25, జూన్ 2023, ఆదివారం

ఉపనిషత్తులు

 *ఉపనిషత్తులు* 

    ➖➖➖


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఇవి వేదాల చివరి భాగాలు, అందుకే వీటిని వేదాంతాలు, వేదాంతము అని కూడా అంటారు. సాధారణంగా వేదాలలో నాలుగు భాగాలు ఉంటాయి.


*1. సంహితలు*

వీటిలో మంత్రాలు స్తోత్రాలు ఆవాహనలు సంబంధించినవి ఉంటాయి.


*2. బ్రాహ్మణములు*

ఇందులో సంహితలలోని మంత్రాలను శాస్త్రవిధిగా వివరించే విషయాలు , యజ్ఞ యాగాదులకు వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు


*3. అరణ్యకములు*

ఇందులో వివిధ కర్మకాండలు యజ్ఞ యాగాదులకు సంబంధించిన వివరాలు ఉంటాయి


*4. ఉపనిషత్తులు*

ఇవి పూర్తిగా జ్ఞానకాండ కు సంబంధించినవి అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, మోక్షము, లోకము  ప్రాణులు, ప్రకృతి, భగవంతుడు మొదలగంశాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది.


నాలుగు వేదాలలో కలిపి మొత్తము 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే వేదాలలో ఉన్న శాఖల ఆధారంగా వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవి, వాటిలోనూ 10 మాత్రమే ప్రధానమైనవి.


*ఉపనిషత్తుల వివరణ*

భారతీయ తత్వ శాస్త్రానికి ఉపనిషత్తులు శిరోమాణిక్యాల వంటివి. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుని అభ్యసించడం లేదా సమీపమును కూర్చుని నేర్చుకునే విద్య అని భాష్య కారులు అర్థం చెప్పారు. ఈ ఉపనిషత్తులకే వేదాంతం అనే మరొక పేరు కూడా కలదు.


వేద సూక్తులు ఆర్యుల కవితావేశానికి చిహ్నం. అంతటి సామర్థ్యం గల ఒక శాఖ ఆర్యులలో ఉండి, ఈ వేదాలు ఉద్భవించడానికి కనీసం కొన్ని శతాబ్దాలు పట్టి ఉంటుంది. ఇందులో అనార్యులు కూడా చాలామంది చేరారు. ఈ ఉపనిషత్తులు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత రూపొందాయని భావిస్తారు.


అయితే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు, ఒక్క భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక ప్రకాశంతో విరాజిల్లింది . అప్పుడు సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వారు సాక్షాత్కరించుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ఈ ఉపనిషత్తులు కొన్ని బ్రహ్మ తత్వాన్ని, గురించి కొన్ని ఆత్మ తత్వాన్ని ,గురించి కొన్ని దేహ తత్వాన్ని గురించి, కొన్ని ప్రపంచ స్వరూపాన్ని, మరికొన్ని జీవస్వరూపాన్ని, మరికొన్ని పంచభూతాలైన పృథ్వి నీరు నిప్పు గాలి, ఆకాశాల స్థూల సూక్ష్మరూపాలను, మరికొన్ని మరణాన్ని ,మరణానంతర స్థితులను, కర్మలను ,ఆశ్రమ ధర్మాలను, మోక్ష స్వరూపాలను గురించి చర్చించాయి. అంటే ఈ ఉపనిషత్తులు మొత్తం మీద జ్ఞానాన్ని గురించి మాత్రమే చర్చించాయి మిగతాయి కర్మకాండం గురించి చర్చించాయి ఉపనిషత్తులు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన విషయాల గురించి చర్చించాయి.

    

ఈ ఉపనిషత్తులు అన్నీ వాదప్రతివాద , సంవాదాల రూపంలో ఉంటాయి. అంటే ఒకరు ఒక విషయాన్ని గురించి ప్రశ్నించడం, ఆ ప్రశ్నకు అనేకమంది కానీ లేదా ఏ ఒక్కరో కానీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నను వేయడం దానికి సమాధానం చెప్పడం, ఆ సమాధానాన్ని ఖండించడం లేదా సమర్థించడం లేదా సంస్కరించడం లేదా మరొక నూతనమైన సమాధానాన్ని చెప్పడం ఉపనిషత్తులోని వాద పద్ధతిని సూచిస్తాయి. ఈ వాద ఉపవాదాలు అతి విశాలమైన అరణ్యాల్లోనూ, ఆశ్రమాలలోనూ విద్వత్ సభల్లోను జరిగాయి. ప్రతి ఉపనిషత్తు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు వారు మొత్తం ఉపనిషత్తులలో ముఖ్యమైన పది ఉపనిషత్తులకు భాష్యాలను వ్రాశారు.


*ప్రధానమైన పది ఉపనిషత్తులు*

1. ఈశావాశ ఉపనిషత్తు

2. కేన ఉపనిషత్తు

3. కఠ ఉపనిషత్తు

4. ప్రశ్న ఉపనిషత్తు

5. ముండక ఉపనిషత్తు

6. మాండూక్య ఉపనిషత్తు

7. త్తెత్తరీయ ఉపనిషత్తు

8. ఐతరీయ ఉపనిషత్తు

9. ఛాందోగ్య ఉపనిషత్తు

10. బృహదారణ్యక ఉపనిషత్తు.

      

కామెంట్‌లు లేవు: