25, జూన్ 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ .*పార్ట్ - 101*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


.*పార్ట్ - 101*


ఆ అంగుళీయకాన్ని చూస్తూ సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. దానిపై రాక్షసామాత్యుని పేరు చెక్కి ఉన్నది. దానిని చాణక్య శిష్యుడు భద్రుడు తెచ్చి సమర్పించాడు. 


చాణక్యుడు ఆ ఉంగర పరిశీలనము ముగించి తలెత్తి "చెప్పు" అని ఆదేశించాడు. భిక్షుక వేషంలో ఉన్న భద్రుడు గొంతు సవరించుకొని "నేనీ భిక్షుక వేషంలో నగరంలో వీధుల్లో సంచరిస్తూ, శత్రు రహస్యాల కోసం అన్వేషిస్తూ ఒక ఇంటి ముందు నేను భిక్ష కోసం అరుస్తుండగా ఒక బాలుడు నా గొంతువిని బాల్యచాపల్యం చేత బయటికి పరిగెత్తుకొచ్చాడు. మరుక్షణమే ఆతని తల్లి పరిగెత్తుకువచ్చి కంగారుగా కుమారుని ఎత్తుకొని లోనికి తీసుకుపోతుండగా ఆమె చేతివ్రేలినుండి ఆ ఉంగరము జారి నా ముందు పడింది. ఆమె తన కంగారులో ఉంగరం పడిపోవడానికి గమనించలేదు గానీ, నేను ఆ తల్లీ బిడ్డలను గుర్తించాను. వారు రాక్షసామాత్యుని భార్య, కుమారుడు. ఆ ఉంగరాన్ని ఎవ్వరూ చూడకుండా తస్కరించి....." అని చెప్పి నవ్వాడు. 


చాణక్యుడు తల పంకించి "మంచిది. ఇక నువ్వు పోవచ్చు...." అని చెప్పాడు. భద్రుడు నమస్కరించి నిష్క్రమించాడు. 


చాణక్యుడు తన శిష్యుడు ఆగమసిద్ధిని పిలిచి "కుమార చంద్రగుప్తునికి మా సందేశాన్ని తక్షణమే వెళ్లి వినిపించు. నేపాళ ప్రభువు పర్వతకుని మృతదేహం పైనుంచి తీసి దాచిన వారి ఆభరణాలను వెంటనే ముగ్గురు సద్భ్రాహ్మణులకు దానమియ్యవలెను. ఆ ముగ్గురు బ్రాహ్మణులను కూడా మేమే పంపిస్తామని చెప్పు. వెళ్ళు" అని ఆదేశించాడు. 


ఆగమసిద్ధి ఆగమేఘాల మీద చంద్రగుప్తుని వద్దకు వెళ్లి చాణక్యుని ఆదేశాన్ని వినిపించాడు. ఆ తదుపరి చాణక్యుని పనుపున్న ముగ్గురి శిష్యులు అక్కడికి వచ్చి ఆ దానములు స్వీకరించి, తిరిగి వచ్చి ఆభరణాలు చాణక్యునికి సమర్పించి నిష్క్రమించారు. 


అనంతరం చాణక్యుడు తన శిష్యుడు గుణశర్మకి ఆ నగలు అప్పగించి "నీవు తక్షణం రత్నవ్యాపారి వేషం ధరించి నేపాళ రాజధాని మంజుపట్టణానికి వెళ్ళు. ఈ ఆభరణాలు రాక్షసునికి విక్రయించు" అని రహస్యంగా ఆదేశించాడు. గుణవర్మ తలవూపి ఆ ఆభరణాలతో నిష్క్రమించాడు. అంతట చాణక్యుడు తిక్కిరి బిక్కిరి రాతతో ఒక లేఖ రాసి, తన శిష్యుడు సిద్ధార్థకునికి ఇచ్చి "సిద్ధార్థకా ! ఈ చేతి వ్రాత తిక్కిరి బిక్కిరి వున్నదని సాకు చూపి రాక్షసమిత్రుడు శకటదాసు స్వహస్తాలతో సాపు ప్రతి వ్రాయించి తీసుకురా. అతడు వృత్తిరీత్యా లేఖకుడు గనక నిన్ను అనుమానించడులే..." అని చెప్పి పంపించాడు. 


ఒక అర్థఘడియ కాలము తర్వాత సిద్ధార్థకుడు లేఖతో తిరిగి వచ్చాడు. చాణక్యుడు లేఖపై రాక్షసుని అంగుళీయకపు ముద్రవేసి ఆ లేఖని, అంగుళీయకాన్ని సిద్ధార్థకునికి ఇచ్చి అతని చెవిలో గుసగుసలాడి "అర్థమైంది గదా...." అన్నాడు. సిద్ధార్థకుడు మందహాసం చేసి తలవూపి వెళ్ళిపోయాడు. చాణక్యుడు మరి కాసేపు ఆలోచించి నగర రక్షకభటాధ్యాక్షుడిని తన ఆశ్రమానికి పిలిపించాడు. 


"లేఖరి శకటదాసు రాజద్రోహి. అతని తక్షణం బంధించండి. రేపు ఉదయమే అతడికి శూలారోహణం ద్వారా మరణశిక్ష అమలు చేయండి... పర్వతక మరణానికి కారణమైన విషకన్య సృష్టికర్త ఆ బౌద్ధ బిక్షువు జీవసిద్ధి. మరణము పర్వతకుడికి సంభవించినా దానిని ప్రయోగించబోయినది మన మహారాజుల వారిపైన... కనక ఆ జీవసిద్ధిని తక్షణం బంధించి అతనికి శిరోముండనం గావించి, గాడిదపై నెక్కించి ఊరేగించి దేశాన్నుంచి వెళ్లగొట్టండి.... అలాగే రత్నవ్యాపారి చందనదాస శ్రేష్టికి కబురుపెట్టండి. వారి సత్వర దర్శనం మాకు అవసరం...." అని ఆజ్ఞాపించాడు చాణక్యుడు. 


చాణక్యుని ఆజ్ఞను అనుసరించి శకటదాసును బంధించి కారాగారంలో పడేశారు. బౌద్ధభిక్షువు జీవసిద్ధికి గుండుగీయించి, గాడిదపై ఊరేగించి నగరాన్నించి వెళ్ళగొట్టారు. ఇవి జరుగుతుండగానే చందనదాసు ఆశ్రమానికి వచ్చి చాణక్యుని దర్శించుకున్నాడు. 

(ఇంకా ఉంది)....🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: