మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*
*(ఐదవ రోజు)*
శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..
ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.."
"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."
"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."
ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి.. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..
మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..
"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..
దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..
మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..
"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..
శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి