25, జూన్ 2023, ఆదివారం

శ్రీ రంగనాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : 






⚜ కడప జిల్లా : పులివెందుల


⚜ శ్రీ రంగనాథ స్వామి ఆలయం


💠 పూర్వం ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. 


💠 పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం చాల ప్రసిద్దమైనది. 

పులివెందులలోని గోస్తని తీర్థం ఒడ్డున వెలసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మాంధాత మహారాజు నిర్మించాడని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ  క్షేత్రం దివ్యస్థలంగా మారిందని ఆలయ చరిత్ర  చెబుతోంది. 


💠 1509 లో  బెజవాడ పురాధీశుడైన నరసయ్యదేవ , పులివెందుల శ్రీరంగరాజుల ( శ్రీరంగనాథుడి) నైవేద్యానికి, అంగరంగ వైభోగాల కోసం పులివెందుల  స్థలమందలి కుందలూడు అనే గ్రామాన్ని దానంచేశాడు.

ఈ శాసనం చారిత్రకంగా ఏంతో విలువైనది 


 💠 1509 నుండి 1690 వరకు శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. 1690 వ సంవత్సరంలో ఔరంగజేబు సర్దార్ మహమ్మద్ జాఫర్ సాహెబ్ ఈ ఆలయాన్ని కొల్లగొట్టి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశాడు.


💠 ఆ తరువాత ఈ ప్రాంతము మరాఠాల ఆధీనంలో ఉన్నప్పుడు పీష్వా బాలాజీ బాజీరావు సమయంలో చిన్న రంగాపురం కరణము పూనా వెళ్లి బాలాజీ బాజీరావు అనుమతి  తీసుకొని 1756 సంవత్సరంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ విగ్రహాన్ని పునరుద్ధరించాడు.


💠 శ్రీ రంగనాథస్వామి మహిమల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నవి. 

పులివెందుల ప్రాంతం ఒకప్పుడు  వేములపాలెంలో ఉండేది. 

982వ సంవత్సరంలో వేముల కోటను జయించడానికి రాజరాజ చోళరాజు సైన్యం దండెత్తి రాగా, వేముల పాలేగాడు శ్రీరంగనాథుడి భక్తుడైన భట్టారువారి వంశీకుడు ఆలయమును చేరి స్వామివారిని ప్రార్థించగా రంగనాథస్వామి కృపవల్ల తెల్లవారేసరికి చోళ రాజ్య సైన్యం భయపడి పలాయనం అయ్యారట. 

అప్పుడు వేముల పాలేగాడు భట్టారు వంశీకులకు "దుర్వార చోళ గర్వ తమో నిరసన మార్తాండ" అని బిరుదునిచ్చారట.


💠 ప్రతి ఏటా శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు ఇప్పటికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

పులివెందుల మున్సిపాలిటీ లోగో కూడా రంగనాథ స్వామి ఆలయ గోపురాన్ని చూడవచ్చు .

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పులివెందులలోని మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం మరియు రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేసింది.


💠 గుప్త నిధుల అన్వేషణ లో దుండగుల చేతిలో గర్భగుడిని చాలాసార్లు ధ్వంసం చెయ్యగా మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించారు, అలా ఈ ఆలయంలోని మూలవిరాట్‌ని ఇప్పటికి 3 సార్లు మార్చడం జరిగింది. 


💠 ఇప్పుడు ఉన్న విగ్రహం ఆదిశేషువుపై శయనించిన విష్ణు మూర్తిలాగా చాలా అందంగా ఉంటుంది. 

ఈ గుడిని చాల విశాలంగా ఎంతో సుందరంగా కట్టించారు.

గర్భగుడికి రెండు వైపుల రెండు చిన్న ఆలయాలు వాటిలో భూదేవి, నీళాదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. 


💠 గుడి వెనుక  భాగాన నాగదేవత విగ్రహలు రావి చెట్టు కింద ఉన్నాయి. మరో ప్రక్కన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.

అన్ని ప్రసిద్ధ ఆలయాలలాగానే ఈ ఆలయానికి కూడా నాలుగు ద్వారాలు ఉన్నాయి, ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గోపురం శిథిలావస్థలో ఉన్నందున, దాన్ని తొలగించి తిరిగి కట్టడం ప్రారంభించారు. 

గుడి ప్రాంగణం వెలుపల ఎంతో విశాలమైన పార్కు ఏర్పాటు చేసారు, 


💠 ఇక్కడి  శిల్పాలు కుడా చాలా అందంగా కనులకు వినోదాన్ని కలిగిస్తాయి.

ఈ ఆలయం ఔటెర్ రింగ్ రోడ్ కి ఆనుకుని పులివెందుల టౌన్ కి ఒక కిమీ దూరంలో ఉంది. 


💠 ఇక్కడికి చేరుకోవడానికి అన్ని ప్రముఖ పట్టణాలనుండి పులివెందులకు బస్ సౌకర్యం కలదు. 

పులివెందుల పట్టణం నుండి గుడికి ఆటోలో వెళ్లొచ్చు.

కామెంట్‌లు లేవు: