23, అక్టోబర్ 2023, సోమవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 72*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 72*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


దట్టంగా పెరిగిన మహావృక్షం అనేకులకు నీడనిచ్చి కాపాడుతుంది. కాని ఆ నీడలో కొత్తచెట్లు ఏపుగా పెరగవు. ఆ నీడ ప్రభావం నుండి విడివడినప్పుడే  తక్కిన చెట్లు పెరగగలవు. శ్రీరామకృష్ణులనే కల్పతరువు తన నీడలో పలు మొలకలను కూడా పెరగనిచ్చింది. అయినప్పటికీ అవి ఏపుగా పెరగాలంటే ఆ తరువు తన నీడను ఉపసంహరించుకోవాలి. అందుకు శ్రీరామకృష్ణులు సంకల్పించుకొన్నారు..


1884వ సంవత్సరాంతం నుండే శ్రీరామకృష్ణుల ఆరోగ్యం క్షీణించ సాగింది.  ఎక్కువగా మాట్లాడడం వలనా, పాడడం వలనా, పారవశ్య స్థితుల కారణంగా గొంతులో రక్త ప్రసరణ అధికరించడంతో ఆ నొప్పి ఏర్పడిందనీ కనుక వాటినన్నింటినీ ఆపివేయమని వైద్యులు హెచ్చరించిన  ఖాతరు చేయలేదు.


జూన్ నెల తరువాత హఠాత్తుగా ఆయన గొంతులో రక్తం స్రవించింది. మామూలు గొంతు వ్రణమై ఉంటుందని భావించబడిన ఆయన రుగ్మత, అంత సామాన్యమయినదిలా కనిపించలేదు. భక్తులు కలత చెందారు. "ఎవరిని కేంద్రంగా చేసుకొని మనం ఆనందంలో తేలియాడుతున్నామో ఆయన మనలను వదలి నిష్క్రమిస్తారని అనిపిస్తున్నది.


శ్రీరామకృష్ణులకు ఉత్కృష్ట వైద్యచికిత్సకు తగిన సౌకర్యాలు దక్షిణేశ్వరంలో లేవు. కనుక కలకత్తాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొన్నారు.  దక్షిణేశ్వరంలో ఆరుబయట జీవించడానికి అలవాటుపడిన శ్రీరామకృష్ణులు ఆ చిన్న ఇంట్లో ఇమడలేక బాగా ఇబ్బందికి గురి కావడంతో శ్యాంపుకూర్ అనే ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు పుచ్చుకొన్నారు.శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ కు వచ్చి మూడు నెలలు గడిచిపోయాయి.


వైద్యుల చికిత్స, మాతృదేవి పరిపోషణ, యువశిష్యుల సేవాశుశ్రూషల ఫలితానికి విరుద్ధంగా ఆయన వ్యాధి రోజురోజుకీ తీవ్రం కాసాగింది. మునుపు కాస్త సత్ఫలితాలను ఇచ్చిన మందు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణ కారణంగానే వ్యాధి ప్రకోపిస్తున్నదని నిర్ధారణ చేసిన వైద్యులు, నగర ప్రాంతాన్ని వదలి బాగా విశాలంగా ఉండే నగర శివార్లకు ఆయనను తరలిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన మేరకు భక్తులు కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకొన్నారు. 1885 డిసెంబర్ 11వ శ్రీరామకృష్ణులు బసను అక్కడకు మార్చారు. 


రామకృష్ణసంఘ చరిత్రలో కాశీపూర్ చెరగని స్థానం పొందింది. ఇక్కడ శ్రీరామకృష్ణులు దాదాపు ఎనిమిది నెలలు గడిపారు. అద్వితీయమైన ఆయన దివ్య జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితానికి ఒక ఆకృతి కల్పించి, యువకులను అతడికి అప్పగించి రామకృష్ణసంఘానికి అంకురార్పణ చేశారు. ఈ ఎనిమిది నెలలలో ఆ వ్యాధి క్రమంగా ప్రకోపించి ఆయన శరీరాన్ని కేవలం ఒక ఎముకల గూడుగా మార్చివేసింది. 


అయినప్పటికీ అచంచలమైన ఆయన మనస్సు వ్యాధినీ, తద్వారా సంక్రమించిన నొప్పినీ వైదొలగజేసింది. ఇక్కడ ఆయన శిష్యులకూ, భక్తులకూ అవసరానికి తగినట్లు విడివిడిగాను, కొన్ని సమయాల్లో సామూహికంగాను శిక్షణ నిచ్చారు. ప్రత్యేకంగా, నరేంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి ఉపదేశించారు. కొన్ని సందర్భాలలో తలుపులు, కిటికీలు బిగించి, అతడికి ప్రత్యేకంగా బోధించారు. ఆయన బోధించిన దేమిటో నరేంద్రుడు ఎవరికీ వెల్లడించలేదు. కాని యువకుల బాధ్యతను అప్పగించడం గురించీ, వారికి శిక్షణను ఇవ్వడం గురించీ ఆయన నరేన్ తో చర్చించి ఉంటారని తక్కిన శిష్యులు భావించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: