23, అక్టోబర్ 2023, సోమవారం

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 62*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 62*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*ప్రకృత్యాఽఽరక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః*

*ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |*

*న బింబం తద్బింబ ప్రతిఫలనరాగా దరుణితం*

*తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా ‖*

 

ఈ శ్లోకంలో అమ్మవారి పెదవులను వర్ణిస్తున్నారు. లలితా సహస్ర నామములలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి పెదవులను వర్ణిస్తూ *నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా* అని గానం చేశారు. అంటే అమ్మవారి పెదవులను నవ విద్రుమమును 

అంటే క్రొత్త పగడములతోనూ, బింబమునూ అనగా దొండపండ్లతోనూ పోల్చారు. అయితే శంకరులు ఇక్కడ వర్ణన చేస్తూ పగడములూ, దొండపండ్లూ అమ్మవారి పెదవుల అరుణిమకు సరితూగవంటున్నారు. 

పై పెదవిని ఓష్ఠము అనీ, క్రింది పెదవిని అధరము అనీ అంటారు. కవులు నాయికా వర్ణనము చేస్తూ మధురోష్ఠము/మధురాధరము అని చెప్పటం వినివుంటారు.


ప్రకృత్యాఽఽ రక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః = స్వభావసిద్ధముగా రక్తవర్ణములో ఎర్రగా వున్న అమ్మ పెదవులు. చ్ఛదము అంటే తెర. ఇక్కడ అమ్మవారి దంతములకు తెర వలె నున్నవి అంటున్నారు. 

లలితా సహస్రనామములలో *రదనచ్ఛదా* అన్నారు. రదనము అంటే వాక్కు. వాక్కుకు తెర అని.


ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా = అందరూ అనుకొనేది పగడములు తీగకు కాసి, పండి, వాటి నుండి సేకరింపబడతాయని. కానీ అవి ఆక్టోపస్ జాతికి చెందిన ఒక జలచరము యొక్క ఎముక భాగము అని కంచి మహాస్వామివారు అభిప్రాయపడ్డారు. పైగా తీగకు పండినవని అనుకొన్నా, తీగ ఆకుపచ్చగా వుండి యెర్రని అమ్మవారి శరీరకాంతికి సరిపోలేదు. అందువలన అమ్మవారి పెదవులు పగడములతో పోల్చటం సరికాదు అంటున్నారు. పగడముల కాంతిని మించినవి అమ్మవారి పెదవులు.


న బింబం తద్బింబ ప్రతిఫలనరాగా దరుణితం = బింబమంటే దొండపండు. దొండ తీగ ఆకుపచ్చతనానికీ, అమ్మవారి గౌర వర్ణానికీ సరిపోలదు.అమ్మవారి శరీర కాంతి దొండపండులో ప్రతిఫలించినదంటే ఒప్పుకోవచ్చు అంటున్నారు.


తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా = అందువలన నీ పెదవుల అరుణిమతో తులతూగలేని పగడములు, దొండపండ్లూ లజ్జాభారంతో కృంగిపోతున్నవమ్మా అంటున్నారు.


లలితా సహస్రనామాల్లో పైన చెప్పిన నామమే కాక, మరొకటి *తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా* అన్న నామాన్ని కూడా స్మరించుకోవచ్చు. తాంబూలసేవనం చేసిన నోరు దానిమ్మ పూవు వలె యెర్రని కాంతులను కలిగివున్నది అని భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: