకుడు ఏర్పాటు రకంగా వారి ఇష్టానుసారంగా  ఏర్పాటు చేసుకోవాలి.  కొంతమంది నామ స్మరణను ఎంచుకొని భగవన్నామాన్ని సదా ఉచ్చరిస్తుంటారు.   ఇంకొకరు భగంతుని భజిస్తూ వుంటారు, కొంతమంది సదా నామ జపం  చేస్తూవుంటారు. (ఉదాహరణకు ఇస్కోన్ సమస్తలోని సాధకులు) కొందరు నామాన్ని లికిస్తూవుంటారు, రామకోటి, శివకోటి వ్రాయటం మొదలగునవి. ఇలా ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఇది మంచిది ఇది కాదు అని అనటానికి లేదు. విధానం ఏదైనాకూడా మనకు కావలసింది మనస్సును నియంత్రించుకోవడం మాత్రమే. మన ప్రయాణం అనాయాసంగా జరగాలి అంటే అది బస్సు అయితే నేమి రైలు అయితేనేమి గమ్యాన్ని చేరటం ముఖ్యం కదా. 

మనం తరచుగా చూస్తూవుంటాము చాలామంది పైన  పేర్కొన్నఏదో ఒక విధానాన్ని అనుసరించి అదే జీవిత లక్ష్యంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు.  కానీ మిత్రమా ఆలా ఎప్పటికి అనుకోకూడదు. ఈ పద్ధతులు కేవలం మనస్సును నియంత్రించుకోవటానికి మాత్రమే ఉపకరిస్తాయి కానీ అంతకంటే వేరొకటి కాదు నీ లక్ష్యం మోక్ష సాధన మాత్రమే. మోక్షయానికి ఈ పద్ధతులు ప్రారంభ శిక్షణగా మాత్రమే ఉపకరిస్తాయి కానీ మోక్షసిద్ది మాత్రము లభించదు. 

మనం పూర్తిగా సాధకులు ఆచరించే భక్తి మార్గాలు మోక్షాన్ని చేరుకోలేవు అని కూడా అనలేము. మనం మన చరిత్రను పరిశీలిస్తే భక్తి మార్గంతో మోక్షాన్ని చేరుకున్న మహా భక్తుల ఉదంతాలు మనకు తెలుసు. ముందుగా భక్తి మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి   అని పదకొండు భక్తి సాధనలున్నాయి.

          శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజు, కీర్తనము వలన తుంబురుడు, విష్ణుస్మరణ వలన నారదుడు, పాదసేవ వలన  శ్రీ మహాలక్ష్మి, అర్చన వలన పృథు చక్రవర్తి, వందనము వలన అక్రూరుడు, దాస్యము వలన హనుమంతుడు, సఖ్యము వలన  అర్జునుడు, ఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడో, ఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడో, కవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటే, భగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందో, అలాగే. 

కాబట్టి భక్తి మార్గం కూడా ఉపయుక్తమైనదే అయితే మరి భక్తిమార్గాన్నే అనుసరించవచ్చుకదా.  జ్ఞ్యాన మార్గం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం సూక్షమంగా పరిశీలిస్తే భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరుగా గోచరించవు. అటువంటప్పుడు రెండు మార్గాలు ఎందుకు వున్నాయి అంటే.  ముందుగా ఒక సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి సాధన కొంత ముందుకు సాగిన తరువాత తనకు తానుగా జీవాత్మ వేరు పరమాత్మా వేరు కాదనే భావనలోకి  వస్తాడు. అప్పుడు తానూ ఈ చరచరా జగత్తుకు కారణభూతుడైన సర్వేశ్వరునిలో అంతర్లీనంగా వున్నాను అంటే 

అహం బ్రహ్మాస్మి 

అనే భావనలోకి వస్తాడు.  ఇలా తెలుసుకోవటమే జ్ఞ్యానం తరువాత తనకు తెలియకుండానే భ్రహ్మ జ్ఞ్యాన పిపాసకుడు అయి తానె బ్రహ్మ అవుతాడు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మయేవ భవత్" 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా అనే సందేహం ప్రతి సాధకుని మదిలో తొలిచే ప్రశ్నయే కొంతమంది విగ్రహారాధన సద్గుణోపాసన అని ధ్యానంలో ప్రతిమ లేదు కాబట్టి అది నిర్గుణోపాసనే అని చెపుతారు. నిజానికి సూక్ష్మంగా పరిశీలిస్తే ధ్యానం కూడా సద్గుణోపాసనే అని చెప్పవలసి వస్తుంది.  అది ఎలా అంటే బాహ్యంగా, బౌతికంగా ఎలాంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అంతరంగికంగా మనం మనస్సుకు ఒక స్థాన నిర్దేశనం చేసి ధ్యానం చేస్తున్నాం. ఉదాహరణకు గీతలో కృష్ణ భగవానులు భృకుటి (రెండుకనుబొమ్మల నడుమ) జాస నిలిపి అంటే మనస్సు నిలిపి ధ్యానానం చేయమన్నారు. కొందరు సాధకులు ఈ పద్దతి సులువు కాదని పేర్కొన్నారు.  ఏదిఏమైయేన సాధకుని అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. ఇటీవల చాలా సంస్థలు యోగా కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కరు శ్వాస మీద జాస అని ఒకరు హృదయంలో జాస అని ఒకరు బిందువు మీద జాస అని కొందరు క్రియా యోగమని కొందరు సుదర్శన యోగమని ఇలా పరి పరి విధాలుగా ధ్యాన పద్ధతులు  తెలుపుతున్నారు. అవి అన్ని తప్పు అని మనం అనలేము. పద్దతి ఏదైనా కానీ అంతిమ లక్ష్యం మనస్సును నిగ్రహించటమే. కాబట్టి ఎవరికి నచ్చిన పద్దతిని వారు అనుసరించవచ్చు. 

పైన పేర్కొనిన ప్రతి పద్ధతిలోను మనస్సు వున్నది అంటే మనోవృత్తి  వున్నాడనుమాట. ఎప్పుడైతే మనస్సు లయం కాలేదో అప్పుడు అది సద్గుణమే అవుతుంది కానీ నిర్గుణం కాదు.  అయితే నిర్గుణోపాసన లేదా అని అడుగవచ్చు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన వున్నది కానీ అది ఉపాసన మాత్రం కాదు ఎందుకంటె ఉపాసన అనే పదంలోనే నీవు భగవంతునికన్నా బిన్నంగా ఉన్నవని కదా అర్ధం.  ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అవుతుందో అదే నిర్గుణోపాసన. అది కేవలం సమాధి స్థితిలోనే లభిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే  ధ్యానం అని మహర్షులు తెలిపారు.

సాధకుడు ఎప్పుడయితే సమాధి స్థితిని పొందుతాడో అప్పుడు అతనికి బాహ్య స్మ్రుతి పూర్తిగా పోతుంది. శరీర వ్యాపారాలు అంటే ఆకలి దప్పులు, హృదయ స్పందన, శ్వాస పీల్చుకోవటం, వదలటం. స్పార్స్య జ్ఞ్యానం, ఇవి ఏవి వుండవు. శరీరం మీద పాములు, జర్రులు ప్రాకిన శరీరం చుట్టూ పుట్టలు పెరిగిన, ఎండలు కార్చినా వర్షాలు కురిసిన ప్రకృతి బీబత్సవంగా ప్రళయాలు సంభవించినా సాధకునికి స్పృహ ఉండదు.  ఆ స్థితిని చేరుకునే సాధకుడు  జీవన్ముక్తుడు. అదే మోక్షముగా మనం తెలుసుకోవచ్చు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సార్దకుడు సమాధి స్థితిని చేరుకునేలా తన సాధనను కొంగసాగించాలని సాధకులందరు మోక్షగాములు కావాలని అభిలాష. 

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 


 

కామెంట్‌లు లేవు: