🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴
_*శుక్రవారం*_
_*ఫిబ్రవరి 17, 2023*_
_*మాఘ పురాణం*_
_*27 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*సులక్షణ మహారాజు కథ*
🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️
గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.
నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.
అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినవి. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.
అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద , అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.
*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*
సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.
మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.
సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.
_*ఇరవైఏడవ అధ్యాయము సమాప్తం*_
🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
: 🕉️ *ఓం నమః శివాయ*🔱
🌹 *నమః పార్వతి పతయే*🌹
🔱 *హర హర మహాదేవ*🔱
🔱 *శంభో శంకర!!*🔱
🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️
*ఒక ఆధ్యాత్మిక మిత్రుడు*
*పంపినది భాగస్వామ్యం*
*చేయడమైనది*
🔯 *మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం రుద్రం.....!!*🔯
శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించ గల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.
రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.
నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత :
నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చాలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మోక్షం కోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువాకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.
చమకం విశిష్టత:
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతి పనిని మనిషి ఆస్వాదించి, చివరకు
అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుండి ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..
🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴
_*శనివారం*_
_*ఫిబ్రవరి 18, 2023*_
_*మాఘ పురాణం*_
_*28 వ అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*క్రూర (రా) కథ*
🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️
గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.
ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు ? కలహమునకు కారణమేమి ? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము ? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు ? నేను గాని , నా భార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి ? మీ యీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము , కీర్తి , సుఖము , గౌరవము , జ్ఞానము మున్నగునవి నశించును కదా ! సర్వజ్ఞులైన , పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.
పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత ? నీ భార్యయెంత ? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు , అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము , గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.
కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము , నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు , మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.
క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.
క్రూర పశ్చాత్తాపమునందెను , పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి , పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు , ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి , చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.
సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన , శ్రీహరి మహిమను వినుటవలన , వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో , ఉత్తమ మునులు , సజ్జనులు , రాజులు , వైశ్యులు , బ్రాహ్మణులు , శూద్రులు , పురుషులు , స్త్రీలు , బాలురు , పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన , చూచుట వలన , వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో , చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను ? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.
_*ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తం*_
🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి